సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో క్రాస్ ఎగ్జామిన్‌కు హాజరుకానున్న లోకేష్

సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌ క్రాస్ ఎగ్జామినేష‌న్‌‌కు హాజరుకానున్నారు. ఈ నెల 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జ‌ర‌గ‌నున్న క్రాస్ ఎగ్జామినేష‌న్‌కి మంత్రి నారా లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిప‌త్రిక‌లో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాల‌తో ఉద్దేశ‌పూర్వకంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్నారు.

అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్రతిష్టని మంట‌గ‌లిపేందుకు ప్రయ‌త్నించార‌ని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కార‌ణాల‌తో చాలా రోజులుగా వాయిదాలు ప‌డిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లైంది.

వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు.

నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈనెల 29వతేదీన సాక్షి పత్రికపై దాఖలుచేసిన పరువునష్టం దావా కేసులో వాయిదాకు నారా లోకేష్ హాజరుకానున్నారు.

అమరావతిలో కేంద్రం తాజా ప్రతిపాదన - కొత్త రూపు..!!

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి డిసెంబర్ లో పనులు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి కోసం రూ 15 వేల కోట్ల రుణం పైన కేంద్రం హామీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు టీం పరిశీలన చేసింది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని గుంటూరు - విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.

అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ - గుంటూరు నగరాలకు నగరాలకు కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్‌ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసారు. దీని పైన కసరత్తు మొదలైంది.

తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్‌లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్‌ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్‌, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం. ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం కార్పోరేషన్ లో కలవనున్నాయి.

అదే విధంగా తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకాకాని, గంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అయితే, అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటం ద్వారా రాజధాని ప్రాంతం రూపు రేఖలు భవిష్యత్ లో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీపీఆర్ తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది. దీంతో..సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధి పై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.

సీఎం ఇలాకలో టీచర్లు లేక స్కూల్‌ బంద్‌.. ఎందుకింత నిర్లక్ష్యమని నిలదీసిన హరీశ్‌రావు

సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకలో ఉపాధ్యాయులు లేక ఓ పాఠశాల మూతపడింది. కొడంగల్‌ మండలం అప్పాయిలపల్లి అనుబంధ గ్రామమైన ఆశమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకలో ఉపాధ్యాయులు లేక ఓ పాఠశాల మూతపడింది. కొడంగల్‌ మండలం అప్పాయిలపల్లి అనుబంధ గ్రామమైన ఆశమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. అతని స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడిని నియమించారు. కానీ అతను పెళ్లి ఉందని నెల రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతపడింది.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.

రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

అమరావతికి రుణం మంజూరులో కీలక పరిణామం..!!

ఏపీ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది. రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్..ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించింది. వారం రోజుల పాటు రాజధానిలో ప్రాంతంలో పర్యటించిన వారు వివిధ అంశాలపై ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వచ్చే నెలలో మరోసారి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు పర్యటించనున్నాయి. అక్టోబర్ లో అమరావతికి రుణం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

అమరావతికి రుణం విషయంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. వారం రోజుల పాటు రాజధానిలో ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు భూ సమీకరణ, ఎల్పీఎస్ సహా ఇతర సామాజిక అంశాలపై ఆరా తీశారు. అమరావతి పరిధిలోని వివిధ కట్టడాలు, కొండవీటి వాగు, హెల్త్ సెంటర్లు, సెక్రటేరీయేట్, రోడ్లు, డక్ట్‌లు, డ్రైన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీఎం చంద్రబాబుతో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు.

రాజధాని పరిధిలోని అర్బన్ గవర్నెన్స్, ఆర్థిక వ్యవస్థ, వరద నిర్వహణ సవాళ్లపై తమ పర్యటనలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు చర్చించాయి. అమరావతి ప్రణాళికలు, కోర్టు కేసుల పైన ఆరా తీసారు. రైతుల భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చర్చించారు. వీరు వచ్చే నెల మూడో వారంలో మరో విడత రానున్నారు. అప్పుడు రుణం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఆర్డీఏ ఇప్పటికే రూ 15 వేల కోట్లకు డీపీఆర్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

ఈ నెల 30న విదేశీ రుణాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఆర్డీఏ నుంచి వచ్చిన నివేదికను పరిశీలించనుంది. ఆ తరువాత ప్రతిపాదనలన ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు పంనుంది. అక్టోబర్ లో ఈ రెండు బ్యాంకుల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రుణ ప్రతిపాదనల పైన చర్చించి ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే, కేంద్రం నుంచి ఈ రుణం పైన ఇప్పటికే హామీ రావటంతో..అమరావతికి అక్టోబర్ లో రుణం పైన సానుకూల ప్రకటన వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనంకానున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అవుతారు. ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారత జాగృతి ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి కవిత చేరుకోనున్నారు.

కాగా.. గత ఐదు నెలలకుపైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 45(1) కింద మహిళలకు బెయిల్‌ మంజూరు చేసే నిబంధనను.. కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింపజేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ.. మహిళేనని పేర్కొంది. ఈ మేరకు, బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది.

రెండు కేసుల్లోనూ రూ.10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో, స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్‌ వారెంట్లను జారీ చేసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి కవిత విడుదలయ్యారు.

నాగార్జునకే కాదు శోభిత ధూళిపాళకు కూడా హైడ్రా షాక్!

గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని తెలుగులో ఒక నానుడి ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరుతుంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ల వలన శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ల వల్లనే అశుభం జరిగిందని చెప్పుకోవడం గతంలో ఉంది. ఇక తాజాగా కూడా కొత్త కోడలు శోభిత ధూళిపాళపై అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు లింక్ పెట్టి దారుణమైన చర్చ జరుగుతుంది

శోభిత ఇంట్లో అడుగుపెట్టడమే నాగార్జునకు నష్టం చేసిందని, ఎంగేజ్మెంట్ జరిగితేనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగి నాగార్జునకు తీవ్ర నష్టం జరిగితే ఇక పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో అని.. పాపం శోభితను టార్గెట్ చేస్తున్నారు . కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత దూళిపాళ్ల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన దారుణమైన ట్రోలింగ్స్, వేణు స్వామీ షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా నాగర్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి అని, ఇది 100% శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ వల్లేనని జాతకాలను నమ్మేవారు జోరుగా చర్చలు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న ఇలాంటి అపోహలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళుతున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణం అని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది ఆక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే దానిని శోభిత దూళిపాళ్ల ఎంట్రీ తో ముడిపెట్టడం సోషల్ మీడియాలో శోభితను ట్రోల్ చేయడం మాత్రం దారుణం.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించటం అన్యాయం. ఇక కొందరైతే సమంతకు చేసిన అన్యాయం వల్లే ఇప్పుడు నాగార్జున కుటుంబంలో ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కు కూడా అని ఈ చర్చతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూళిపాళ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు.. అయ్యో పాపం అంటున్నారు. ఈ పరిస్థితి మారాలని అంటున్నారు. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం..పరుగులు తీసిన జనాలు !

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3:40 స్వల్ప భూకంపం చోటు చేసుకుంది.

దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరోసారి ఉదయం 4:03 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు.

దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

నేడు బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మంగళవారం బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు.

ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని కోరారు.

కాగా, మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎలాంటి బంద్‌ను అనుమతించబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే బంద్ కారణంగా సాధారణ జన జీవనం దెబ్బ తినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

హలో నేను సీజేఐని రూ.500 పంపగలరా

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుంటూ డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగిన ఓ సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో, CJI పేరును దాని హ్యాండిల్‌గా, డిస్‌ప్లే ఇమేజ్‌కి ఆయన చిత్రాన్ని ఉపయోగించిన స్కామర్, కొలీజియం సమావేశానికి హాజరయ్యేందుకు క్యాబ్‌ కోసం రూ.500 కావాలని కైలాష్ మేఘ్‌వాల్‌ అనే ఎక్స్ వినియోగదారుడిని కోరాడు. ఆ డబ్బు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "హలో, నేను CJIని. ఇవాళ కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. నేను కనాట్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం 500 రూపాయలు నాకు పంపగలరా?" అని సైబర్ నేరగాడు తన చాట్‌లో రాశాడు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి, విలాసవంతమైన కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్‌లను విక్రయిస్తామనే సాకుతో ఓ సైబర్ నేరగాడు ఇద్దరి నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.