తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.

రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.

అమరావతికి రుణం మంజూరులో కీలక పరిణామం..!!

ఏపీ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ అందింది. రాజధాని నిర్మాణం కోసం రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్..ఏడీబీ సూత్రప్రాయంగా అంగీకరించింది. వారం రోజుల పాటు రాజధానిలో ప్రాంతంలో పర్యటించిన వారు వివిధ అంశాలపై ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వచ్చే నెలలో మరోసారి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు పర్యటించనున్నాయి. అక్టోబర్ లో అమరావతికి రుణం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

అమరావతికి రుణం విషయంలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. వారం రోజుల పాటు రాజధానిలో ప్రాంతంలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు భూ సమీకరణ, ఎల్పీఎస్ సహా ఇతర సామాజిక అంశాలపై ఆరా తీశారు. అమరావతి పరిధిలోని వివిధ కట్టడాలు, కొండవీటి వాగు, హెల్త్ సెంటర్లు, సెక్రటేరీయేట్, రోడ్లు, డక్ట్‌లు, డ్రైన్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సీఎం చంద్రబాబుతో పాటు సీఆర్డీఏ ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు.

రాజధాని పరిధిలోని అర్బన్ గవర్నెన్స్, ఆర్థిక వ్యవస్థ, వరద నిర్వహణ సవాళ్లపై తమ పర్యటనలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బృందాలు చర్చించాయి. అమరావతి ప్రణాళికలు, కోర్టు కేసుల పైన ఆరా తీసారు. రైతుల భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చర్చించారు. వీరు వచ్చే నెల మూడో వారంలో మరో విడత రానున్నారు. అప్పుడు రుణం గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సీఆర్డీఏ ఇప్పటికే రూ 15 వేల కోట్లకు డీపీఆర్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

ఈ నెల 30న విదేశీ రుణాలను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఆర్డీఏ నుంచి వచ్చిన నివేదికను పరిశీలించనుంది. ఆ తరువాత ప్రతిపాదనలన ప్రపంచ బ్యాంకు, ఏడీబీలకు పంనుంది. అక్టోబర్ లో ఈ రెండు బ్యాంకుల బోర్డు సమావేశాలు జరగనున్నాయి. వాటిలో అమరావతి నిర్మాణానికి సంబంధించి రుణ ప్రతిపాదనల పైన చర్చించి ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే, కేంద్రం నుంచి ఈ రుణం పైన ఇప్పటికే హామీ రావటంతో..అమరావతికి అక్టోబర్ లో రుణం పైన సానుకూల ప్రకటన వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) విచారణకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌పై ట్రయల్లో భాగంగా నేడు విచారణ జరుగనుంది. ప్రస్తుతం వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత బసచేశారు. తనను కలవడానికి వచ్చే పార్టీ నేతలను కలిసి మధ్యాహ్నం హైదరాబాద్‌కు కవిత బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనంకానున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో లాండ్ అవుతారు. ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారత జాగృతి ఏర్పాట్లు చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తన నివాసానికి కవిత చేరుకోనున్నారు.

కాగా.. గత ఐదు నెలలకుపైగా తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీలాండరింగ్‌, అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా.. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకొని అప్రూవర్లుగా మార్చుకోవటం ఏమిటని ప్రశ్నించింది. అలాగే, మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 45(1) కింద మహిళలకు బెయిల్‌ మంజూరు చేసే నిబంధనను.. కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింపజేయలేమన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్నా మహిళ.. మహిళేనని పేర్కొంది. ఈ మేరకు, బెయిల్‌ ఇవ్వటానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్‌ మంజూరు చేసింది.

రెండు కేసుల్లోనూ రూ.10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్‌ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో, స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్‌ వారెంట్లను జారీ చేసింది. దీంతో తిహాడ్‌ జైలు నుంచి కవిత విడుదలయ్యారు.

నాగార్జునకే కాదు శోభిత ధూళిపాళకు కూడా హైడ్రా షాక్!

గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని తెలుగులో ఒక నానుడి ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరుతుంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ల వలన శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ల వల్లనే అశుభం జరిగిందని చెప్పుకోవడం గతంలో ఉంది. ఇక తాజాగా కూడా కొత్త కోడలు శోభిత ధూళిపాళపై అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు లింక్ పెట్టి దారుణమైన చర్చ జరుగుతుంది

శోభిత ఇంట్లో అడుగుపెట్టడమే నాగార్జునకు నష్టం చేసిందని, ఎంగేజ్మెంట్ జరిగితేనే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగి నాగార్జునకు తీవ్ర నష్టం జరిగితే ఇక పెళ్లి జరిగితే ఏం జరుగుతుందో అని.. పాపం శోభితను టార్గెట్ చేస్తున్నారు . కొత్త కోడలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభిత దూళిపాళ్ల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన దారుణమైన ట్రోలింగ్స్, వేణు స్వామీ షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా నాగర్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే తొలిసారి అని, ఇది 100% శోభిత ధూళిపాళ్ల ఎంట్రీ వల్లేనని జాతకాలను నమ్మేవారు జోరుగా చర్చలు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న ఇలాంటి అపోహలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళుతున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకింత ఆందోళన కలిగించే అంశం.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణం అని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది ఆక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అయితే దానిని శోభిత దూళిపాళ్ల ఎంట్రీ తో ముడిపెట్టడం సోషల్ మీడియాలో శోభితను ట్రోల్ చేయడం మాత్రం దారుణం.

సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభిత వల్లేనంటూ చర్చించటం అన్యాయం. ఇక కొందరైతే సమంతకు చేసిన అన్యాయం వల్లే ఇప్పుడు నాగార్జున కుటుంబంలో ఇవన్నీ జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభిత కు కూడా అని ఈ చర్చతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభిత ధూళిపాళ గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళాలోకం ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారు.. అయ్యో పాపం అంటున్నారు. ఈ పరిస్థితి మారాలని అంటున్నారు. ఏది జరిగినా ఆడవాళ్ళను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం..పరుగులు తీసిన జనాలు !

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున 3:40 స్వల్ప భూకంపం చోటు చేసుకుంది.

దీంతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మరోసారి ఉదయం 4:03 సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

శ్రీకాకుళం జిల్లాలో భూకంపం చోటు చేసుకున్న తరుణంలో.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు.

దీంతో ప్రజలు ఊపిరి పిల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

నేడు బెంగాల్లో 12 గంటల పాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య కేసులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మంగళవారం బెంగాల్ రాష్ట్ర సచివాలయం నవన్‌కు విద్యార్థి సంఘం నిర్వహించిన మార్చ్‌లో పాల్గొన్న వారిపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో అడ్డుకున్నారు.

ఈ చర్యకు నిరసనగా ఇవాళ ( బుధవారం) రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ బెంగాల్‌లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ పాటించాలని కోరారు.

కాగా, మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై ప్రజల బాధలను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని అధికార తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఎలాంటి బంద్‌ను అనుమతించబోదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ తెలిపారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని వెల్లడించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే బంద్ కారణంగా సాధారణ జన జీవనం దెబ్బ తినకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.

హలో నేను సీజేఐని రూ.500 పంపగలరా

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు.

సోషల్ మీడియాను(Social Media) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకున్న వారు ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తమను తాము సీజేఐగా పరిచయం చేసుకుంటూ డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌లా(Chief Justice DY Chandrachud) తనను తాను పరిచయం చేసుకుంటూ క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగిన ఓ సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నోట్ చూసి అవాక్కయ్యారు. సీజేఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్‌(FIR)ను నమోదు చేసింది.

వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌లో, CJI పేరును దాని హ్యాండిల్‌గా, డిస్‌ప్లే ఇమేజ్‌కి ఆయన చిత్రాన్ని ఉపయోగించిన స్కామర్, కొలీజియం సమావేశానికి హాజరయ్యేందుకు క్యాబ్‌ కోసం రూ.500 కావాలని కైలాష్ మేఘ్‌వాల్‌ అనే ఎక్స్ వినియోగదారుడిని కోరాడు. ఆ డబ్బు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు. "హలో, నేను CJIని. ఇవాళ కొలీజియం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. నేను కనాట్‌లో చిక్కుకున్నాను. మీరు క్యాబ్ కోసం 500 రూపాయలు నాకు పంపగలరా?" అని సైబర్ నేరగాడు తన చాట్‌లో రాశాడు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో సంఘటనలో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌గా నటించి, విలాసవంతమైన కార్లు, ఖరీదైన సెల్‌ఫోన్‌లను విక్రయిస్తామనే సాకుతో ఓ సైబర్ నేరగాడు ఇద్దరి నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మూసీని.. మూసేసి..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..!

అనంతగిరి కొండల్లో జన్మించి.. వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ జిల్లాల మీదుగా మఠంపల్లి వద్ద కృష్ణాలో కలిసే మూసీనదిని ఎక్కడికక్కడ మూసేస్తున్నారు..! రేవంత్‌ సర్కారు లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని కృతనిశ్చయమైనా.. రూ. లక్షన్నర కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ మహా క్రతువుకు అడుగడుగునా అడ్డంకులుగా కబ్జాలు, పూడికలు, డంపింగ్‌ యార్డులు ఉన్నాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం కూడా హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చి.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంటపొలాలకు నీరందించిన మూసీ.. ఇప్పుడు ఆక్రమణలతో కుంచించుకుపోయింది. కొన్ని చోట్ల ఉనికినే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ‘ఆంధ్రజ్యోతి’ బృందం నార్సింగ్‌ ఔటర్‌ నుంచి.. నాగోల్‌లోని మూసీ బ్రిడ్జి వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూసీని మూసేసిన వైనంపై.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..!

అనంతగిరి కొండల నుంచి గండిపేట సమీపం వరకు మాత్రమే మూసీ నది నీరు స్వచ్ఛంగా ఉంటోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో కలుషిత జలాలు ప్రవహిస్తున్నాయి. గండిపేట నుంచి టిప్పుఖాన్‌ బ్రిడ్జి వరకు నాలుగు కిలోమీటర్ల మేర మూసీ నది ఉండగా.. రెండు కిలోమీటర్ల మేర ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌ మీదుగా ప్రవహిస్తోంది. మిగతా రెండు కిలోమీటర్లలో.. నార్సింగ్‌, గండిపేట, మంచిరేవుల, పీరంచెరువు గ్రామ పంచాయతీల పరిధుల్లో.. బఫర్‌ జోన్లు ఆక్రమణలకు గురయ్యాయి.

యథేచ్ఛగా నిర్మాణాలు వెలుస్తున్నా.. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పక్కనే ఉన్న ఐటీ కారిడార్‌ బహుళ అంతస్తుల డ్రైనేజీ మొత్తం మూసీలోనే కలుస్తోంది. అంటే.. కోకాపేట, నార్సింగ్‌, పుప్పాల్‌గూడ, మణికొండ, రాయదుర్గంతోపాటు.. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల మురుగుకు మూసీ అడ్డా అవుతోందన్నమాట.టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వంతెన వరకు మూసీని రెండు వైపులా మట్టితో నింపేసిన భూబకాసురులు.. యథేచ్ఛగా కబ్జాచేసి, లేఅవుట్లు వేశారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ కబ్జాలు, అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లంగర్‌హౌస్‌ బాపూనగర్‌ బస్తీ వెనక కబ్జా పరిస్థితి తారాస్థాయిలో ఉంది. బాపూఘాట్‌, డిఫెన్స్‌ కాలనీ వెనక వైపున్న మూసీ బఫర్‌ జోన్‌లో ఏకంగా రాజకీయ నాయకులే లేఅవుట్లు వేశారు. అంతేకాదు.. టోలిచౌకి, హకీంపేట్‌ ప్రాంతాల్లోని దాదాపు 100 కాలనీల మురుగునీరు బాపూఘాట్‌ వద్ద మూసీలో కలుస్తోంది. టిప్పుఖాన్‌ బ్రిడ్జి నుంచి అత్తాపూర్‌ వరకు మూసీ తీరమంతా చెత్త డంపింగ్‌ యార్డుగా మారిపోయింది.కార్వాన్‌లో మండపాల నిర్మాణం

కార్వాన్‌ గిర్కపల్లి, రాంసింగ్‌పుర, మొఘల్‌-కా-నాలా, అంద్రూనీ/బైరూనీ కార్వాన్‌ ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించారు. రాంసింగ్‌పుర ప్రాంతంలో పరీవాహక ప్రాంతంలో మండపాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో మూసీ నది వెడల్పు పూర్తిగా తగ్గిపోయి.. చిన్న కాలువలా కనిపించడం గమనార్హం..! పక్కనే ఉన్న జియాగూడలో సుమారు 15 గోదాములు మూసీ బఫర్‌జోన్‌లో కొనసాగుతున్నాయి.పహిల్వాన్లు, రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఈ గోదాములకు నెలవారీ అద్దెను వసూలు చేస్తున్నారు. నెలరోజుల క్రితం అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించి.. రెండ్రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించినా.. ఇప్పటికీ ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం గమనార్హం..! మొఘల్‌-కా-నాలా, కేసరి హనుమాన్‌, గిర్కపల్లి ప్రాంతాల్లో మూసీ బఫర్‌ జోన్‌లో దుకాణాలు కొనసాగుతున్నాయి. ఇక జియాగూడలోని కబేలాలో మేకలు, గొర్రెల వ్యర్థాలను పైప్‌లైన్ల ద్వారా మూసీలోకి వదిలేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలు దుర్గంధంగా తయారవుతున్నాయి. గౌలిగూడలోని స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ సమీపంలోని మూసీ ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి అనధికారికంగా నర్సరీని కొనసాగిస్తున్నాడు.పురానపూల్‌ వద్ద హిందూ శ్మశానవాటిక, ఒక దర్గా ఉంది. ఈ రెండూ మూసీ నదిలోనే కొనసాగుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండూ విస్తరిస్తూ.. మూసీని కుంచించుకుపోయేలా చేస్తున్నాయి. దూద్‌బౌలిలోని రమ్నా్‌సపురలో ఉన్న పశువధశాల నుంచి కూడా మూసీలోకి వ్యర్థాలను వదులుతున్నారు. చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జి కింద 18 ద్వారాలుండగా.. అటూఇటూ కలిపి.. 10 ద్వారాలు మూసుకుపోయేలా మట్టితో పూడ్చేశారు. దీంతో కేవలం 8 ద్వారాలే కనిపిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో మూసీ చాలా వరకు కబ్జాకు గురైంది. అంబర్‌పేట్‌ వరకు కబ్జాదారులు మూసీలో అరటి, కొబ్బరిచెట్లను పెంచుతూ.. వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు.వాహెద్‌నగర్‌లో మూసీని మట్టితో పూడ్చడంతో పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్తు తీగలతో ‘ఎర్త్‌’ వస్తుంది. దీంతో.. ఇక్కడ ఆడుకోడానికి వచ్చిన చిన్నారులు పలుమార్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ముసారాంబాగ్‌ బ్రిడ్జి కింద మట్టి, కోళ్ల వ్యర్థాలతో మూసీని కప్పేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో మూసీని ఆక్రమించి దుకాణాలను నిర్మిస్తున్నారు. ఇక కొత్తపేట డివిజన్‌లోని జనప్రియ అవెన్యూ, సత్యానగర్‌ కాలనీల వద్ద పచ్చటి తడ్డి పొలాలు ఉన్నాయి. మూసీలో ఎగువ ప్రాంతాల మురుగు మూసీలోకి ప్రవహిస్తోంది. పరిసర కాలనీల మురుగను పైప్‌లైన్ల ద్వారా మూసీలో కలుపుతున్నారు.

రామంతాపూర్‌, ఉప్పల్‌ భగాయత్‌ గడ్డి భూములలో మాజీ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పేరిట బస్తీలు వెలిశాయి. ఇవన్నీ మూసీ బఫర్‌జోన్‌లో ఏర్పాటైనవే కావడం గమనార్హం..! సందేట్లో సడేమియా అన్నట్లు కొందరు నేతలు ఇక్కడ లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ ప్లాట్లు కొన్నవారికి ఠంచన్‌గా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ.. ఇతర విభాగాల అనుమతులు లభిస్తున్నాయి. ఇక్కడ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా.. అధికారులు, విజిలెన్స్‌ విభాగం వీటి జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగోల్‌ ప్రాంతంలోనూ మూసీని కబ్జా చేస్తూ లేఅవుట్లు, వెంచర్లు వెలుస్తున్నాయి. దీనిపై నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండీఏ అధికారులకు చేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మూసీ బఫర్‌జోన్‌లో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు కొనసాగుతున్నాయి.అంబర్‌పేట డివిజన్‌లో దుర్గానగర్‌, న్యూదుర్గానగర్‌, అహ్మద్‌నగర్‌, నరేంద్రనగర్‌, తదితర ప్రాంతాలు మూసీని ఆనుకుని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మూసీనది క్రమంగా కబ్జాలతో కుంచించుకుపోతోంది. కొందరు ప్లాట్లు చేసి, విక్రయించగా.. ఇంకొందరు గడ్డిని పెంచుతున్నారు. దీంతో దోమల వృద్ధికి ఈ ప్రాంతాలు దోహదపడుతున్నాయి. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి. ఈ ప్రాంతాల్లోని చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు.. వ్యర్థాలను యథేచ్ఛగా మూసీలో వేస్తున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం..!

ప్రస్తుతం హైదరాబాద్‌లో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది హైడ్రా కూల్చివేతలే. ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులకు సంబంధించిన ఫౌమ్ హౌస్‌లు, ఫంక్షన్ హాళ్లు కూల్చేస్తూ.. సంచలనంగా మారింది. అయితే.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ధైర్యంగా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తున్న హైడ్రాను నడపిస్తుంది సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్. హైడ్రాకు కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్.. ఈ కూల్చివేతల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న వేళ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌కు భద్రత పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. రంగానాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసిన నేపథ్యంలో రంగనాథ్‌కు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.

ఇప్పటికే.. 18 ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభించినట్టు తెలుస్తుండగా.. అందులో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నిర్మాణాలు కూడా ఉండటం గమనార్హం. అందులోనూ టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేయటం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది. మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటున్న జన్వాడా ఫాంహౌస్ కూడా రేపో ఎల్లుండో కూల్చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రంగానాథ్ బృందం. దీంతో.. హైడ్రా చర్యలపై కేవలం హైదరాబాద్‌లోనే కాదు.. మిగతా రాష్ట్రాల్లోనూ దుమారం చెలరేగుతోంది.

కాగా.. ఈ హైడ్రా కూల్చివేతలపై అటు పలువురు రాజకీయ నేతల నుంచి.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. హైడ్రా పేరుతో సామాన్యులను రేవంత్ రెడ్డి సర్కార్ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు. చాలా మంది నేతల ఫౌంహౌసులు.. ఇలా బఫర్ జోన్‌లోనే ఉన్నాయని ఇప్పటికే ఓ జాబితా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో.. వాళ్లంతా మీడియా ముందుకొచ్చి గగ్గోలు పెడుతున్నారు

కవిత బెయిల్ బీఆర్ఎస్-కాంగ్రెస్‌ల ఉమ్మడి విజయం - బండి సంజయ్ సెటైర్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ స్పందించారు. కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం అనేది కాంగ్రెస్ పార్టీ - బీఆర్ఎస్ పార్టీలు సాధించిన విజయం అని సెటైర్లు వేశారు. వారి కృషి చివరికి ఫలించిందని వ్యాఖ్యానించారు. కవిత బెయిల్ ద్వారా బయటకు వస్తే.. కాంగ్రెస్ నేత తెలంగాణ నుంచి రాజ్యసభలోకి వెళ్తున్నారని విమర్శించారు.

ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించడంలో విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ అవిశ్రాంత కృషి చివరికి ఫలించింది. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమిష్టి విజయం. బీఆర్ఎస్ నేత బెయిల్ మీద బయటకు వచ్చారు - కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభలోకి వెళ్తున్నారు. కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతకు హ్యాట్సాఫ్. బెయిల్ కోసం వాదించిన అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం.. అధికార కాంగ్రెస్ ఏకపక్షంగా రాజ్యసభకు నామినేట్ చేయడం.. ఈ క్విడ్ ప్రో కో నేరంలో పాలు పంచుకున్న భాగస్వామ్యులకు అభినందనలు. విలీనం మాట ముచ్చట పూర్తయింది.. ఇక "అప్పగింతలే" తరువాయి’’ అని బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ కౌంటర్

మద్యం పాలసీలో ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ కక్ష్యతో దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో 5 నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని 2 రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న బండి సంజయ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అని, ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని అన్నారు. కవిత కేసులో న్యాయవాది వృత్తిపరంగా వ్యవహరించారన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు బయటపడి, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దానితో సంబంధం ఉందని తెలుస్తున్నా, కోట్ల రూపాయలు అక్రమంగా అనుమానాస్పద ఖాతాల్లోకి మళ్లాయని ఆరోపణలు వస్తున్నా, ఇప్పటి వరకు ఈడీ చర్యలు తీసుకోక పోవడంతోనే ఏ పార్టీ ఏ పార్టీతో కలిసి పనిచేస్తుందో అర్ధమవుతున్నదని విమర్శించారు.