శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగళా సర్కిల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలపై ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.
శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాల అధిపతులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రద్దీని నివారించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
భక్తులకు అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ముందస్తుగా చాలినన్ని లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు.
Aug 27 2024, 15:13