యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు.. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది.

అంతర్జాతీయ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2007 ప్రపంచకప్‌లో నెలకొల్పిన రికార్డు బద్దలైంది. ఒకే ఓవర్లో 39 పరుగులు చేసిన బ్యాటర్ సరికొత్త రికార్డు (Record) నెలకొల్పాడు. ఆ సంచలన ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (39 Runs In One Over).

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయిర్ ఈవెంట్‌లో భాగంగా సమోవా, వనాటు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సమోవా వికెట్ కీపర్ డారియస్ విస్సర్ (Darius Visser) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వనాటు బౌలర్ నిపికో వేసిన ఓవర్లో ఏకంగా 39 పరుగులు రాబట్టాడు. ఈ ఓవర్లో నిపికో మూడు నో బాల్స్‌తో సహా 9 బంతులు వేశాడు. ఈ 9 బంతుల్లో డారియస్ 6 సిక్స్‌లు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 39 పరుగులు వచ్చాయి. దీంతో యువరాజ్ సింగ్ ఊచకోత రికార్డు బద్దలైంది. 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఆరు సిక్సర్లు బాది ఈ రికార్డు నెలకొల్పాడు.

అప్పటి నుంచి ఈ రికార్డు పదిలంగా ఉంది. ఆ తర్వాత యువరాజ్ రికార్డును కీరన్ పొలార్డ్ (2021), నికోలస్ పూరన్ (2024), దిపేందర్ సింగ్ (2024), రోహిత్ శర్మ-రింకూ సింగ్ (2024) సమం చేయగలిగారు. తాజాగా ఈ అరుదైన రికార్డును 28 ఏళ్ల డారియస్ విస్సర్ బ్రేక్ చేశాడు. ధనాధన్ బ్యాటింగ్ చేసిన విస్సర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సమోవా 2026 టీ20 వరల్డ్ కప్ అర్హత‌కు అవకాశాలను మెరుగుపర్చుకుంది

దటీజ్ హైదరాబాదీ.. కారు వరదల్లో కొట్టుకుపోకుండా తాడుతో కట్టేశాడు!

హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో హైదరాబాదీ వీధులు కాల్వలను తలపిస్తున్నాయి. కూడళ్లు చెరువులు, కుంటలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఆ వరదలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఆ వరదల నుంచి తన కారును కాపాడుకోవడానికి ఓ వ్యక్తి తాడుతో కట్టేశాడు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్.. వర్షంలో తడిసి ముద్దవుతోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షానికి భాగ్యనగరం జలమయం అయ్యింది. అనేక ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. వరదల్లో వందల సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోయాయి. పదుల సంఖ్యలో కార్లు గల్లంతయ్యాయి. వర్షం తగ్గినా వరద తగ్గకపోవడంతో వాహనాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ వాహనాలను కాపాడుకోవడం ఛాలెంజ్‌గా మారిందని హైదరాబాదీలు వాపోతున్నారు.

తాడుతో కారును కట్టేసి..

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో తన కారు కొట్టుకుపోతుండా తాడుతో కట్టేశాడు. వెనక డోర్ అద్దం నుంచి ముందు డోర్‌కు తాడు కట్టి.. దాన్ని తన ఇంటికి గట్టిగా కట్టాడు. దీంతో వరదలో తన కారు కొట్టుకుపోలేదు. కానీ.. వరద నీటిలో మునిగిపోయింది. రిపేర్ ఖర్చులు ఎంత అవుతాయో తెలియదు కానీ.. కనీసం కారు అయినా మిగిలిందని సదరు వ్యక్తి సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుంది.

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి.. ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయానికి అనుకోని ఉన్న గోడ కూలడంతో.. అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని బాప్టిస్ట్ చర్చి వద్ద విషాదం జరిగింది. విజయ్ (43) అనే రోజువారి కూలీ మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి వరదలో కొట్టుకుపోయి మృతి చెందారు.

జల దిగ్భంధంలో పార్శిగుట్ట..

భారీ వర్షాలకు రాంనగర్‌లో వరదలు వచ్చాయి. ఈ వరదలో ఓ ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. వెంటనే స్పందించిన స్థానిక యువకులు కోట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. మరోవాపు సికింద్రాబాద్ పార్శిగుట్ట ఏరియాను వరద నీరు ముంచేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లలోని వరద నీరు చేరింది. దీంతో పార్శిగుట్టు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ బృందం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

భాగ్యనరగంలో భారీ వర్షాల నేపథ్యంలో.. జల మండలి అప్రమత్తమైంది. సంస్థ ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో ..ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని.. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సీవరేజి ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మ్యాన్ హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏవైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి

రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే… మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని… కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు.

ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను ఆయోమయానికి, ఆవేదనకు గురి చేయటమేమిటనీ కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని… కానీ కేబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో 26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారన్నారు. బడ్జెట్ లో కేటాయించిన రూ. 26 వేల కోట్లలో నుంచి కేవలం 18 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచింది తీవ్రంగా మండిపడ్డారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి… మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

డిసెంబర్ 9 లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మరోసారి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. లక్షలాది మంది రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతన్నలకి ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు భారత రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వం పైన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్ పోర్టులు ? ఎక్కడెక్కడంటే..?

ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది. ఇదే క్రమంలో కేంద్రంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టులు నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్రం తాజా అప్ డేట్ ఇచ్చింది.

రాష్ట్రంలోని నెల్లూరు, కాకినాడ, కుప్పం, నాగార్జున సాగర్, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయానశాఖ ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి అంగీకరించింది. ఆయా జిల్లాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడితే ఎంత ఖర్చవుతుంది ? ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుంది ? ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేయనుంది.

ఇప్పటికే రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖలో ఉన్న రెగ్యులర్ ఎయిర్ పోర్టులతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి. వీటిలో సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది.

వీటికి అదనంగా భోగాపురం ఎయిర్ పోర్టు కూడా వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టుల్లో ట్రాఫిక్ పెంపు, కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర పౌరవిమానయానమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎంపీలు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు.

తిరుమలలో బయటపడిన నయా స్కామ్.. కలర్ జిరాక్స్ టికెట్లతో

తిరుమలలో నకిలీ రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వైకుంఠంలోని స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి చొరవతో భక్తులు వెళ్తుండగా పూర్తి సమాచారంతో విజిలెన్స్ అధికారులు నిఘా వేశారు. చెన్నైకు చెందిన మోహన్ రాజ్ వద్ద నుంచి నాలుగు టికెట్లకు గాను 11 వేల రూపాయలు వసూలు చేశారు.

తిరుమలలో దళారులకు చెక్ పెట్టే పనిలో ఉన్న టీటీడీ విజిలెన్స్ దళారుల ఆట కట్టిస్తోంది. ఫేక్ టికెట్స్‌తో దర్శనాలు చేయిస్తున్న కేటుగాళ్లకు చెక్ పెడుతోంది. ఇందులో భాగంగా నిఘా పెంచిన టిటిడి విజిలెన్స్ వింగ్ నకిలీ రూ.300 ల ప్రత్యేక దర్శన టికెట్లతో దర్శనాలను వెళుతున్న భక్తులను గుర్తించింది. కలర్‌ జిరాక్స్‌ టికెట్లతో పొంది వైకుంఠంలోకి వెళుతున్న భక్తులను పట్టుకుంది టిటిడి. విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో అసలు బండారం బయటపడింది. వైకుంఠంలో స్కానింగ్ చేసే రుద్రసాగర్ అనే వ్యక్తి సాయంతో భక్తులు దర్శనానికి వెళ్లినట్లు గుర్తించారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్‌ అనే భక్తుడను… రుద్రసాగర్ సాయంతో పాత నేరస్తుడు అమృత యాదవ్ మోసం చేసినట్లు గుర్తించారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం నాలుగు టికెట్లను రూ. 11వేలకు కట్టబెట్టిన రుద్రరాజు, అమృత యాదవ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ నెల 17న నకిలీ టికెట్లతో 35 మంది భక్తులకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా అమృత యాదవ్ ముఠా శ్రీవారి దర్శనం చేయించినట్లు తేల్చారు. ఒక్కో టికెట్‌కు రూ. 2 వేలు దళారీలు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా అమృత యాదవ్ పరారీలో ఉన్నాడు. చెన్నైకి చెందిన ఒక ట్రావెల్స్ తో కలిసి ఫేక్ టికెట్లతో భక్తులకు దర్శనాలు చేయిస్తున్నట్లు టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?

ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయమ్యను లక్ష్యంగా చేసుకుని మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం పేరుతో బీజేపీ నక్కి జిత్తుల వ్యవహారానికి తెర తీసిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. ముడా కుంభకోణం అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని వివరించారు. సీఎం సిద్దరామయ్య తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు సైతం లేవని తెలిపారు.

మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయినా ఈ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందంటూ ట్రైయిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయవచ్చునంటూ కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గహ్లాత్ ఆదేశాలు జారీ చేశారు.గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది.ఇంకోవైపు ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ లేఖ రాశారు. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ముకు డిప్యూటీ సీఎం శివకుమార్ సూచించారు.

చిత్రపురి కాలనీలో హైడ్రా దూకుడు

హైదరాబాద్ మహానగరం పరిధిలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హెడ్రా) ఆపరేషన్ కొనసాగుతున్నది. అక్రమార్కుల గుండెల్లో హైడ్రా అధికారులు బుల్డోజర్లు పరిగెత్తిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట సరస్సు, ఎఫ్ టీఎల్, బపర్ జోన్ లోని అక్రమ భవనాలను కూల్చివేసిన హైడ్రా తాజాగా చిత్రపురి కాలనీపై పడింది. మంగళవారం మణికొండ చిత్రపురికాలనీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది.

ఇక్కడ 220 విల్లాలకు అనుమతులు పొంది 7 విల్లాలు అదనంగా సొసైటీ సభ్యులు నిర్మించారు. అక్రమంగా నిర్మించిన ఈ ఏడు విల్లాలను హైడ్రా పంజా విసిరింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు ఇవాళ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దీంతో సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అయితే అక్రమ నిర్మాణాల విషయంలో బడా బాబులను సైతం వదిలే ప్రసక్తే లేదని హెడ్రా అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో చెరువులు, పార్కులను చెరపట్టి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హెడ్రా తాజాగా హై ప్రొఫైల్ ప్రజలు ఉండే చిత్రపురి కాలనీలో కూల్చివేత్తలు హాట్ టాపిక్ గా మారాయి.

హైడ్రా ఆలోచన బాగున్నా ఆచరణలో అది సాధ్యం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూమి కొనుగోలు చేసినప్పుడు చాలా మందికి అది ఏ పరిధిలోనిది అనేది తెలియదన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తుందా? అనుమతులు ఉన్నాయా? లోన్ వస్తుందా అనేది మాత్రమే ప్రజలు చూస్తారు. గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్యులపై పడటం ప్రజాపాలన కాదన్నారు. హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి, కమిషనర్ గా ఉన్న ఏవి రంగనాథ్ ఈ విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అని ప్రశ్నించారు. హైడ్రా వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయి అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా పై మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని, సచివాలయం ముందు వంట వార్పు చేపడతామన్నారు. హైడ్రా పేరుతో చేస్తున్న కూల్చివేతలను ఆపకపోతే ప్రజల తరుపున పోరాటాలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.

మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమన్నా పట్టించుకోవడం లేదు

సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయమని, ప్రమాదం పైన న్యాయ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్షంగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4350 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పజెప్పనున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెఘా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. ఈ రోజు మేఘా సంస్థ పైన ఎందుకింత ఔదార్యం ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలిపాలని కేటీఆర్ అన్నారు. మేఘా ఇంజనీరింగ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆసక్తి పైన ఆంతర్యం ఏంటో ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.

సుంకిశాల ప్రాజెక్టు సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోయిన ప్రమాద ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని నిర్మాణ సంస్థ వాటర్‌ బోర్డుకు ఇంతకు ముందే తెలిపింది. ఈ ఘటనపై ఇంజనీర్ల కమిటీతో వాటర్ బోర్డు విచారణ సైతం జరిపించింది. ఆపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుగుణంగా నిర్మాణ సంస్థకు షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేసింది. దీనికి మూడు పేజీలతో కూడిన వివరణ లేఖను వాటర్ బోర్డుకు నిర్మాణ సంస్థ అందజేసింది. ఈ ఘటన పట్ల సంస్థ విచారం వ్యక్తం చేయడమే కాకుండా ప్రమాదం తలెత్తడానికి గల కారణాలు, లోపాలను పూర్తిగా లేఖలో వివరించినట్లు సమాచారం. దేశ, విదేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపడుతున్న తమకు ఈ ఘటన మొదటిదని, అన్నీ రకాల భద్రత చర్యలు చేపట్టినప్పటికీ ప్రమాదం జరగడంపై కారణాలను అంతర్గతంగా విచారణ చేసుకున్నట్లుగా లేఖలో ప్రస్తావించినట్లు తెలిసింది.

సుంకిశాల ఇన్‌టేక్‌ వెల్‌ ప్రాజెక్టు పనుల్లో ఇప్పటి వరకు 60శాతానికి పైగా పూర్తయ్యాయని, పంపింగ్‌ మెయున్‌ పనులు 70శాతం, ఎలక్ర్టో మెకానిక్‌ పనులు 40శాతం పూర్తయినట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. అయితే టన్నెల్‌ గేట్‌ ధ్వంసంతో రిజర్వాయర్‌ వైపు గల సైడ్‌ వాల్‌ (రక్షణ గోడ) కూలిపోవడంతో సంపు, పంప్‌ హౌజ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణానికి ఇబ్బందికరంగా మారిందని, కానీ పంపింగ్‌ మెయిన్‌ పనులు, ఎలక్ర్టో మెకానిక్‌ పనులను ఆపలేదని, చురుగ్గా సాగుతున్నాయని వివరణలో స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అయితే సైడ్‌ వాల్‌ కూలిపోవడంతో తలెత్తిన పరిణామాలన్నింటికీ నిర్మాణ సంస్థగా తామే బాధ్యత వహిస్తామని, ఆయా పనుల పునఃనిర్మాణ వ్యయం మొత్తం తామే భరిస్తామని, ప్రమాదం నేపథ్యంతో తాజాగా విధించే గడువుకనుగుణంగా సుంకిశాల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నీ రకాల చర్యలు చేపడతామని లేఖలో నిర్మాణ సంస్థ వివరించినట్టు సమాచారం.

నేడు కరీంనగర్ కు డిజిపి రాక

తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ మంగళవారం కరీంనగర్ కు రానున్నారు. డిజిపి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్నారు.

కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. జిల్లాలో నేరాల నియంత్రణ కోసం అధికారులకు పలు సూచనలు ఇవ్వనున్నారు.

ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా అధికారులతో పాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లా అధికారులు సైతం పాల్గొనే అవకాశం ఉంది.

కోల్‌కత్తా డాక్టర్‌పై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయస్థాయిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ ఉంటారు. అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని, అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈనెల 22 కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌కు న్యాయస్థానం బాధ్యతలు అప్పగించింది. కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డా.నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆస్పత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత సమస్యలపై ఆందోళనలు రేకెత్తిస్తోందని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం కేసుపై విచారణ జరిపింది. యువ వైద్యులు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ మహిళలు వారి విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే. మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క’’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.కోల్‌కతా హత్యాచార ఘటనలో బాధితురాలి పేరు మీడియాలో రావడం, ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడం పట్ల సుప్రీంకోర్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది. ‘ఇది చాలా ఆందోళనకరం’ అని పేర్కొంది. ఇక ఆర్‌జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పరిశీలనలో ఉన్న సమయంలో అతడిని తక్షణమే వేరే కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఎలా నియమించారని న్యాయస్థానం ప్రశ్నించింది.