వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయాలి
రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ 22వ తేదీన అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే… మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని… కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు.
ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను ఆయోమయానికి, ఆవేదనకు గురి చేయటమేమిటనీ కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింప చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని… కానీ కేబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందన్నారు. ఇక బడ్జెట్లో 26 వేల కోట్లకు మాత్రమే ఆమోదం తెలిపి రైతులను మోసం చేసే కార్యక్రమం చేశారన్నారు. బడ్జెట్ లో కేటాయించిన రూ. 26 వేల కోట్లలో నుంచి కేవలం 18 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచింది తీవ్రంగా మండిపడ్డారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి… మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9 లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మరోసారి మాట తప్పారని కేటీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు ఆంక్షలు పెట్టి రైతులకు రుణమాఫీ అందకుండా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని కేటీఆర్ హెచ్చరించారు. లక్షలాది మంది రైతన్నలకు అండగా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతన్నలకి ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అందే వరకు భారత రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వం పైన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Aug 20 2024, 19:39