కోల్‌కత్తా డాక్టర్‌పై హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. జాతీయస్థాయిలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ ఉంటారు. అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్ సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని, అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టాస్క్ ఫోర్స్ 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. కాగా ఈనెల 22 కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక ఈ కేసు విచారణను ఆగస్టు 22కి వాయిదా వేసింది.

సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్‌ఫోర్స్‌కు న్యాయస్థానం బాధ్యతలు అప్పగించింది. కాగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డా.నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. విచారణ సందర్భంగా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతమంది ఆస్పత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా చేసిన వెంటనే మరో కాలేజీకి వెంటనే నియమించారంటూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సందేహాలు వ్యక్తం చేశారు.

కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన.. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సంబంధించిన వ్యవస్థీకృత సమస్యలపై ఆందోళనలు రేకెత్తిస్తోందని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని ధర్మాసనం కేసుపై విచారణ జరిపింది. యువ వైద్యులు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ మహిళలు వారి విధులకు వెళ్లలేకపోయారంటే అక్కడి పరిస్థితులు భద్రంగా లేనట్టే. మనం వారికి సమానత్వాన్ని తిరస్కరిస్తున్నట్టే లెక్క’’ అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.కోల్‌కతా హత్యాచార ఘటనలో బాధితురాలి పేరు మీడియాలో రావడం, ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మీడియాలో ప్రసారం కావడం పట్ల సుప్రీంకోర్ట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది. ‘ఇది చాలా ఆందోళనకరం’ అని పేర్కొంది. ఇక ఆర్‌జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ పరిశీలనలో ఉన్న సమయంలో అతడిని తక్షణమే వేరే కాలేజీకి ప్రిన్సిపల్‌గా ఎలా నియమించారని న్యాయస్థానం ప్రశ్నించింది.

కవిత సహనానికి పరీక్ష.. ఈడీపై సుప్రీం ఆగ్రహం.. ఏం జరిగిందంటే!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ మరోమారు వాయిదా పడింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 27వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ప్రకటించింది. బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశే ఎదురవుతుంది. కవిత బెయిల్ కోసం సుదీర్ఘ నిరీక్షణ చేయాల్సి వస్తోంది.

ఈరోజు జస్టిస్ కె వి విశ్వనాథన్, జస్టిస్ గవాయ్ తో కూడిన ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే కవిత మద్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈడి కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. కానీ కవిత బెయిల్ పిటిషన్ పైన ఈడి కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

కౌంటర్ దాఖలు ఆలస్యం దేనికి? ప్రశ్నించిన ధర్మాసనం

ఈనెల 27వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కవిత తరపు న్యాయవాది ఆగస్టు 23వ తేదీలోపు రిజాయిండర్ దాఖలు చేయాలని సూచన చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఈడిని కోర్టు ప్రశ్నించింది.

కవిత తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ

ఇక కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపిస్తూ కవిత బెయిల్ పొందేందుకు అన్ని విధాలుగా అర్హత ఉన్న మహిళ అని పేర్కొన్నారు. ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారని, కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు.ఆగస్ట్ 27వ తేదీకి కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణ పూర్తయిందని ఈ కేసులో చార్జిషీట్ కూడా ఫైల్ చేసిన కారణంగా బెయిల్ మంజూరు చేయాలని ముకుల్ రోహిత్గీ తన వాదనలు వినిపించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈనెల 27వ తేదీకి కవిత మభ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.

ఆగిన ఒంగోలు ఈవీఎం రీవెరిఫికేషన్!

ఒంగోలు నియోజకవర్గంలో నేటి నుండి ఆరు రోజుల పాటు రీ పోలింగ్ జరగాల్సి ఉంది. మళ్ళీ వివిధ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. నిజమే ఒంగోలు లో ఓటర్లు నేడు మళ్ళీ ఓట్లు వేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ బాలినేని తాజా డిమాండ్ తో మళ్ళీ ఈవీఎం ల రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది.

ఈవీఎంల రీ వెరిఫికేషన్ లో అనూహ్య పరిణామాలు

వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థనతో ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు నేటి నుండి ఆరు రోజుల పాటు 12 పోలింగ్ బూత్ లలో ఓట్లు వేయించి , ఆ ఓటు ఎవరికి వేశారు, ఎవరికి నమోదైంది అనేది బహిరంగంగానే చెక్ చెయ్యనున్నారు. ఇందులో భాగంగా ప్రజలు తమ ఓటు హక్కు మళ్ళీ వినియోగించుకోవాల్సి ఉండగా నేడు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బాలినేని తరపు ప్రతినిధులు వాకౌట్

నేడు కలెక్టర్ తమీమ్ అన్సారియా, ప్రత్యేక అధికారి ఝూన్సీలక్ష్మి, భెల్ సిబ్బంది ఈవీఎంల రీ చెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే ఈవీఎం లతో పాటు వీవీ ప్యాట్ లను కూడా కౌంట్ చెయ్యాలని బాలినేని తరపు ప్రతినిధులు అధికారులను కోరారు. దీనికి వారు కుదరదని చెప్పగా బాలినేని ప్రతినిధులు పోలింగ్ కేంద్రం వాకౌట్ చేశారు

హైకోర్టును ఆశ్రయించిన బాలినేని

దీంతో ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. అంతకు ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీ చెకింగ్ పై హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్ లు కూడా లెక్కించాలని మాజీ మంత్రి బాలినేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బాలినేని రిట్ పిటీషన్ రేపటికి వాయిదా

ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాలినేని తరపు అడ్వకేట్లు కోర్టులో ఎన్నికల కమీషన్ మాక్ పోలింగ్ విధానంలో ఈవీఎంల రీ వెరిఫికేషన్ చెయ్యాలని పేర్కొందని, అయితే అది సరికాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాదులను కౌంటర్ కోరగా రేపు తమ వాదనలు వినిపిస్తామని వారు చెప్పారు. దీంతో కోర్టు ఈ పిటీషన్ పై విచారణని రేపటికి వాయిదా వేసింది.

వేట్టైయాన్ విడుదల తేదీ వచ్చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘వేట్టైయాన్’ విడుదల తేదీ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. టి.జ్ఞానవేల్ దీనికి దర్శకత్వం వహించాడు.

రోబో 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి సినిమాల తర్వాత రజనీకాంత్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. అలాగే పేట‌, ద‌ర్బార్‌, జైల‌ర్ చిత్రాల త‌ర్వాత‌ ర‌జనీకాంత్- రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. 

వేట్టైయాన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అంధాకానూన్‌, గిర‌ఫ్తార్‌, హ‌మ్ సినిమాల త‌ర్వాత రజనీ- అమితాబ్ క‌లిసి న‌టించిన నాలుగో సినిమా ఇది.

మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికాసింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

రుణ మాఫీ కాలేదని రైతుల ఆందోళన.. లైట్ తీసుకుంటున్న ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదని ఆందోళనకు దిగుతున్నారు. రుణ మాఫీకి రూ.31 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టిన ప్రభుత్వం రూ.17 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీనిపై వారు ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రుణ మాఫీ చేస్తారని కాంగ్రెస్ కు ఓటు వేస్తే నట్టేట ముంచారని అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని ఇండియన్ బ్యాంక్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు 300 మంది రైతులు తమకు రుణ మాఫీ కాలేదని చెబుతున్నారు. ఏఈఓను కలిసినా.. ఏఓను కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వివరాలు సరిగా ఉన్నా.. రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దేవుళ్లపై ఒట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి చివరికి రుణ మాఫీ చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. పూర్తిగా రుణ మాఫీ చేయలేదని గాని హరీశ్ రావు రాజీనామా చేయమంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రుణ మాఫీ కాలేదని తమకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇటు బీజేపీకి కూడా భారీ సంఖ్యలో రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రుణ మాఫీ వట్టి బోగస్ అని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

ఇప్పటికీ దాదాపు సగం మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకుంటే భవిష్యత్ లో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో పంట నష్ట పరిహారం విడుదల చేసిన ప్రభుత్వం రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ చేయలేదని పలువురు రైతులు గుర్తు చేస్తున్నారు.

1.7 లక్షల కోట్ల పెట్టుబడులు

ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌ కంపెనీ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. వచ్చే ఐదేళ్లలో ఇందుకోసం రూ.1.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు చైర్మన్‌ జీ కృష్ణకుమార్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు...

ప్రభుత్వ రంగంలోని బీపీసీఎల్‌ కంపెనీ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. వచ్చే ఐదేళ్లలో ఇందుకోసం రూ.1.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు చైర్మన్‌ జీ కృష్ణకుమార్‌ తాజా వార్షిక నివేదికలో పేర్కొన్నారు. కీలకమైన ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో ఉత్పత్తులు, మార్కెటింగ్‌, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపారు. ఇందుకోసం ‘ప్రాజెక్టు యాస్పైర్‌’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. భవిష్యత్‌ వృద్ధికి మంచి అవకాశం ఉన్న పెట్రో కెమికల్స్‌, హరిత ఇంధన ప్రాజెక్టులపైనా బీపీసీఎల్‌ ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈ విస్తరణతో కంపెనీ షేర్ల దీర్ఘకాలిక విలువ కూడా పెరుగుతుందని కృష్ణకుమార్‌ తెలిపారు. ఆకర్షణీయంగా ఉన్న కంపెనీ ఆస్తి-అప్పుల పట్టిక తమ ఇంధన పరివర్తనకు దోహదం చేస్తుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై బీపీసీఎల్‌ చైర్మన్‌ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే వచ్చే ఐదేళ్లలో కంపెనీ రిఫైనింగ్‌, పెట్రో ఉత్పత్తుల సామర్ధ్యాన్ని మరింత విస్తరిస్తామన్నారు. ఇందుకోసం కొత్త రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పా టు కోసం కృష్ణకుమార్‌ నేతృత్వంలోని కంపెనీ ఉన్నతాధికారుల బృందం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే.

రూ.60,000 కోట్ల నుంచి రూ.80,00 కోట్ల పెట్టుబడితో, ఏటా 90 నుంచి 110 లక్షల టన్నుల రిఫైనింగ్‌ సామర్ధ్యంతో ఈ కొత్త రిఫైనరీ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని బీపీసీఎల్‌ భావిస్తోంది. తీర ప్రాంతంలోని మచిలీపట్నం, రామాయపట్నం లేదా మూలపాడు వద్ద ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన భూమి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరగా సవివరమైన ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుని తనను కలవాలని సీఎం చంద్రబాబు నాయుడు బీపీసీఎల్‌ ఉన్నతాధికారులను కోరారు. దీంతో వచ్చే ఆరేడు నెలల్లో ఈ ప్రాజెక్టు ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నైరుతి..తీరు మారింది

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.

శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురిసే పరిస్థితి మాయమైంది. ఇది వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రుతుపవనాల సీజన్‌లో ఆగస్టును అత్యంత కీలకమైన నెలగా పరిగణిస్తారు. ఖరీఫ్‌ పంటలకు దోహదం చేసేలా ముసురుపట్టి వర్షాలు కురవాలి. కానీ, ప్రస్తుతం వేసవి కాలమా అనే సందేహం కలిగేలా వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

మిగులు వర్షపాతం నమోదైనా దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. గత రెండున్నర నెలల కాలాన్ని పరికించి చూస్తే వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయని స్పష్టమవుతుంది. వర్షాలకు భూమి, ఆకాశం, సముద్రాలు సహకరించాలి. అంటే మూడింట మధ్య ఏర్పడే తేడాల ప్రభావంతో వర్షాలు కురవాలి. కానీ, ఈ మూడూ వేడెక్కడంతో సమతుల్యత తప్పింది. నైరుతి సీజన్‌లో బంగాళాఖాతంలో సగటున ప్రతి వారం ఒక అల్పపీడనం ఏర్పడాలి.

సీజన్‌ మొత్తం ఆరేడు వాయుగుండాలు రావాలి. కానీ, పది రోజులక్రితం భూమిపై అల్పపీడనం ఏర్పడగా, మళ్లీ శుక్రవారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వచ్చింది. ఈ నెలలో గత 16 రోజుల్లో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాభావం కొనసాగుతుండడం ఖరీఫ్‌ సాగుపై ప్రభావం చూపింది. వీటన్నింటినీ పరిగణన లోకి తీసుకునే నైరుతి రుతుపవనాల తీరు మారిందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంతోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆగస్టులో వేసవి ఛాయలు నెలకొన్నాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత ఉంటున్నాయి. అసలైతే ముసురు వాతావరణంతో ఉష్ణోగ్రతలు కనీస స్థాయికి పడిపోవాలి. కానీ, గత 16 రోజుల్లో రెండు, మూడు రోజుల తప్ప ఎక్కువ రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నాలుగైదు రోజులు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో నమోదయ్యాయి. రానురాను వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో గతేడాది కంటే ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తేడా మరింత ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది పంటలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. రోజుల తరబడి పొడి వాతావరణం నెలకొనడంతో పంటల ఎదుగుదల, మనుగడ ఇబ్బందిగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.నైరుతి సీజన్‌లో జూన్‌ ఒకటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని 54 మండలాల్లో వర్షాభావం నెలకొంది. 242 మండలాల్లో మిగులు వర్షాలు, 328 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

మొత్తం 670 మండలాల్లో 345.9 మి.మీ.కుగాను 403.9 మి.మీ(సాధారణం కంటే 16.7 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో 10, శ్రీకాకుళంలో 7, ఒంగోలులో 6, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నాలుగేసి మండలాల్లో వర్షాభావం కొనసాగుతోంది.కొన్ని జిల్లాల్లో ఒకటి నుంచి మూడు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టులో గడచిన 16 రోజుల్లో మూడు రోజులు తప్ప మిగిలిన 13 రోజుల్లో సాధారణం కంటే 20 నుంచి 80 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లో సాఽధారణం కంటే చాలా ఎక్కువగా, మరికొన్నిచోట్ల అతి తక్కువ వర్షపాతం నమోదైంది.

కొన్ని మండలాల్లో అసలు వర్షాలే కురవలేదు. ఐఎండీ నివేదిక ప్రకారం గతవారం రోజుల్లో అనకాపల్లి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్‌, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కొంతమేర లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో మాత్రమే మంచి వర్షాలు కురిశాయని, నైరుతి ప్రారంభ నెల జూన్‌లో ఎక్కువ రోజులు, అలాగే, ఆగస్టు తొలి పక్షంలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో వర్షాభావం నెలకొందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారుపండిన పంటను ఏడాదికి సరిపడేలా రైతులు ఇళ్లలో, గాదెల్లో భద్రపరుచుకుంటారు. ఇదే విఽధానం ఇప్పుడు నీటి నిల్వ కోసం అమలుచేయాల్సి అవసరం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎందుకంటే నాలుగు నెలల నైరుతి సీజన్‌లో వర్షాలు కురిసే రోజుల సంఖ్య తగ్గుతోందని, ఒకవేళ కురిసినా భారీవర్షాలే తప్ప చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే తీరు ఇప్పుడు మాయమైందని పేర్కొన్నారు.

పడిన వర్షం నీటిని ఒడిసిపట్టి ప్రతి గ్రామంలో ఒకచోట నిల్వ చేసుకునేలా చెరువులు, కుంటల ఏర్పాటు తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, లేకపోతే నీటికి కటకట తప్పదని హెచ్చరించారు.

రుతుపవనాల సీజన్‌లో ఒక వారం వర్షాలు కురిస్తే, మరో వారం కొంత వరకు పొడి వాతావరణం ఉంటుంది. అంటే వర్షం పడిన తరువాత సముద్రంలో తిరిగి తేమ తయారీకి వారం పడుతుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. భూమి, సముద్రం, వాతావరణం మూడూ కూడా వేడెక్కిపోతున్నాయి. సాధారణంగా భూమి వేడెక్కినప్పుడు సముద్రం చల్లగా ఉంటే మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయి. ఈ మూడు వేడెక్కడంతో పరిస్థితి భిన్నంగా తయారైంది.ఒకవేళ మేఘాలు ఆవరించినా అవి ముక్కలై ఒక వైపు భారీ వర్షం కురిస్తే మరోవైపు పొడి వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌లలో వరదలు సంభవించగా మరికొన్నిచోట్ల సాధారణ వర్షపాతం లేదా అనావృష్టి కొనసాగుతోంది. చివరకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు తక్కువగా ఏర్పడుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతోనే రుతుపవనాల కాలంలో అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయి.

అడ్డంగా బుక్కైన గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో బోగోజు భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కాడు. వరంగల్ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం..గుంజేడు ముసలమ్మ ఆలయ ఆవరణలో నల్లపు సాంబయ్య కొంత కాలంగా రాములు నుంచి షాపును సబ్లీజుకు తీసుకుని కిరాణం, కూల్ డ్రింక్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల షాపులో గుట్కాలు, మద్యం దొరకడంతో షాపును సీజ్ చేశారు. అయితే ఎండోమెంట్కమీషనర్కార్యాలయంలో రూ.20 వేల ఫైన్చెల్లిస్తే షాపు లైసెన్స్పునరుద్ధరిస్తామని ఆలయ భిక్షమాచారి చెప్పారు. అయితే జరిమానాతోపాటు మరో రూ.20 వేలు అదనంగా చెల్లించాలని సాంబయ్యనుడిమాండ్‌ చేశాడు ఈవో భిక్షమాచారి.

దీంతో విసుగుచెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఆదివారం ఆలయ ఆవరణలో రూ.20 వేలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్షలు చేయగా.. నిందితుడి కుడి చేతి వేళ్లకు, లంచం డబ్బు దాచిన క్యాష్ కౌంటర్ డ్రాయర్‌లో కెమికల్ నమూనాలు ఉన్నట్లు తేలింది. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

దీనిలో భాగంగా భిక్షామాచారి స్వగ్రామమైన మరిపెడ మున్సిపల్‌ కేంద్రంలోని ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి, ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.70 వేల నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం, కొన్ని డాక్యుమెంట్లు లభ్యమైనట్టు ఏసీబీ సీఐ ఎస్‌ రాజు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ఎస్‌ రాజుతో పాటు ఏసీబీ సీఐ శ్యామ్సుందర్, సిబ్బంది పాల్గొన్నారు.

సినిమాల్లో హీరో... బయట జీరో..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ హీరోపై సంయుక్త అనే మహిళ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా పేరు సంయుక్త.. గత నెల నుంచి ఒక హీరోపై న్యూస్‌లో బాగా వింటున్నాం. నిజం చెప్పాలంటే అతనిలో మేటర్ లేదండి. అలాంటి మనిషి ఇవన్నీ చేశాడంటే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే ఏడాది కాలంగా అతను మా ఫ్రెండ్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏమో కానీ.. ఆ పిల్ల ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంది.

ఎలా అంటే ఇద్దరూ ఒకటే బెడ్‌పై పడుకుంటారట.. అతను మాత్రం అటువైపు తిరిగి పడుకుంటాడట. అమ్మాయి చనవుగా దగ్గరకు వెళ్ళినా సరే ఆ మనిషి దూరంగా వెళతాడట.. ఒక ముద్దు లేదు.. ముచ్చట లేదని నాతో చెప్పి ఏడుస్తుంది.. 27 ఏళ్లకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడా.. ఇప్పుడు 30 ఏళ్లు వచ్చాయి. అయినా పెళ్లి చేసుకోలే.. ఇంకో పది ఏళ్లు అయినా పెళ్లి చేసుకోడు.. ఎందుకంటే అతనిలో ఏం లేదు. సినిమాలు మాత్రం బానే చేసుకుంటాడు.. అంటే చూడడానికి బానే ఉంటాడు.. కానీ అతడిలో మేటర్ ఏమి లేదండి. ఆయన సినిమాల్లోనే హీరో బయట మాత్రం జీరో‘‘.. త్వరలోనే అన్ని విషయాలు ఆధారాలతో సహా బయటపెడతానని సంయుక్త స్పష్టం చేశారు.

న్యాయం కోసం రక్షాబంధన్ సందర్భంగా వినూత్న నిరసన..

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని రెండు రోజుల క్రితం కోల్‌కతా, ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో రీక్లైమ్ ది నైట్‌కు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి మహిళలు టార్చ్‌లు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. మహిళలకు భద్రత కల్పించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు

ప్రస్తుతం రక్షా బంధన్ వేడుకను నిరసనలకు వేదికగా చేసుకోవాలని విద్యార్థి సంఘాలు, వైద్య విద్యార్థులు నిర్ణయించారు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయానికి చెందిన వామపక్ష విద్యార్థి సంఘాలు తిలోతమ రాఖీ బంధన్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కోల్ కతాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రక్షాబంధన్ వేడుక సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ రూపంలో నల్ల దారం కట్టి నిరసన తెలుపనున్నారు.

ఆర్‌జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్‌లోని జాయింట్ ఫోరమ్ ఆఫ్ డాక్టర్స్ పిలుపు మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు రక్షా బంధన్‌ను నిరసిస్తూ.. భారీ ఎత్తున మానవహారం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సామూహికంగా మానవహారం కార్యక్రమం నిర్వహించి అభయ హంతకులను శిక్షించాలని డిమాండ్ చేయాలని డాక్టర్స్ జాయింట్ ఫోరమ్ ప్రజలకు పిలుపునిచ్చింది.

పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా రక్షా బంధన్‌ను నిర్వహించాలని బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా నిర్ణయించింది. మహిళల భద్రత కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మరోవైపు పశ్చిమబెంగాల్‌లో నిరసనలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్రశాఖ కోర్టును ఆశ్రయించనుంది. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో నిరంతర ధర్నా కార్యక్రమం ఉంటుందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఆగస్టు 20న రాష్ట్ర నాయకత్వంతో పాటు ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నాలో పాల్గొంటారు. రాష్ట్ర బీజేపీ నేతలు, ఎంపీలు ఆగస్టు 21న నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఆగస్టు 22వ తేదీన జరిగే నిరసనలో బిజెపికి చెందిన అన్ని విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.