మార్గదర్శిపై విచారణ జరగాల్సిందే

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది.

నిబంధనలకు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై విచారణ జరగాల్సిందేనని రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) హైకోర్టును కోరింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై 2008లో నమోదైన కేసును కొట్టేయరాదని విజ్ఞప్తి చేసింది. అందువల్ల 2011లో మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని నివేదించింది. మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసింది. మార్గదర్శి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని పేర్కొంటూ 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది.

ఈ కేసును కొట్టేయాలని మార్గదర్శి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 2018లో ఉమ్మడి ఏపీ హైకోర్టు రెండుగా విడిపోవడానికి చివరిరోజు అయిన డిసెంబర్‌ 31 రోజున మార్గదర్శికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మార్గదర్శికి వ్యతిరేకంగా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతోపాటు డిపాజిట్లను పూర్తిగా తిరిగి ఇచ్చినందున కేసును కొట్టివేసింది. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఆర్బీఐ సహా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరుల వాదనలు తాజాగా వినాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.

జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపడుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ చర్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పుడు క్వాష్‌ పిటిషన్‌ను అనుమతించే అవకాశం ఉండదని అనేక సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ద్వారా స్పష్టమైందని తెలిపింది. అందువల్ల మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరింది. ఈ పిటిషన్‌ ఈనెల 20న మరోసారి విచారణకు రానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ వేగవంతం..

కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు.

కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. దీని కోసం కమిషన్ ఛైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు నగరంలోనే మకాం వేయనున్నారు. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీర్లు, ప్రైవేటు వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ విచారణలో భాగంగా హైదరాబాద్‌ బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ ఎదుట హాజరై పలు అంశాలపై వివరణ ఇచ్చారు

కమిషన్ విచారణ అనంతరం బయటకు వచ్చిన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.."కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఇచ్చాను. తెలంగాణ భవిషత్ కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ మదిలో ఉండేది. కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు. స్టోరేజీ లేకపోవడం వల్ల తుమ్మిడిహట్టి నిర్మాణం ఆలోచన ముందుకు వెళ్లలేదు. సీడబ్ల్యూసీ చెప్పినట్లు 164టీఎంసీల్లో 64టీఎంసీలు తెలంగాణవి కాదనే విషయం రిపోర్టుల్లోనే ఉంది.

వార్ధా నది బ్యారేజీ రూ.2,500కోట్లతో నిర్మాణం అవుతుంది.. తుమ్మిడిహట్టికి రూ.7,500ఖర్చు అవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశాం. 'వి' ఆకారంలో బ్యారేజీ కట్టడం సాధ్యం కాదు కాబట్టే కట్టలేదు. తుమ్మిడిహట్టి వద్ద 54టీఎంసీల నీటి లభ్యతే ఉంటుందని అన్ని ఆధారాలు చూపించాను. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ, గోదావరి బేసిన్‌లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదు. నేను కమిషన్ ముందు చెప్పిన వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అన్నారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతా" అని చెప్పారు.

సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా.. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్ట్ కానున్నారా. ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముడా కుంభకోణంలో సీఎంపై, సీఎం కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి చట్టం కింద సీఎంపై విచారణకు.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఏం జరుగుతోందని ఆసక్తి నెలకొంది.

కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై కర్ణాటక మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది.

అయితే కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం.. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేయడంతో కర్ణాటకలో తీవ్ర చర్చకు దారి తీసింది. భారత్ నాగరిక్ సురక్ష సంహితలోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు.

ఇక తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని.. హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఇక ఇదే వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు సమాచారం.

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కుంభకోణం విషయంలో.. ముగ్గురు వ్యక్తులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను స్వీకరించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సీఎంపై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు రాజ్‌భవన్ ఒక లేఖను విడుదల చేసింది. కాగా ముడాకు సంబంధించి 14 ఇళ్ల స్థలాలను సీఎం సిద్ధరామయ్య తన భార్యకు కేటాయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.

రుణమాఫీ జరగలేదని రోడ్డెక్కిన రైతన్నలు.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు.

కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు. ఆదిలాబాద్ - జైనథ్ మండల కేంద్రంలో రుణమాఫీ(Loan Waiver) జరగలేదని, రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వారికి బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్(Anil Yadav) మద్దతుగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులపట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అనిల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

కాగా.. రుణమాఫీ జరగలేదని ఖమ్మంలో కూడా నిరసనలు కొనసాగాయి. తమకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని పలువురు రైతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసనలకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణాలు మాఫీ కాలేదని.. వారంతా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 100 శాతం రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాకపోయినా.. వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో అబద్ధపు రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. "ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయికి వెళ్తాం. గ్రామ స్థాయి నుంచి రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజక వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు అందజేస్తాం. ఆ తర్వాత సచివాలయంలో అధికారులకు ఇస్తాం. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మాత్రమే రుణ మాఫీ జరిగింది. ఇంకా 60శాతం మంది రైతులకు కాలేదు. వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు" అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక్కరోజులోనే రూ.82 వేల కోట్లు సంపాదించిన 23 మంది వ్యాపారవేత్తలు

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత స్టాక్ మార్కెట్లు (stock markets) శుక్రవారం రికార్డు స్థాయి లాభాల్లో ముగిశాయి. దీంతో దేశంలోని పలు కంపెనీల షేర్లు మరింత పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలపై పెట్టుబడులు చేసిన మదుపర్లకు ఒక్కరోజే 7.5 లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇక ఆయా కంపెనీల షేర్లను కల్గి ఉన్న ఓనర్ల మరింత సంపద మరింత పెరిగి అపర కుబేరులుగా మారిపోయారు. వారిలో దేశంలోని 25 మంది బిలియనీర్లలో 23 మంది నికర విలువలో 9.84 బిలియన్ డాలర్లు అంటే రూ.8,25,33,73,80,000 కోట్లకు పైగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా అందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది

భారతీయ బిలియనీర్లలో ప్రధానంగా గౌతమ్ అదానీ నికర విలువలో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ సంపద పెరిగింది. వీరిద్దరి నికర విలువలో ఏకంగా 3.22 బిలియన్ డాలర్లు అంటే 27 వేల కోట్ల రూపాయలకు పైగా పుంజుకుంది. ఇది మొత్తం పెరుగుదలలో మూడో వంతు కావడం విశేషం.

ముఖేష్ అంబానీ సంపద $1.37 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర విలువ $111 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అంబానీ 11వ స్థానంలో ఉన్నారు.

గౌతమ్ అదానీ సంపదలో 1.85 బిలియన్ డాలర్లు పెరిగాయి. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ 104 బిలియన్ డాలర్లుగా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో అదానీ 14వ స్థానంలో ఉన్నారు.

షాపూర్ మిస్త్రీ నికర విలువ $978 మిలియన్లు పెరిగింది. ఆ తర్వాత ఆయన మొత్తం నికర విలువ $41.6 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో షాపూర్ 36వ స్థానంలో కలరు.

శివ నాడార్ నికర విలువలో 828 మిలియన్ డాలర్ల పెరుగుదల కనిపించింది. తర్వాత మొత్తం నికర విలువ 38.5 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 39వ స్థానంలో ఉన్నారు.

సావిత్రి జిందాల్ నికర విలువ 524 మిలియన్ డాలర్లు పెరుగగా, ఆమె మొత్తం నికర విలువ 32.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 50వ స్థానంలో ఉన్నారు.

అజీమ్ ప్రేమ్‌జీ నికర విలువ 906 మిలియన్ డాలర్లు పెరిగింది. ఆ తర్వాత మొత్తం నికర విలువ 28.7 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 61వ స్థానంలో కలరు.

దిలీప్ షాంఘ్వీ నికర విలువ 79.1 మిలియన్ డాలర్లు పెరుగగా, మొత్తం నికర విలువ 28.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తల్లో 63వ స్థానంలో ఉన్నారు.

అయినా తగ్గేదే లేదు.. కాంగ్రెస్ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటాం: కేటీఆర్‌

ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు.

ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, నిలదిస్తే బెదిరిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా తగ్గేదే లేదని నిగ్గదీసి అడుగుతామని, నిజాలే చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ డొల్ల మాటల గుట్టు విప్పుతూనే ఉంటామన్నారు. రైతు రుణాలు రూ.49,500 కోట్లు ఉన్నాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) తెలిపిందని, రాష్ట్రం మంత్రివర్గ భేటీలో రూ.31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ.26 కోట్లేనన్నారు. మూడు విడుతల్లో ఇచ్చింది రూ.17,933 కోట్లు మాత్రమేనని విమర్శించారు. అయినా రుణం తీరలే.. రైతు బతుకు మారలేదని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు

హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు

Doctors strike | కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape - murder) ఘటనను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.

కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape – murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike ) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (Indian Medical Association) పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు.

సాహసమే ఊపిరిగా..

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు.

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు. ఓ పక్క డ్యాం గేట్లద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌(Stoplog) బిగించేందుకు గోడకు ఉండే ఒక లాక్‌ అడ్డు వచ్చింది. దాన్ని తొలగిస్తే గేట్లు గోడలు దెబ్బతినిపోతాయి. ఇందుకు ఇంజనీయర్లు కొత్త ఆలోచన చేశారు.

స్టాప్‌లాగ్‌ను పైనుండి గేటు గాడిలో అమర్చాలని నిర్ణయించుకున్నారు. గేటుకు ఉండే కౌంటర్‌ వెయిట్‌ను కిందకు దించేశారు. పైన ఉండే హోస్టుప్లాట్‌ఫారం తొలగించారు. ఈరెండు తొలగించేందుకు రాత్రి వరకూ సమయం పట్టింది. ఇక రాత్రి స్టాప్‌లాగ్‌ను దించేందుకు పనులను ప్రారంబించారు. ఒక వైపు తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి. అయినా ఇంజనీయర్లు(Engineers) ఏమాత్రం పట్టు సడలించుకోకుండా పనులు చేశారు.

హోస్టుప్లాట్‌ ఫారం బరువు 32 టన్నులు ఉండగా, కౌంటర్‌ వెయిట్‌ గేటు తూకం 40 టన్నులు ఉంది. ఈ రెండూ కిందకు దించేశారు. నూతనంగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌ ఒక్కక్కటి 12 నుండి 13 టన్నులు బరువు ఉంటుంది. శుక్రవారం రాత్రి ఎంత సమయం అయినా స్టాప్‌లాక్‌ బిగించాలనే పట్టుదలతో ఇంజనీయర్లు కృషిచేశారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటలకు విజయం సాధించారు. ఫస్ట్‌ ఎలిమెంట్‌ను దాని స్థానంలోకి చేర్చారు.

ఇంకా నాలుగు భాగాలను గేట్‌ స్థానంలో బిగించాల్సి ఉంది. ఆ దిశగా పనులు సాగుతున్నాయి. సీడబ్ల్యుసీ అధికారులు, ఏపీ, కర్ణాటక మంత్రులు, ముఖ్యమంత్రులు జరుగుతున్న పనుల గురించి ఆరాతీస్తున్నారు. పనులు చేసే సమయంలో ఊహించని ప్రమాదం సంభవిస్తే చికిత్స చేయడం కోసం వైద్యులు, అంబులెన్సులను అక్కడే మొహరించారు.

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అలీఖాన్‌, కోదండరామ్

తెలంగాణలో కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్కో కొనసాగించా లని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. 

అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. 

దీంతో ప్రొఫెసర్ కోదండ రామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారా నికి బ్రేక్ పడటంతో ఈరోజు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్‌, కోదండరామ్‌ ప్రమాణస్వీకారం చేశారు..

గురుకుల విద్యార్థిని'కి అండగా.. సీఎం రేవంత్ రెడ్డి

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. కాగా ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక, ఆగస్టు 9 న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత వెంటనే గురుకుల సిబ్బంది కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం(ఆగస్టు 13) నాడు కార్తీక కు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయూలో కార్తీక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే కార్తీకకు కావాల్సిన వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ఓఎస్డీ శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి కార్తీక కోలుకునేంతవరకు వైద్యం అందించాలని చెప్పారు.