రుణమాఫీ జరగలేదని రోడ్డెక్కిన రైతన్నలు.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు.
కాంగ్రెస్(Congress) సర్కార్ చేసిన రూ.2 లక్షల రుణమాఫీ తమకు కాలేదని రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో రైతులు శనివారం నిరసనలు తెలిపారు. రుణమాఫీ జరగలేదని రోడ్లపై ముళ్ల కంచెలు వేసి నిరసనకు దిగారు. ఆదిలాబాద్ - జైనథ్ మండల కేంద్రంలో రుణమాఫీ(Loan Waiver) జరగలేదని, రుణమాఫీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. వారికి బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్(Anil Yadav) మద్దతుగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రైతులపట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని అనిల్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో జాతీయ రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
కాగా.. రుణమాఫీ జరగలేదని ఖమ్మంలో కూడా నిరసనలు కొనసాగాయి. తమకు కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని పలువురు రైతులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసనలకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణాలు మాఫీ కాలేదని.. వారంతా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. 100 శాతం రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాకపోయినా.. వారి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో అబద్ధపు రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. "ఎల్లుండి నుంచి క్షేత్ర స్థాయికి వెళ్తాం. గ్రామ స్థాయి నుంచి రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజక వర్గాల మీద ప్రత్యేక దృష్టి పెడతాం. వివరాలన్నీ వ్యవసాయ శాఖ అధికారులకు, కలెక్టర్లకు అందజేస్తాం. ఆ తర్వాత సచివాలయంలో అధికారులకు ఇస్తాం. అయినా న్యాయం జరగకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం మాత్రమే రుణ మాఫీ జరిగింది. ఇంకా 60శాతం మంది రైతులకు కాలేదు. వారంతా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు" అని కేటీఆర్ పేర్కొన్నారు.
Aug 17 2024, 20:48