కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది. ఫలితంగా కంటోన్మెంట్‌లో భూగర్భ జలాల వినియోగంపై రెగ్యులర్‌గా ఆడిట్‌ చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బోర్‌వెల్స్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (డిగ్గింగ్‌ అండ్‌ యూజ్‌ ఆఫ్‌ బోర్‌వెల్స్‌ రెగ్యులేషన్స్‌ 2024) నిబంధనలు రూపొందించారు.

దీనిపై అభ్యంతరాలను తెలపాల్సిందిగా గత ఫిబ్రవరి 23న కంటోన్మెంట్‌ బోర్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 5వ తేదీ వరకు అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నూతన నిబంధనలను రూపొందించింది. తాజాగా వీటిని ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం కంటోన్మెంట్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బోర్‌వెల్స్‌పై సమగ్ర సర్వే చేయనున్నారు. వినియోగంలో ఉన్న బోర్‌వెల్స్‌ సంఖ్య, వాటిని ఎప్పుడు వేశారు, ఎంత లోతులో వేశారు.. తదితర సమాచారాన్ని సేకరిస్తారు.

భూగర్భ జలాల లభ్యతపై కేంద్ర జలశక్తి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సర్వే చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తారు. గృహ అవసరాలకు, ఆర్మీ, పోలీసు, వ్యవసాయ, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు వినియోగించే బోర్‌వెల్స్‌(Borewells)ను క్రమబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు. మిగతా బోర్‌వెల్స్‌ను నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. నూతనంగా వేసే బోర్‌వెల్స్‌ను కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తోడితే ప్రతి కిలోలీటర్‌కూ 10 రూపాయల చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది

కాలనీల్లో బోర్‌వెల్స్‌ వేయాలంటే మూడు వేల రూపాయలు, బస్తీల్లో వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భూగర్భజలాలను కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. బోర్‌వెల్స్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. కాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు.

గ్రేటర్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘హైడ్రా’

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటన నేఫథ్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు

రూ. 1015కే విమాన ప్రయాణం.. మరో 15 శాతం డిస్కౌంట్.. ఇండిగో బంపరాఫర్.. గొప్ప ఛాన్స్!

జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే సగటు మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తులో రేట్లు ఉంటాయని వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే.. ప్రముఖ దేశీయ ఎయిర్‌లైన్స్ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. రూ. 1015 కనీస ధరతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వివరాలు చూద్దాం.

మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెనుకడుగు వేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా విమానం ఎక్కాలని ఉండి.. రేట్లు ఎక్కువగా ఉన్నాయని విరమించుకునే లాంటి వారి కోసం కొన్ని ప్రత్యేక రోజుల్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఇలానే ఇండిపెండెన్స్ డే (స్వాతంత్ర్య దినోత్సవం) పురస్కరించుకొని.. ఇండిగో ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఇది 2024, ఆగస్ట్ 13 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుందని ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ X లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఆఫర్లో ఫ్లైట్ టికెట్లు కనీసం రూ. 1015 నుంచే ప్రారంభం అవుతాయని.. ఇంకా ఎంపిక చేసిన 6E యాడ్- ఆన్స్‌పై 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

ఈ సేల్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా రూ. 1015 తో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం అవుతుండగా.. యాడ్ ఆన్స్ అంటే సీట్ ప్రిఫరెన్స్, అధిక బ్యాగేజీ వంటివి బుక్ చేసుకుంటే మరో 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో వెబ్, యాప్ బుకింగ్స్‌పై ఆఫర్ అమలవుతుంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఈ ఫ్రీడమ్ సేల్‌కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడుదల చేసింది.

ఆగస్ట్ 13- 15 నుంచి వరకు సేల్ అందుబాటులో ఉండగా.. 2024, ఆగస్ట్ 22 నుంచి 2025, మార్చి 31 వరకు విమాన ప్రయాణాల కోసం డిస్కౌంట్లోనే టికెట్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ. 1015 అనేది వన్- వే దేశీయ ప్రయాణాల కోసం. ఇక ఇంటర్నేషనల్ రూట్లలో కనీస ఫ్లైట్ టికెట్ ధర రూ. 3715 తో ప్రారంభం అవుతుంది.

ఇక విమానం బయల్దేరే వారం రోజుల ముందు నుంచి మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆగస్ట్ 22 కంటే ముందు ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండవు. ఈ ధరలకు అదనంగా ఇతర టాక్సులు, ఛార్జీలు వంటివి ఉండొచ్చు. వన్- వే, రౌండ్ ట్రిప్ బుకింగ్స్‌కు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. మల్టీ సిటీ బుకింగ్స్‌కు ఇది లేదు.

ఎల్లుండి కీలక ఘట్టం.. మూడో దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన

రూ. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీపై ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది.

రాష్ట్ర రైతాంగాన్ని రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఇప్పటికే రూ. లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు పంద్రాగస్టున మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు సీఎంవో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించబోతున్నారని ఆ సందర్భంగానే మూడో విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారని తెలిపింది.

32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టిందని, జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసిందని తెలిపింది. ఆ తర్వాత జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసిందని ఇందులో ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసిందని వెల్లడించింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొంది.

మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కోసం లబ్ధిదారులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నట్లు పేర్కొంది. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుందని సీఎంవో తెలిపింది. ఇక రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించిందని పేర్కొంది.

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపీ సర్కారు

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.

మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చంద్రబాబు సంచలన నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. 

కాగా, ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్టణం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచినవారే.

అభ్యర్థిని పోటీకి నిలిపితే గెలిపిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ముందుకొచ్చినప్పటికీ అంత ప్రయాస అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదిలావుంచితే, ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ట్వీట్

రాష్ట్రంలోని ఐటీఐ కాలేజీలు, గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన తమ ‘X’ ఖాతాలో ట్వీట్ చేశారు.

పెద్దపల్లి, సంగారెడ్డి, అదిలాబాద్ ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఐటీఐ కాలేజీలను చూసినా పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్ లేక, సిబ్బంది కొరతతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. లైబ్రరీలో కంప్యూటర్లు, ఇతర పరికరాలు పనిచేయని స్థతికి చేరాయని వెల్లడించారు. ఈ సమస్యతో విద్యార్థులు ప్రాక్టికల్స్ కూడా చేయలేకపోతున్నారని తెలిపారు.

కొన్నిచోట్ల ఐటీఐ తరగతుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో విద్యార్థులు కూర్చునే పరిస్థితి లేదన్నారు. ఇక గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని అన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థతకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికే ఓ విద్యార్థి పాము కాటుతో, మరో విద్యార్థి డెంగీ జ్వరంతో ప్రాణాలు పొగొట్టుకోవడం రాష్ట్రంలో నిత్యకృత్యంగా మారిందని అన్నారు.

గురుకుల ప్రాంగణాలు దోమలు, ఈగలతో మురికి కూపాలుగా తయారయ్యాయని తెలిపారు. స్నానాల గదులకు డోర్లు లేక, సరిపడా బాత్‌రూంలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

ఎక్కడా కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. ఒకవేళ పెట్టినా.. భోజనం నాణ్యంగా ఉండకపోవడంతో కారం మెతుకులతో విద్యార్థులు కడుపులు నింపుకుంటున్నారని అన్నారు.

ఇలా ఇన్ని సమస్యల నడుమ విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి సారిస్తారని ఆయన ప్రశ్నించారు. గురుకులాల్లో చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని తల్లిదండ్రులు ఎలా నమ్ముతారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దిగజారుతుండటం శోచనీయమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అవసరమైన సకల సౌకర్యాలు వెంటనే కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.

మరో మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వానలు.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

మరికొన్ని రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఆగస్టు 15 వరకు వర్షాలు పడనున్నాయి. దేశంలో వాతావరణ పరిస్థితి గురించి ఐఎండీ అంచనా ఏంటో చూద్దాం..

భారత వాతావరణ విభాగం (IMD) ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మరింత వర్షపాతాన్ని అంచనా వేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

అయితే కొన్ని ప్రాంతాల్లో రవాణా, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అనవసర ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని, వాతావరణ అప్‌డేట్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అధికారులు సూచించారు.

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఢిల్లీలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ధన్సా స్టాండ్ సమీపంలోని నజాఫ్‌గఢ్-ఫిర్ని రోడ్, బహదూర్‌ఘర్ స్టాండ్‌తో సహా పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడి ట్రాఫిక్ రద్దీకి కారణమైంది. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరారు.

మరోవైపు కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో పగటిపూట భారీ వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో విస్తృతమైన వర్షపాతం, వాయువ్య భారతదేశంలోని మైదానాలలో చెదురుమదురు వర్షాలు వారం పొడవునా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది

ఆగస్ట్ 12 నుండి 15 వరకు కేరళ, తమిళనాడు, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో వానలు ఎక్కువగా పడనున్నాయి. హైదరాబాద్ లో ఆగస్టు 15 వరకూ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఆగస్టు 18 వరకు, హర్యానాలో ఆగస్టు 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈశాన్య, దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించా. : ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ ను తప్పించడం ఓ కుట్ర అని రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. చివరి వరకూ తానే పోటీలో ఉంటానన్న వ్యక్తి సడెన్ గా వైదొలగడం కుట్ర కాకుండా ఏంటని ప్రశ్నించారు. బైడెన్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ నేతలంతా తిరుగుబాటు చేశారని, ఆయనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. 

ఎన్నికల ప్రచారం సందర్భంగా బైడెన్ తో జరిగిన డిబేట్ తన గొప్ప చర్చల్లో ఒకటని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఆ డిబేట్ లో బైడెన్ ను చిత్తుగా ఓడించానని, దాని ప్రభావంతో డెమోక్రాట్లు కుట్ర చేసి ఆయనను పోటీ నుంచి తప్పించారని ఆరోపించారు. ఈమేరకు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తో జరిగిన తాజా ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ (ట్విట్టర్) లో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

పెన్సిల్వేనియా ప్రచార సభలో తనపై జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత దేవుడిపై నమ్మకం మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. కాల్పులు జరిగినపుడు తల తిప్పడమే తనను కాపాడిందని, బుల్లెట్ గాయం తర్వాత వెంటనే తనపై కాల్పులు జరిపారనే విషయం అర్థం చేసుకున్నానని వివరించారు. ఆ క్షణమే తేరుకున్నానని, మళ్లీ ప్రసంగం కొనసాగించాలని భావించగా సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం చెప్పారని తెలిపారు.

అమెరికా సరిహద్దు వివాదాలు, వలసదారులకు అడ్డుకట్ట వేయడంపై ట్రంప్ స్పందిస్తూ.. బార్డర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విదేశాలు తమ దేశంలోని నేరస్థులను, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని అమెరికాకు పంపిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

దేశంలోకి అక్రమ వలసలను కఠినంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని మస్క్ కూడా అంగీకరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు అసలు ఐక్యూయే లేదని ట్రంప్ విమర్శించారు. బైడెన్ కు ఐక్యూ చాలా తక్కువని గతంలో తాను చెప్పానన్న ట్రంప్.. ఆయన పాలన చూశాక అసలు బైడెన్ ఐక్యూ జీరో అని అర్థం చేసుకున్నానని వివరించారు.

మస్క్ తో ఇంటర్వ్యూ జరుగుతుండగా డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో తన ట్విట్టర్ ఖాతాను నిషేధించడంతో ట్రంప్ సొంతంగా ట్రూత్ పేరుతో ఓ సోషల్ మీడియా ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకున్నారు.

ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్రంప్ పై నిషేధం ఎత్తివేశారు. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూ సందర్భంగా ట్రంప్ పలు ట్వీట్లు చేశారు.

యుద్ధంలో పుతిన్‌కు షాక్.. 1000 చ.కి.మీ రష్యా భూభాగాన్ని ఆక్రమించుకున్న ఉక్రెయిన్

మంగళవారం రష్యా భూభాగంలోని యుద్ధ ట్యాంకులు, సాయుధ దళాలతో చొచ్చుకొచ్చిన ఉక్రెయిన్ సైన్యం.. దూకుడుతో ముందుకు సాగుతోంది. కీవ్ సేనలతో పోరాటంలో మాస్కో దళాలు వెనుకబడిపోయాయి. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిని తిప్పికొడుతున్నామని రష్యా చెబుతున్నా.. అది కేవలం మాటలకే పరిమితం. ప్రస్తుతం యుద్ధంలో ఉక్రెయిన్‌దే పైచేయి. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి.

రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయి. వారం రోజుల కిందట కుర్స్క్‌ రీజియన్‌లోకి ప్రవేశించిన కీవ్ సేనల దూకుడు ముందు మాస్కో సైన్యాలు తలవంచుతున్నాయి. రష్యా భూభాగాలను ఉక్రెయిన్ సైనికులు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. కుర్స్క్‌ రీజియన్‌లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఒలెక్సాండర్‌ సిర్‌స్కీ ప్రకటించారు

అటు, రష్యాలోకి తమ సేనలు ప్రవేశించిన విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. ఈ సందర్భంగా తమ సైనికుల ధైర్యసాహసాలను అభినందించిన జెలెన్‌స్కీ.. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, ఇతరులపై రష్యా ప్రారంభించిన యుద్ధం.. ఇప్పుడు ఆ దేశానికే తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఈ చొరబాటుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ.. డాన్‌బాస్‌లో మాస్కోను నిలువరించేందుకు కీవ్ చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌ సైన్యంతో సాగుతున్న భీకర పోరులో రష్యా తప్పక విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా ఉన్నతస్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్‌.. ఆగస్టు 6న ఉక్రెయిన్‌ దాడులు ప్రారంభమైనట్టు తెలిపారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు పుతిన్ ఆరోపించారు. ‘శత్రువు స్పష్టమైన లక్ష్యాలలో ఒకటి అసమ్మతి, కలహాలు, ప్రజలను భయపెట్టడం, రష్యన్ సమాజం ఐక్యతను దెబ్బతీయడం’అని మండిపడ్డారు.

ఇరు సైన్యాలు భీకర దాడులతో కర్క్స్ రీజియన్‌లో 1.21 లక్ష మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 60 వేల మందిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, 28 గ్రామాలను ఉక్రెయిన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయని కస్క్ గవర్నర్ వెల్లడించారు.

దాడుల్లో 12 మంది పౌరులు చనిపోయినట్టు ఆయన తెలిపారు. గత మంగళవారం రష్యా భూభాగంలోకి మొదటిసారి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యాలు.. సరిహద్దుల నుంచి 30 కి.మీ. దూరం చొచ్చుకొచ్చాయి. ఇది ఉక్రెయిన్‌కు నైతికస్థైర్యాన్ని కలిగించినా.. మరో ముప్పుగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

ఈ పరిణామాలతో రగిలిపోతున్న మాస్కో.. ఉక్రెయిన్ పౌరులు, మౌలిక వసతులపై దాడులను రెట్టింపు చేసే ప్రమాదం ఉందని బ్రిటిష్ సైన్యానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు అంతర్జాతీయ సంస్థలు ఆహారం సహా మానవతా సాయం అందిస్తున్నాయి.