బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలి : VHP
పొరుగున ఉన్న బంగ్లాదేశ్ హింస, అరాచకాలతో అట్టుడుకుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కాలం వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి, జాతీయ అధికార ప్రతినిధి శశిధర్, తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి విలేకరులతో మాట్లాడారు.
బంగ్లాదేశ్ ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టిన తరువాత, అరాచకవాద శక్తులు ఆధిపత్యం చలాయిస్తున్నాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, అస్తవ్యస్తమైన ఈ పరిస్థితిలో అతివాద జిహాదీ శక్తులు అక్కడి మైనారిటీ వర్గమైన హిందూ సమాజంపై పెద్ద ఎత్తున విరుచుకు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, మతపరమైన స్థలాలు, వ్యాపార సంస్థలు, హిందూ మైనారిటీల ఇళ్లు దెబ్బతిన్నాయని విశ్వహిందూ పరిషత్ నేతలు చెప్పారు. బంగ్లాదేశ్‌లోని ప్రతి జిల్లాలో ఈ దారుణమైన చర్య జరుగుతున్నట్లు వివరించారు.
చివరకు హిందూ శ్మశాన వాటికలను కూడా జిహాది శక్తులు ధ్వంసం చేశాయన్నారు. ఆలయాలు భారీగా దెబ్బతిన్నాయని, బంగ్లాదేశ్‌లో వారి హింస, భీభత్సానికి గురికాని ఏ జిల్లా కూడా మిగిలలేదన్నారు. భారత్ నుంచి విడిపోయిన సమయంలో బంగ్లాదేశ్‌లో 32% ఉన్న హిందువులు.. ఇప్పుడు 8% కంటే తక్కువగా ఉన్నారనీ, వారు కూడా నిరంతరం జిహాదీ మూఖల దౌర్జన్యాలకు గురవుతూనే ఉన్నారని తీవ్ర ఆవేదన చెందారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలకు భద్రత కరువైందని, మానవ హక్కులు హరించి వేస్తున్నారన్నారు. అయినా వీటి గురించి లౌకికవాద శక్తులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల రక్షణ కోసం సభ్య సమాజం స్పందించాలన్నారు.
బంగ్లాదేశ్‌లోని మైనారిటీల రక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. ఈ క్లిష్ట పరిస్థితిని సద్వినియోగం చేసుకుని, జిహాదీలు సరిహద్దు దాటి భారత్ లో చొరబడేందుకు పెద్దఎత్తున ప్రయత్నం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో భారత భద్రతా దళాలు సరిహద్దులో కట్టుదిట్టమైన నిఘా పెంచి, ఎలాంటి ఆక్రమణలకు అనుమతించకుండా చర్యలు చేపట్టాలన్నారు.
బంగ్లాదేశ్‌లో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు.
Aug 08 2024, 19:13