చేతులెత్తేసిన ఎల్‌అండ్‌టీ.. ఓల్డ్‌సిటీ మెట్రోకు చిక్కుముళ్లు
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి.
పాతనగర మెట్రో కారిడార్ (Old City Metro) నిర్మాణానికి స్థానికులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా, సంస్థాగతంగా ఎన్నో చిక్కుముళ్లు నెలకొన్నాయి. 2011 నాటికే మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోనే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు 15 కి.మీ మెట్రో కారిడార్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధమై, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. పీపీపీ విధానంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు హైదరాబాద్ సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ మాత్రం నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఇప్పటికే మూడు కారిడార్‌లలో నిర్మించిన మెట్రో మార్గాల నిర్వహణ సంస్థకు భారంగా మారడమే కాకుండా, లాభాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పాత నగరం పెండింగ్‌లో ఉన్న 5.5 కి.మీ (ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా) మెట్రో మార్గాన్ని నిర్మించలేమని చేతులెత్తేసింది. ప్రభుత్వం తరపున హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(హెచ్‌ఎంఆర్‌ఎల్) పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా నిర్ణీత సమయంలో ప్రాజెక్టు చేపట్టేందుకు రైట్ ఆఫ్ వే ఇవ్వకపోవడం, ఈలోగా సంవత్సరాలు గడిచిపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. అదే సమయంలో మెట్రో ప్రాజెక్టు నిర్వహణ అంటేనే ఎల్ అండ్‌టీకి ఏమాత్రం కనబర్చడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే పాత నగరానికి సంబంధించిన 5.5 కి.మీ మార్గానికి హెచ్‌ఎంఆర్ కొత్త డీపీఆర్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.
కేంద్రం ఒప్పుకుంటేనే..
పాతనగరంలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎల్ అండ్‌టీ మెట్రో ముందుకు రాకపోవడంతో కొత్తగా డీపీఆర్ రూపొందించి దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డీపీఆర్‌ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించినా, కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి లేదు.
ఎందుకంటే పాతనగరంలో నిర్మించే 5.5 కి.మీ మెట్రో మార్గానికి గతంలో కేంద్ర అనుమతులు ఇవ్వడంతో పాటు వయా గ్యాప్ ఫండ్(వీజీఎఫ్)ను మంజూరు చేసింది. ఏదేమైనా ఆ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీతో పూర్తి చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్‌ఎంఆర్‌పై ఉంది. ప్రస్తుతం హెచ్‌ఎంఆర్ రూపొందిస్తున్న పాతనగరం మెట్రో డీపీఆర్‌ను అంత సులువుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించే పరిస్థితి లేదని ప్రాజెక్టు నిపుణులు పేర్కొంటున్నారు.
కొత్త డీపీఆర్‌ను కేంద్రం ముందుకు తీసుకువెళితే… పాత నగరం మెట్రో మార్గాన్ని ఎల్ అండ్ టీ ఎందుకు పూర్తి చేయలేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. వాళ్ల నుంచి ఏమైనా రికవరీ చేయాల్సి ఉందా? ఇంత కాలం ఎందుకు జాప్యం జరిగింది.. 2011లోనే అనుమతులు వచ్చిన మొదటి దశ మెట్రోను 2017 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా, ఎందుకు ఆలస్యమైంది అని అడిగే పరిస్థితి ఉంది. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తేనే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
9-10 నెలలు గడిస్తే కానీ..
పాత నగరంలో మెట్రో కారిడార్ నిర్మించే అలైన్‌మెంట్ ప్రకారం మెట్రో ప్రాజెక్టును చేపట్టాలంటే 1000కి పైగా ఆస్తులను సేకరిస్తే గానీ మెట్రోకు రైట్ ఆఫ్ వే దొరకదు. ఈ మార్గంలో ఆస్తుల సేకరణకే రూ.600-రూ.800 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా. దీనికి తోడు పాతబస్తీ అంటే చాలా రకాల మౌలిక వసతులు మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఉంటాయి. వీటన్నింటినీ మరో చోటుకు తరలించాల్సి ఉంటుంది.
ఇలా ఎన్నో అంశాలు పాత నగరంలో మెట్రో మార్గంతో ముడిపడి ఉన్నాయి. రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, పాతనగరానికి సంబంధించిన 5.5 కి.మీ మెట్రో కారిడార్ నిర్మాణానికి చాలా చిక్కు ముళ్లు ఉన్నాయని, వాటన్నంటినీ పరిష్కరించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాలి. అదే సమయంలో ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
Jul 27 2024, 13:34