అంబానీ అందుకున్న బహుమతుల చిట్టా

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన ‘ఖరీదైన విశేషాలు’ మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లూ పెళ్లికి హాజరైన సెలబ్రిటీలకు ముకేష్ అంబానీ అందించిన బహుమతులు గురించి మాత్రమే తెలుసుకున్నాం.

చాలామంది సెలబ్రిటీలకు ఆయన 2 కోట్ల రూపాయల విలువైన వాచీలను బహుమతులుగా ఇచ్చారు. మరి పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు, అనంత్ అంబానీకి ఎలాంటి బహుమతులిచ్చారు. ఇప్పుడీ విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

వీటిలో ముఖ్యమైనది షారూక్ ఖాన్ అందించిన గిఫ్ట్. అనంత్ అంబానీకి కళ్లుచెదిరే గిఫ్ట్ అందించాడట షారూక్. అనంత్ కోసం ఫ్రాన్స్ లో 40 కోట్ల రూపాయల విల్లాను కొనుగోలు చేసి, ఆ తాళాల్ని అతడికి అందించాడట షారూక్. పెళ్లికి వచ్చిన అతిథుల్లో అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చింది షారూక్ మాత్రమే అని టాక్.

ఇక బచ్చన్ కుటుంబం, అనంత్ అంబానీకి 30 కోట్ల రూపాయల విలువైన ఆభరణాల డబ్బాను అందించిందంట. ఇందులో బంగారం, వజ్రాలతో చేసిన ఎన్నో రకాల ఆభరణాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ కూడా దాదాపు 30 కోట్ల రూపాయల ఖరీదైన వాచీని అనంత్ కు బహుకరించాడు. ప్రపంచంలో ఈ వాచీలు కేవలం 30 మాత్రమే ఉన్నాయట. అందులో ఒకటి అనంత్ చెంతకు చేరింది.

అలియా భట్, రణబీర్ దంపతులు 9 కోట్ల విలువైన మెర్సిడెజ్ బెంజ్ కారును అందించగా.. దీపిక-రణ్వీర్ దంపతులు 20 కోట్ల రూపాయల విలువైన కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ కారును బహుకరించారు.

అక్షయ్ కుమార్ 60లక్షల రూపాయల విలువ చేసే 2 పెన్నుల్ని అందించగా.. కియరా అద్వానీ 25 లక్షల రూపాయల విలువైన హ్యాండ్ మేడ్ శాలువను బహుకరించిందట.

ఇక అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 11.5 కోట్ల విలువైన ఇంపోర్టెడ్ కారును బహుమతిగా అందించాడట. సౌత్ నుంచి వెళ్లిన రామ్ చరణ్, సూర్య, రానా, మహేష్ బాబు లాంటి వాళ్లు ఎలాంటి బహుమతులు అందించారనేది ఇంకా బయటకురాలేదు.

నీట్ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టు

నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని నిర్ధారించింది. బీహార్ లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది.

150 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్ తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది. 

అయితే, దేశమంతా నీట్ పేపర్ లీకైనట్టు ఆధారాలు లేవని, అందువల్ల నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, నీట్ పరీక్ష రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.

లీక్ తో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. నీట్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు మార్గం సుగమం అయింది.

ఉద్యోగులు, యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం వరాల జల్లు

Union Budget: 2024 -25 సంబంధించి తొలి కేంద్ర బడ్జెట్‌ను నేడు (జూలై 23) పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నారు.

ఇందులో భాగంగా ఉద్యోగులు, యువతపై వరాల జల్లు కురిపించారు.

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. కేంద్ర బడ్జెట్‌ని నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నారు.

7వ సారి ఆమె బడ్జెట్‌ను ఆవిష్కరిస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మూడో సారి ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నాని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ బడ్జెట్ లో ఉద్యోగులు, యువతపై కేంద్రం వరాలు కురిపించారు. నాలుగు కోట్ల యువతకు ఉపాదే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం అమలు చేస్తామని, 20 లక్షల మంది యువత కోసం సరికొత్త కార్యక్రమం ఏర్పాటు చేసి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ మేరకు 1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడు స్కీమ్స్ ద్వారా ఉద్యోగ కల్పన చేయబోతున్నట్లు చెప్పారు.

బీహార్ కు మొండి చేయి ఏపీకి ఇండికేషన్ !

దేశంలో ఏదో ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూనే ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే కేంద్రం తిరస్కరిస్తూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన బీహార్ లోని జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పుడున్న నిబంధనలు బీహార్ కు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది.

ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ కు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు. బీహార్ లో 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది.

కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు గానీ, ఎన్డీయే సర్కారు గానీ ఈ డిమాండ్ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్ లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీయూలోని కొందరు నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు.

ఇక బీహార్ కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చెయ్యడమంటే ఏపీకి కూడా ఈ హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్న మాట. 2014 లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రాలేదు.

ఎన్డీయే కూటమి అంటే ప్రధానంగా బీజేపీ ఏపీలో టీడీపీ మద్దతు కూడగట్టుకొని అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆశ పెట్టింది. కానీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపింది. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీ పడి హోదాను పక్కన పెట్టేశారు. ఈ వైఖరిని వైఎస్ జగన్ క్యాష్ చేసుకున్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు.

ఇందుకోసం పాతిక మంది ఎంపీలను గెలిపించాలని వేడుకున్నారు. 2019 లో జగన్ పార్టీ సూపర్ డూపర్ గా గెలిచి అధికారం చేపట్టింది. ఎంపీలు కూడా భారీగా గెలిచారు. కానీ …ఎన్డీయేకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇక ఏపీ ప్రజలు కూడా గమ్మున ఉండిపోయారు.

అనేక కారణాలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ మోడీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు హోదా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్ కు రిజెక్ట్ చేశాక ఇక అడిగే అవకాశమే లేదు.

టీడీపీ మద్దతుదారైన ఓ పత్రిక పదేళ్ల తరువాత హోదా కోసం డిమాండ్ చేయడం అనవసరమని రాసుకొచ్చింది. దాని బదులు కేంద్రం నుంచి ఇతరత్రా సహాయాలు పొంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని బాబుకు సలహా ఇచ్చింది. బాబు ఆలోచన కూడా ఇదే. మరి హోదా రిజెక్ట్ నేపథ్యంలో జేడీయూ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.

రైతు బిడ్డ విజయం.. ఇస్రోకే నో చెప్పి.. 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం

ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి.. మరి ఎంఎన్‌సీలో ఏడాదికి ఏకంగా అరకోటి జీతంతో ఉద్యోగం సాధించింది ఓ యువతి. ఆ వివరాలు..

సాధారణంగా చదువుకునే యువతీ యువకులు కలలు కనేది బాగా చదువుకుని.. మంచి ప్యాకేజీ ఉన్న ఉద్యోగం లేదంటే ప్రభుత్వ కొలువు సాధించడం. అయితే అందరూ ఆ ప్రయత్నంలో విజయం సాధించలేరు. ఎవరైతే పట్టుదలగా ప్రయత్నిస్తారో వారు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు.

ఇక వారే చాలా మందికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తారు. ఇక ఇలాంటి అరుదైన ఘనత సాధించే వారిలో యువతులు ఉండటం మరింత గర్వకారణంగా భావిస్తారు. తాజాగా మీకు అలాంటి అరుదైన ఘనత సాధించిన ఓ యువతిని పరిచయం చేయబోతున్నాం.

రైతు కుటుంబంలో పుట్టింది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టం చూసిన ఆ యువతి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఇస్రోలో వచ్చిన జాబ్‌ ఆఫర్‌ను కూడా వదులుకుంది. ఆ తర్వాత ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలు..

ఇస్రోలో జాబ్‌కు నో చెప్పి మరీ.. ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజ్‌తో ఉద్యోగం సాధించింది. ఆ యువతి సాధించిన విజయాన్ని చూసి తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. ఆ వివరాలు.. కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామానికి చెందిన ఆశ్రిత అనే యువతి తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి చదువు గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ బిడ్డను మాత్రం కోరుకున్న చదువు చదివించాలని భావించారు. ఇక ఆశ్రిత కూడా చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించింది. ఆ తర్వాత ఊరికి సమీపంలోని జ్యోతిష్మతి కాలేజీలో బీటెక్‌లో చేరింది

అక్కడే అందరికి భిన్నంగా ఆలోచించింది ఆశ్రిత. బీటెక్‌ చేసిన వారు, మరీ ముఖ్యంగా అమ్మాయిలు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌పై ఆసక్తి చూపుతారు. కానీ ఆశ్రిత మాత్రం అందుకు భిన్నంగా హార్డ్‌వేర్‌ ఫీల్డ్‌ను ఎంచుకుంది.

సాఫ్ట్‌వేర్‌ను వద్దనుకుని.. ఐఐఐటీల్లో ఎంటెక్‌ చేయాలని భావించింది. గేట్‌ కోచింగ్‌ తీసుకోవాలని అనుకుంది. దానిలో భాగంగా కరీంనగర్‌లో ఉచిత కోచింగ్‌ ఇస్తోన్న ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయ్యింది. తొలి ప్రయత్నంలో మంచి ర్యాంక్‌ రాకపోవడంతో.. మరోసారి రాసింది. అలా 2022లో గేట్‌లో 36వ ర్యాంకు తెచ్చుకుంది. 2024లో ఎంటెక్‌ పూర్తయ్యింది. కాలేజ్‌ ప్లేస్‌మెంట్‌లో ఎన్విడియా కంపెనీ నుంచి ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించింది.

గేట్‌లో 36వ ర్యాంక్‌ రావడంతో.. ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డీఆర్‌డీఓ, బార్క్‌లలో జాబ్‌ అవకాశాలు తలుపు తట్టాయి. అయినా వద్దనుకుంది. ఇక తాజాగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి 52 లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువు సాధించి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చని నిరూపించింది ఆశ్రిత. ఆమె సాధించిన విజయం చూసి ఆశ్రిత తల్లిదండ్రులు గర్వపడుతున్నారు.

నిండుకుండలా తుంగభద్ర డ్యాం..

తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.

తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.

మూడురోజుల క్రితమే నదికి ఏ క్షణంలోనైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికారులు ప్రకటించి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు అవసమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

2021 సంవత్సరంలో జలాశయం నుంచి నదికి నీరు విడుదల చేయగా, 2022 సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్‌(Tungabhadra Dam) పూర్తి స్థాయిలో నిండక పోవడంతో నీరు వదలలేదు.

2023లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడాది అనుకున్న సమయం కన్నా ముందుకుగానే డ్యామ్‌ నిండడంతో పాటు వరద పోటు ఎక్కువగా ఉన్న కారణంగా మూడు క్రస్ట్‌గేట్ల గుండా దిగువకు నీటిని వదిలారు.

జలాశయానికి 33 క్రస్ట్‌గేట్లు(Crustgates) ఉండగా, నీటి చేరిక ఆధారంగా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం ఎత్తు 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1628.45 అడుగుల వరకు నీరు చేరిందని, ప్రస్తుతం డ్యామ్‌లో 87.056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చిచేరుతోంది.

జలాశయం నుంచి వివిధ కాలువలకు 7,744 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం ఇదే సయమానికి డ్యామ్‌లో 52.610 టిఎంసిల నీరు నిలువ ఉండగా, ఇన్‌ప్లో 46,605 క్యూసెక్కులు ఉన్నట్లు డ్యామ్‌ అధికారులు తెలిపారు.

అసెంబ్లీలో కేసీఆర్ ఛాంబర్‌పై కేటీఆర్ అసంతృప్తి

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (BRS Chief KCR) కేటాయించిన ఛాంబర్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశాల సందర్భంగా ఇన్నర్ లాబీలోని ఎల్‌వోపీ కార్యాలయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే. ఔటర్ లాబీలో ఎల్‌వోపీకి ఛాంబర్ ఏర్పాటు చేశారు. రెండు రూమ్‌లు కలిపి ఒకే రూంగా అసెంబ్లీ సిబ్బంది మార్చేశారు.

అయితే రూం మధ్యలో టాయిలెట్ పెట్టి వాడుకోవడానికి అనుకూలంగా లేకుండా చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశాన్ని బీఏసీలో లేవనెత్తాలని మాజీ మంత్రి హరీష్‌రావుకు (Former Harish Rao) కేటీఆర్ సూచించారు. స్పీకర్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేయాలని కేటీఆర్ నిర్ణయించారు.

కాగా... అసెంబ్లీకి చేరుకునే ముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అలాగే ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరుకానున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అసెంబ్లీకి హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు.

కేవలం ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నేతలు కూడా గన్‌పార్క్‌ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలని, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.

Buget 2024: ఏపీకి నిర్మలమ్మ గుడ్ న్యూస్-అమరావతికి 15 వేల కోట్లు-పోలవరం సహా ప్రాజెక్టులకూ..!

ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రానికి భారీ సాయం ప్రకటించారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ను వెనుకబడిన జార్ఖండ్ తో సమానంగా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. దీంతో చాలాకాలం తర్వాత కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం దక్కినట్లయింది.

ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి నిర్మల తెలిపారు. ఈ మొత్తాన్ని వివిధ ఆర్ధిక సంస్థల నుంచి సేకరించాలని నిర్ణయించామన్నారు.

అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. దేశ ఆహార భద్రతకు పోలవరం ప్రాజెక్టు కీలకమన్నారు. అలాగే రాష్ట్రానికీ, రైతులకు జీవనాడి అన్నారు. అటు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు నిర్మల తెలిపారు.

ఇందులో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాపై దృష్టిసారిస్తామన్నారు.

అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ ల అభివృద్ధికి కూడా సాయం చేస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో విశాఖ-చెన్నై-ఓర్వకల్లు-బెంగళూరు కారిడార్ కు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల అభివృద్ధికి సాయం అందిస్తామన్నారు.

మరోవైపు ఏపీ సహా తూర్పు ప్రాంతాల అభివృద్ధి చేపడతామని నిర్మల బడ్జెట్ లో తెలిపారు. తద్వారా విభజన తర్వాత నష్టపోయిన ఏపీకి తగినంత ప్రయోజనం చేకూరబోతోంది.

విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అంత సులువు కాదు!

గత ఐదేళ్ళలో జగన్మోహన్‌ రెడ్డి అనుసరించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా ఉన్నత విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నత విద్యకు నిలయాలైన యూనివర్సిటీలన్నీ సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇవి అధికార పార్టీకి అనుబంధ సంస్థలుగా మారిపోయాయి. కాబట్టే ప్రభుత్వం మారగానే దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జగన్‌ ప్రభుత్వం వీసీల నియామకంలో ఎలా వ్యవహరించిందో

అర్థమవుతుంది. ఉపకులపతి పోస్టులకు సంబంధించి అప్పటికే ఉన్న నిబంధనలను సడలించి, తమ వారికి వైసీపీ పట్టం కట్టింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వీసీగా పని చేసిన వ్యక్తికి ప్రొఫెసర్‌గా పదేళ్ల సర్వీసు లేకపోవడంతో అప్పటికే నియమించిన సెర్చి కమిటీని రద్దు చేసి, ఆయన కోసమే ఆ నిబంధన మార్చి, మరోసారి సెర్చ్‌ కమిటీ వేసి ఆ వ్యక్తినే వీసీగా నియమించారు. ఈ వ్యవహారంలో కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పారన్నది బహిరంగ రహస్యం. ఆయన అనంతరం ఆ పదవిలోకి వచ్చిన వ్యక్తి కూడా మాజీ మంత్రి చెబితే తప్ప, ఆ పదవి నుంచి వైదొలగనన్నారు. అయితే యూనివర్సిటీలో ఆయన వల్ల నష్టపోయిన బాధితులంతా ఏకమవడంతో ఇక్కట్లు తప్పవని గ్రహించి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ (ఏయూ) వీసీగా పని చేసిన ప్రసాద రెడ్డి వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీసీగా ఆయన పదవీ కాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్‌ వీసీగా అప్పటికే రెక్టారుగా పని చేస్తున్న మహిళను నియమిస్తే, ప్రసాద రెడ్డి సహించలేకపోయారు. రెండు రోజుల పాటు వీసీ ఛాంబర్‌లో ఆమెను కూర్చోనివ్వలేదు. దీంతో ఆమె రెక్టార్‌ ఛాంబరులోనే వీసీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీల వ్యవహారం ఇదే తరహాలో నడిచింది. ఇక వర్సిటీల పాలకమండళ్లయితే గత ప్రభుత్వంలో పూర్తిగా అధికార పార్టీకి చెందిన రాజకీయ నిరుద్యోగులతోనే నిండిపోయాయి.

యూనివర్సిటీలు రాజకీయ కేంద్రాలుగా మారడంతో బోధనారంగం తీవ్రంగా నష్టపోయింది. ఏ ఒక్క వర్సిటీలోనూ తగినంత మంది శాశ్వత ఆచార్యులు లేరు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనల ప్రకారం అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి 1:20గా ఉండాలి. ఏ ఒక్క యూనివర్సిటీలోనూ ఈ నిష్పత్తి లేదు. విద్యార్థులకు సరైన విద్య అందక వర్సిటీలంటే పీజీ పట్టాలిచ్చే కేంద్రాలుగా మిగిలిపోతున్నాయి. అధ్యాపకుల కొరత పరిశోధనా రంగంపై మరింత తీవ్రంగా పడుతున్నది. బోధన కోసం తాత్కాలిక పద్ధతుల్లో కాంట్రాక్టు అధ్యాపకులను నియమించుకుని నెట్టుకు వచ్చినా, పరిశోధనా రంగం విషయంలో అటువంటి అవకాశం లేదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్లుగా శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పరిశోధనలు (పీహెచ్‌డీ) చేయించే అవకాశం ఉంది. దీంతో పరిశోధకులకు మార్గనిర్దేశం చేయాల్సిన అధ్యాపకుల కొరత తీవ్రమై ఈ ప్రభావం ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాష్ట్రంలోని ఒక ప్రఖ్యాత వర్సిటీలోని తెలుగు అధ్యయనశాఖలో 16 మంది శాశ్వత అధ్యాపకులు ఉండాల్సిన చోట ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. పరిశోధనలన్నీ ఆ ఒక్కరి వద్ద జరగడం అసాధ్యం. దాదాపు అన్ని వర్సిటీల్లో ఇదే స్థితి. ఈ తరహా విపత్కర పరిస్థితుల నేపథ్యంలోనే ఏటా నిర్వహించాల్సిన రీసెట్‌లు సక్రమంగా జరగడం లేదు. ఏటా రెండుసార్లు యూజీసీ నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (నెట్‌) సాధించి, ఆర్థిక భరోసాతో పరిశోధనలు చేయడానికి వస్తున్న పీహెచ్‌డీ ఆశావహులకు ఏపీలోని యూనివర్సిటీల్లో దాదాపు అన్ని విభాగాల్లోనూ రెడ్‌ బోర్డులే ఎదురవుతున్నాయి.

దీంతో పాటు శాశ్వత అధ్యాపకులకు మాత్రమే యూజీసీ, ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ వంటి అనేక సంస్థలు నుంచి అందివచ్చే రీసెర్చి ప్రాజెక్టులు అందడం లేదు. వివిధ సంస్థలు ఇచ్చే పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌లపైనా ఈ ప్రభావం ఉంటున్నది. సైన్సు విభాగాలైతే కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కోల్పోతున్నాయి. అవసరమైన స్థాయిలో నియామకాలు లేకనే పరిశోధనా రంగానికి ఈ స్థాయి నష్టం జరుగుతోంది.

వర్సిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. గతంలో ఏ వర్సిటీకి ఆ వర్సిటీ తమ వద్ద ఉన్న ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసుకొనేవి. అయితే వివిధ కారణాలతో పోస్టుల క్రమబద్ధీకరణ చేయాలని గత ప్రభుత్వాలు భావించడంతో కొత్త సమస్యలు తలెత్తాయి. 2018లో ఒక నోటిఫికేషన్‌ విడుదలైంది. పరీక్షలు పూర్తయ్యాయి. తరువాత లోపాల కారణంగా ఆ నోటిఫికేషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

వన్నీ పట్టించుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి రేషనలైజేషన్‌ పేరుతో ఇష్టానుసారం వ్యవహరించింది. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా నిర్ణయాలు జరిగాయి. ఉదాహరణకు ఎస్‌వీయూలోని ఆంత్రోపాలజీ విభాగాన్ని మరో విభాగంలో అంతర్భాగం చేసి అక్కడ ఉన్న ఆచార్య పోస్టులను తగ్గించారు. ఏయూలో అదే ఆంత్రోపాలజీని అలాగే కొనసాగించారు. ఇష్టానుసారం విభాగాలను కుదించడం, కలిపివేయడం, ఒక డిపార్టుమెంటులోని పోస్టులను మరోచోట చూపించడం వంటివి సాధారణమయ్యాయి. ఇటువంటి వింతలతో ఆ రేషనలైజేషన్‌ లోపభూయిష్టంగా ఉండడంతో, దీనిపై ఆయా వర్శిటీల్లో పెద్ద చర్చే నడిచింది. మూడు వేలకు పైగా పోస్టులను తామే భర్తీ చేస్తామంటూ గత ప్రభుత్వం ఎన్నికల సమయానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. పోస్టుల రోస్టరు పాయింట్లకు సంబంధించి అనేక లొసుగులు వెలుగు చూశాయి. మహిళా రిజర్వేషన్‌ కింద వారికి ఏ నెంబరు పోస్టో స్పష్టం చేయలేదు. దివ్యాంగుల రోస్టరు పాయింట్లను పూర్తిగా విస్మరించి, మోసగించి 42 వేల మంది అభ్యర్థుల నుంచి ఫీజుల రూపంలో కోట్లాది రూపాయల్ని దండుకొని వారి ఆశలతో ఆటలాడుకుంది. అనంతరం కోర్టుల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పుకోలేని స్థితిని జగన్‌ ప్రభుత్వం ఎదుర్కొంది

వర్సిటీల్లో పోస్టులు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వానికి అంత సులభం కాదు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లో రోస్టర్‌ పాయింట్లకు యూనివర్సిటీని యూనిట్‌గా తీసుకోవాలా లేదా డిపార్ట్‌మెంట్‌ను యూనిట్‌గా తీసుకోవాలా అనే అంశం, జగన్‌ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని లోపాలు, కాపులకు గతంలో ఇచ్చిన ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు (దీన్ని జగన్‌ ప్రభుత్వం తొలగించింది), మహిళా, దివ్యాంగుల రోస్టరు పాయింట్లు అనేవి మరోసారి సమస్యగా మారవచ్చు. ఇప్పటికే వర్సిటీలకు సంబంధించి వందలాది కేసులు వివిధ కోర్టుల్లో ఉన్నాయి.

దాదాపు రెండు దశాబ్దాలుగా శాశ్వత నియామకాలు లేకపోవడంతో బోధన కోసం అన్ని వర్సిటీల్లో కాంట్ట్రాక్టు, టీచింగ్‌ అసిసెంట్లు, అతిథి అధ్యాపకుల రూపంలో వేలాదిగా పనిచేస్తున్నారు. వారికి అందుతున్నవి అరకొర వేతనాలే. అవి కూడా ఒక్కో వర్సిటీలో ఒక్కో వేతనం ఉంది. ఎంతో కాలంగా యూనివర్సిటీలనే నమ్ముకుని బతుకీడుస్తున్న వారికి శాశ్వత అధ్యాపక పోస్టుల నియామకాలలో న్యాయం చేయాల్సి ఉంటుంది.

ఈ చిక్కుముడులన్నీ విప్పడంతో పాటు కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. గాడితప్పిన పాలనా వ్యవస్థను చక్కదిద్దడంతో పాటు ఆచార్య పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే తప్ప రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు మనుగడ ఉండదు.

NEET UG 2024: ఫిజిక్స్ ప్రశ్నపై ఐఐటీ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశం

నీట్-యూజీ 2024 పరీక్షా పత్రంలో చర్చనీయాంశమైన ఫిజిక్స్ ప్రశ్నపై సరైన సమాధానం కోసం ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్‌కు సీజేఐ డైవై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 నీట్-యూజీ 2024 (NEET-UG 2024) పరీక్షా పత్రంలో చర్చనీయాంశమైన ఫిజిక్స్ ప్రశ్నపై సరైన సమాధానం కోసం ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్‌కు సీజేఐ (CJI) డైవై చంద్రచూడ్ (DY Chandachud) సారథ్యంలోని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం సోమవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గ్రేస్ మార్కులకు దారితీసిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు దానిపై సమాధానం సమర్పించాలని ఆదేశించింది. మంగళవారంనాడు కూడా విచారణ కొనసాగనుంది.

నీట్ పరీక్షా పత్రం, లీకేజీ అవకతవలపై సుప్రీంకోర్టు సోమవారం తిరిగి విచారణ జరిగింది.

గ్రేస్ మార్కులకు దారితీసిన ఫిజిక్స్ ప్రశ్న అంశాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు.

ఒక ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చి, మార్కులు మాత్రం ఒకదానికే వేశారని, దానికి గ్రేస్ మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా మెరిట్ లిస్ట్ మారే అవకాశం ఉందని పిటిషనర్లు వాదించారు.

దీనిపై ధర్మాసనం వెంటనే స్పందిస్తూ, సరైన సమాధానం కోసం ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి ఆ సమాధానం తమకు సమర్పించాలని ఢిల్లీ-ఐఐటీ డైరెక్టర్‌ను ఆదేశించింది.