ఆశాజనకంగా తెలంగాణ రాబడి మూడో ఆర్థిక త్రైమాసిక కాగ్ నివేదిక
కేసీఆర్ హయాంలో ప్రబల ఆర్థిక శక్తిగా రాష్ట్రం..
నిరుడి కంటే రూ. 24,221 కోట్లు అధికం
ఆశాజనకంగా తెలంగాణ రాబడి
మూడో ఆర్థిక త్రైమాసికంపై కాగ్ నివేదిక
తెలంగాణ రాష్ట్రం:
[Crime journalist] :-
అనతికాలంలోనే తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగింది. కేసీఆర్ పాలనలో ఆర్థిక వనరులను భారీగా పెంచడంతో పదేండ్లలోనే గణనీయ ఆర్థిక వృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ఆర్థిక సంవత్సర (2014-15)లో మూడో త్రైమాసికం (క్యూ-3) చివరి నాటికి రూ.74,419 కోట్లుగా ఉన్న రాష్ట్ర రాబడి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి నాటికి 1,88,863 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర బడ్జెట్ అంచనాలో దాదాపు 73 శాతానికి సమానం. 2014-15 క్యూ-3 చివరి నాటికి వచ్చిన రాబడి కంటే రూ.1,14,444 కోట్లు అధికం.
నిరుడు ఇదే సమయానికి వచ్చిన రాబడి కంటే రూ.24,221 కోట్లు ఎక్కువ. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి మొత్తంగా రూ.2,39,986 కోట్ల రాబడి వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేయగా.. డిసెంబర్ చివరి నాటికి రూ.1,64,641 కోట్ల రాబడి వచ్చింది. ఇది బడ్జెట్ అంచనాలో 69 శాతానికి సమానం. ఇలా ఏటికేడు ఆర్థిక వనరులను పెంచుకుంటూ తెలంగాణ తక్కువ సమయంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని తాజా నివేదికలో కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కొనియాడింది.
రూ.91,136 కోట్ల పన్ను రాబడి
పన్నుల రాబడిలోనూ తెలంగాణ గణనీయ వృద్ధి సాధించింది. ఈ ఆర్థి క సంవత్సరంలో పన్నుల రూపేణా రూ.1,43,989 కోట్లు రావచ్చని ఆర్థిక శాఖ అంచనా వేయగా.. క్యూ-3 చివరి నాటికి రూ.91,136 కోట్ల రాబడి వచ్చింది. ఇది అంచనాలో 63 శాతానికి సమానం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి వచ్చిన 79,506 కోట్ల పన్ను రాబడి కంటే రూ.11,630 కోట్లు అధికం. ఈసారీ పన్ను రాబడుల్లో ప్రధాన వాటా వస్తు, సేవల పన్నుదే. జీఎస్టీ రూపేణా రూ.33,581 కోట్లు ఖజానాకు చేరగా.. అమ్మకం పన్ను ద్వారా రూ.13,806 కోట్లు, ఎక్సైజ్ సుంకాల రూపంలో రూ.11,308 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,025 కోట్లు సమకూరాయి.
Feb 02 2024, 16:21