వైభవంగా తెప్పోత్సవం.. గంగ పూజ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు...
వైభవంగా తెప్పోత్సవం.. గంగ పూజ చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు భక్తుల గోవింద నామస్మరణతో శింగనమల రంగరాయల చెరువు పులకించింది. విద్యుత్ దీప కాంతులు, పూలతో అలంకరించిన తెప్పపై సీతా ఆత్మారామస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత గొలకొండ వెంకటరమణస్వామి, ఆంజనేయ స్వామి, వాసవీమాత విగ్రహాలను అత్యంత వైభవంగా ఊరేగించారు.
తెప్పోత్సవానికి శింగనమల చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 4 గంటలకు స్వాముల విగ్రహాలను రామాలయం నుంచి చెరువు వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు తెప్ప పైన విగ్రహాలను కొలువు దీర్చి పూజలు చేశారు. తెప్పోత్సవం ముగిసాక గ్రామంలో విగ్రహాలను ఊరేగించారు. ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు* ప్రతి ఏటా కార్తీక మాసం ద్వాదశి రోజున ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది కూడా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. తెప్ప, చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు గంగపూజ చేశారు. శింగనమల చెరువు ఎప్పుడూ నీటితో కళకళలాడుతూ, పంటలు బాగా పండాలని, రైతులు, మత్స్యకారులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడిని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామంలోని చెన్నకేశవాలయంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు కార్తీక మాసం ద్వాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Nov 25 2023, 15:13