అసోం కామాఖ్య దేవి ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

అసోంలోని గువ‌హ‌టిలో ఉన్న కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం దర్శించుకున్నారు.

ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌విత‌కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. కామాఖ్య ఆల‌యంలో క‌విత ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, దేశ ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాల‌ని ప్రార్థించానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని, సీఎం కేసీఆర్‌ని మరోసారి భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని స్పష్టం చేశారు.

నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నానని, తాజాగా మళ్ళీ కామాఖ్య దేవిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు.

ఆధ్యాత్మికతలో భారతదేశం విరజిల్లుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉందని, ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన అసోంలో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఆత్మవిశ్వాసం ఉన్న చెల్లికి దేవుడిచ్చిన అన్నయ్య తోడు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ ఉద్యోగిని రుద్ర రచన రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రుద్ర రచన సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే …. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామానికి చెందిన రుద్ర రచన చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి స్థానిక బాల సదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడ‌లోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్ విద్య పూర్తి చేశారు.

ఈసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్ సీబీఐటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ సీటు సంపాదించారు. అయితే తల్లిదండ్రులు లేని రుద్ర రచన తన ఇంజనీరింగ్ ఫీజు చెల్లించలేకపోయింది. 2019లో సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి ఆమెను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని ఇంజినీరింగ్ చదువు పూర్తి అయ్యేందుకు అవసరమైన ఖర్చులను భరిస్తానని భరోసా ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం రుద్ర రచన ఇంజినీరింగ్ ఫీజులు, హాస్టల్ సంబంధిత ఖర్చులను కేటీఆర్ తన వ్యక్తిగత సంపాదన నుంచి భరించారు. కేటీఆర్ ఆర్థిక సహాయంతో ఇంజినీరింగ్ చదివిన రుద్ర రచన.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు.

ఆ సంద‌ర్భంగా ప్రగతి భవన్‌లో మంత్రిని కలువగా ఆమె చదువు, ఉద్యోగాల గురించి తెలుసుకుని సంతోషపడ్డారు. తనకంటూ ఎవరూ లేకున్నా రుద్ర రచన ఆత్మ విశ్వాసంతో జీవితంలో విజయం సాధించిందని మెచ్చుకున్నారు. అప్పుడు కూడా రుద్ర రచన మంత్రి కేటీఆర్‌కు వెండి రాఖీ తయారు చేయించి కట్టారు. ఉద్యోగం సాధించిన ర‌చ‌న త‌న సంపాద‌న‌లోని ల‌క్ష రూపాయిల‌ను ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి అందించారు...

Supreme Court: సుప్రీం కోర్టు న్యాయవాదిని దారుణంగా చంపేసిన భర్త.. ఎందుకంటే..?

లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయవాదిని ఆమె భర్తనే దారుణంగా చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచిపెట్టాడు.

తాను స్టోర్ రూంలో దాక్కున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 61 ఏళ్ల సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా, 62 ఏళ్ల ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా నోయిడాలోని సెక్టార్ 30లో గల బంగ్లాలో నివాసం ఉంటున్నారు. నితిన్ నాథ్ సిన్హా మాజీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. వారి కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు.

అయితే రెండు రోజులగా రేణు సిన్హా కనిపించకుండాపోయింది. ఆమె సోదరుడు ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. న్యాయవాది సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు వారు నివాసం ఉండే బంగ్లాలోకి ప్రవేశించారు. బంగ్లా మొత్తం వెతకగా బాత్‌రూమ్‌లో రేణు సిన్హా మృతదేహం లభించింది. ఈ ఘటన శనివారం జరిగింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి రేణు సిన్హా భర్త నితిన్ సిన్హా కూడా కనిపించకపోకుండాపోయాడు. దీంతో న్యాయవాది సోదరుడు తన సోదరిని ఆమె భర్తనే హత్య చేశాడని ఆరోపించాడు. పైగా భార్యభర్తలిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు కూడా జరుగుతున్నట్టు తెలిపాడు. అనంతరం న్యాయవాది భర్త నితిన్ కోసం పోలీసులు గాలించగా అచూకీ లభించలేదు. చివరికి నితిన్ ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు.

అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. బంగ్లాలో వెతకగా స్టోర్ రూంలో నితిన్ దొరికాడు. భార్యను హత్య చేశాక 36 గంటలపాటు నితిన్ స్టోర్ రూంలోనే దాక్కున్నాడు. అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యభర్తల మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. నితిన్ బంగ్లాను రూ.4 కోట్లకు విక్రయించడానికి ప్లాన్ చేశాడని, అంతేకాకుండా అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు చెప్పారు. కానీ బంగ్లాను అమ్మడాన్ని నితిన్ భార్య రేణు సిన్హా వ్యతిరేకించిందని పేర్కొన్నారు. ఈ వివాదమే భార్యభర్తల మధ్య తరచుగా గొడవలకు దారి తీసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు నితిన్ నాథ్ సిన్హాపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు..

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికై 13న ధర్నాను జయప్రదం చేయండి

-:పోలే సత్యనారాయణ

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈనెల 13న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు జిల్లాలోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండ మండలంలోని పెద్ద సూరారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన 2000/ రూపాయల వేతనం వెంటనే అమలు చేయాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుండి ఏరియర్స్ తో సహా చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలంగాణలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వంట చేసిన బిల్లులు రాక కార్మికులు అప్పులు తెచ్చిన దగ్గర వడ్డీలు కట్టలేక కుటుంబాలు గడవక అర్ధాకలితో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముల్గే నక్క మీద తాటి పండ్లు పడ్డ చందంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు పాత మెనూకే సరిపోకపోగా కొత్త మెనూ ప్రకారం వండి పెట్టమని కార్మికులను అనేక ఇబ్బందులకు, భయాందోళనలకు గురి చేస్తూ వేధిస్తున్నారని అన్నారు అంగన్వాడి కేంద్రాల మాదిరిగా పాఠశాలలకు ప్రభుత్వమే గుడ్లు సరఫరా చేయాలని, వంటకు సరిపడా గ్యాస్ పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని కార్మికులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని తదితర సమస్యల పరిష్కారానికై ఈ నెల 13న (బుధవారం) జరిగే రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ధర్నాకు జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున కదలి విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొండ రాములమ్మ, గోవర్ధనమ్మ, జాకటి లక్ష్మమ్మ, ముసుకు కలమ్మ తదితరులు పాల్గొన్నారు.

చంద్ర‌బాబు డే 1

తన జీవితంలో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

జైల్లో ఆయనకు స్నేహ బ్లాక్ లో ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. అన్ని వసతులు కల్పించారు. ఒక సహాయకుడితో పాటు, ఐదుగురు సిబ్బందితో భద్రతను కల్పించారు. అంతేకాదు ఆయన ఉన్న బ్లాక్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

డ్యూటీ సిబ్బంది మినహా మరెవరినీ అక్కడకు వెళ్లనీయడం లేదు. ఇక ఉదయాన్నే చంద్రబాబు నాయుడికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు..

చంద్రబాబుకు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయం అల్పాహారంగా ఆయనకు ఫ్రూట్ సలాడ్ ను కుటుంబ సభ్యులు పంపించారు.

అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని సిబ్బంది అందించారు. అలాగే బ్ర‌హ్మ‌ణి, నారా లోకేష్, భువ‌నేశ్వ‌రి లు నేడు ములాఖ‌త్ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ని క‌లువ‌నున్నారు..

ఇక చంద్ర‌బాబు ఆహారం ఇత‌ర స‌దుపాయాల‌న్ని టిడిపి నేత వాసు ఇంటి నుంచి క‌ల్పిస్తున్నారు.. నారా లోకేష్ కూడా అక్క‌డే బ‌స చేశారు..

శ్రీ సీత రామాంజనేయ స్వామి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై భారీ విరాళం అందించిన - పిల్లి రామరాజు యాదవ్

నేడు కనగల్ మండలం బుడమర్లపల్లి గ్రామంలో పరిధిలోని నూతనంగా శ్రీ సీత రామాంజనేయు స్వామి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి తెరాస రాష్ట్ర నాయకులు,RKS ఫౌండేషన్ ఛైర్మెన్ - పిల్లి రామరాజు యాదవ్ గారు. హాజరై తమ RKS ఫౌండేషన్ ద్వారా 1,00,116/- (లక్ష నూట పదహారు రూపాయల ) విరాళంగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారింగు పార్వతమ్మ - జానయ్య ఎంపీటీసీ యెరెడ్ల సరస్వతి సుధాకర్ రెడ్డి ఉప సర్పంచ్ మామిడాలా శివ PACS వైస్ చైర్మన్ కారింగు లక్ష్మయ్య ఆలయ చైర్మన్ చెదురుపెల్లి సైదులు BRS పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కందుల రమేష్ వార్డ్ సభ్యులు కందుల ప్రవీణ్ అనుముల సుధాకర్ బొడ్డుపల్లి శ్రీను కారింగు నర్సింహా మామిడాల నర్సింహా పంతంగి సైదులు కారింగు వినోద్ బోయపల్లి నాగరాజు నకిరేకంటి రాము పంతంగి నగేష్ పంతంగి కార్తీక్ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు మహిళ న్యాయమూర్తి కి రోడ్డు ప్రమాదం: స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

మంత్రి జగదీశ్‌ రెడ్డి సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది.

ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజాత ప్రయాణిస్తున్న వాహనం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో జస్టిస్‌ సుజాత తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రథమ చికిత్స నిమిత్తం ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు.

అదే సమయంలో తిరుమలగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీశ్‌ రెడ్డి విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. న్యాయమూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో.. వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు.

సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్లియరెన్స్ చేసేలా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఓ వైపు జోరు వాన కురుస్తుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా జస్టిస్‌ సుజాతను తరలిస్తున్న అంబులెన్స్‌ను తన కాన్వాయ్ మధ్యలో ఉంచి గంట 15 నిమిషాల్లో హైదరాబాద్‌ తరలించారు.

దగ్గరుండి ఆమెను దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం జస్టిస్‌ సుజాత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో న్యాయమూర్తిని హైదరాబాద్ తరలించడం మంచి పరిణయం అని వైద్యుడు తెలిపారు...

Rahul Gandhi: మేం పెట్టిన పేరు చిరాకు పుట్టిస్తుందేమో..?: కేంద్రానికి రాహుల్‌ కౌంటర్‌

పారిస్‌: కేంద్రం 'ఇండియా' పేరును మారుస్తుందంటూ వస్తోన్న ఊహాగానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. ప్రతిపక్షాల కూటమికి 'ఇండియా' పేరు పెట్టడం వల్ల ప్రభుత్వం చిరాకుపడి ఉండొచ్చని వ్యాఖ్యలు చేశారు.‌

ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న ఆయన.. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

''రాజ్యాంగం.. రెండు పేర్లను వాడుతోంది. అందులో 'ఇండియా, భారత్‌' అని ఉంటుంది. ఈ పేర్ల విషయంలో ఎలాంటి సమస్యా లేదు. ఆ రెండు పేర్లు ఆమోదయోగ్యమైనవి. అయితే మా కూటమికి ఇండియా పేరు పెట్టి.. మేం ప్రభుత్వాన్ని చిరాకుకు గురిచేసి ఉండొచ్చు. అదే పేరు మార్చాలనే వారి నిర్ణయానికి దారి తీసి ఉండొచ్చు' అంటూ రాహుల్(Rahul Gandhi) చిరునవ్వు చిందించారు.

శని, ఆదివారాలు భారత్‌ జీ20 శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించింది. దానిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అతిథులకు పంపిన ఆహ్వానంపై President of India అని బదులుగా President of Bharat అని ముద్రించడంతో ఈ పేరు మార్పు అంశంపై చర్చ మొదలైంది.

అలాగే జీ20 సదస్సు(G20 Summit)లోనూ కేంద్రం భారత్‌పేరునే ఉపయోగించింది. ఈ సమావేశంలో మోదీ కూర్చున్న స్థానం వద్ద నామఫలకంపై మన దేశం పేరును 'భారత్‌'గానే పేర్కొన్నారు. అంతేకాదు సదస్సును ప్రారంభిస్తూ.. ప్రధాని మోదీ కూడా 'భారత్‌ మీకు స్వాగతం పలుకుతోంది' అని వ్యాఖ్యానించారు.

Supreme Court: సునీత విజ్ఞప్తి.. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 3 వారాలకు వాయిదా పడింది..

అనివార్య కారణాల నేపథ్యంలో వాయిదా వేయాలంటూ వివేకా కుమార్తె, పిటిషనర్‌ సునీత నర్రెడ్డి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది.

అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ ఈ ఏడాది మేలో తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ కన్నా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కొన్ని అనివార్య కారణాల రీత్యా కేసు విచారణను వాయిదా వేయాలని సునీత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. ఆ తర్వాత నాన్‌ మిస్లేనియస్‌ డే రోజు విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది..

నల్గొండ జిల్లాలో మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

స్టోర్ రూమ్లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్ రూమ్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.

పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగ వల్ల గొంతులో మంట పుడుతోందని చెప్పారు...