కేసీఆర్ రాక్షస పాలనలో మనుషులను కుక్కలు పీక్కుతింటున్నాయి - రేవంత్ రెడ్డి
Street Buzz news తెలంగాణ రాష్ట్రం:
మనుషులను వీధికుక్కలు పీక్కుతినే స్థాయి అధ్వాన పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్ల చిన్నారిని హైదరాబాద్‌లో కుక్కలు కరిచి చంపేస్తే కుక్కలకు ఆకలేసిందని అక్కడి మేయర్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే.. కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామని మంత్రి చెబుతున్నారన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పి చేతులు దులుపుకున్న ఘనత ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి దక్కిందననారు. బాధిత కుటుంబంపై కనీస సానుభూతి చూపని రాక్షస ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. కేటీఆర్ భూపాలపల్లి పర్యటనకుముందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 14వ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలోని కోటంచలోని లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో స్వామి వారిని రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీతక్క, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. నక్సలైట్లు ఎర్రజెండాలు పాతి పేదలకు పంచి పెట్టిన భూములను మళ్లీ గండ్ర రమణారెడ్డి ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. దోపిడీకి ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని వందల ఎకరాలను ఆక్రమించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్‌రావు, భూపాలపల్లికి రమణారెడ్డిని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ను, వరంగల్ తూర్పుకు నన్నపునేని నరేందర్‌లను సామంత రాజులుగా నియమించుకుని మంత్రి కేటీఆర్ దోపిడీకి పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు గుండాలుగా మారిపోయారన్నారు. ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండాపోయిందని అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర గండ్ర వెంకట రమణారెడ్డి భూముల ఆక్రమణలపై విచారణకు డ్రామారావు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి చేస్తున్న దందాలు, అక్రమాలు, భూ ఆక్రమణల్లో కేటీఆర్‌కు వాటాలు లేకుంటే.. విచారణకు అదేశించాలని డిమాండ్ చేశారు. గండ్ర రమణారెడ్డి చేస్తున్న దందాల్లో, అక్రమాల్లో కేటీఆర్‌కు భాగస్వామ్యం ఉందని నిరూపించడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ గుండాలు ఆక్రమించుకున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది లేదని, సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం చిట్యాల మండలం చల్లగరిగేకు వాహనంలో చేరుకున్న రేవంత్ రెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఇదే మండలంలోని తిరుమలాపూర్ నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు రూ. 5 లక్షల రూపాయలను కేటాయిస్తామని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని, రూ. 500 లకే వంట గ్యాస్ ను అందిస్తామని హామీనిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, మొగుళ్లపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీల రాజు కురుమ, నాయకులు మండ రవీందర్ గౌడ్, క్యాతరాజు రమేష్, నీరటి మహేందర్, నడిగోటి రాము, ఎండి రఫీ, బండారి కుమారస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Jul 20 2023, 08:59