ఈ నగరానికి ఏమైంది❓️
హైదరాబాద్: హైకోర్టు వద్ద అందరూ చూస్తుండగా ఓ యువకుడిని దారుణంగా పొడిచి చంపేశారు. రూ.10 వేల కోసం జరిగిన ఘర్షణలో ఈ హత్య జరిగింది. జవహర్‌నగర్‌లో మద్యంమత్తులో పడిపోయిన వ్యక్తి జేబులోని సెల్‌ఫోన్ కోసం అతడి గొంతు నులిమి చంపేశారు. మద్యం తాగేందుకు డబ్బుల కోసం ఈ హత్య జరిగింది. చిన్న చిన్న కారణాలకే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు. వంద, వెయ్యి కోసం కూడా హత్య చేస్తున్న ఘటనలు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. నాలుగేళ్లలో పోలీసుల డేటా పరిశీలిస్తే.. సగటున ప్రతి 36 గంటలకు ఓ హత్య.. రోజుకో హత్యాయత్నం జరుగుతోంది.
ఒకప్పుడు ఫ్యాక్షన్ పగలు, ప్రతీకారాలు, ముఠా తగాదాలు, గ్యాంగ్‌వార్‌లు, రియల్ ఎస్టేట్ దందాల వ్యవహారాల్లో హత్యలు జరిగినట్లు రికార్డుల్లో ఉండగా, ఇప్పుడు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు..ఇలా రకరకాల కారణాలతో హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి నేరచరిత్ర లేని వారు కూడా హత్య చేయడానికి వెనకాడటం లేదు. నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో నాలుగేళ్లలో 980 హత్యలు, 1541 హత్యాయత్నాలు జరిగాయి. ఈ ఏడాది మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు సుమారు 80 హత్యలు జరిగినట్లు సమాచారం.
కలకలం సృష్టించిన ఘటనలు
నగరం, శివారు ప్రాంతాల్లో 20 రోజుల్లో రెండు చోట్ల గోనె సంచుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఓ మృతదేహం పహడీషరీఫ్ పరిధిలో లభ్యమైంది. షాద్‌నగర్ వద్ద బాలుడు గోనెసంచిలో మృతదేహంగా కనిపించాడు. వీరిని ఎక్కడో చంపి..పడేశారని పోలీస్ విచారణలో తేలింది.
అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ట్రయాంగిల్ లవ్ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర చంపేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
ఫోన్ చేయడం లేదని ఆగ్రహంతో ఊగిపోయిన భర్త చందానగర్ పీఎస్ పరిధిలో ఓ మాల్‌లో పని చేస్తున్న భార్య అంబికను హతమార్చాడు.
తండ్రికి ఇవ్వాల్సిన అప్పు అడుగుతున్నాడని ఆగ్రహంతో ఓ ట్రాన్స్‌జెండర్ 8 ఏళ్ళ బాలుడిని దారుణంగా చంపేశాడు.
స్నేహితుల మధ్య విభేదాలతో కుల్సుంపురా పీఎస్ పరిధిలో పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన వీడియో వైరల్‌గా మారింది.
కౌకూర్‌లో పెయింటర్ హత్య కేసును జవహర్‌నగర్ పోలీసులు కేవలం 6 గంటల్లో ఛేదించారు. సెల్‌ఫోన్ కోసమే దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన పడకలూరు సురేశ్ (38) పెయింటర్. పని చేయగా వచ్చిన డబ్బులతో ఈ నెల 3న అతిగా మద్యం తాగాడు. కౌకూర్ పరిధిలోని పాడుబడిన ఇంటి వద్ద పడిపోయాడు. అదే కాలనీలో ఉంటున్న పెయింటర్లు మహారాష్ట్రకు చెందిన అజయ్ యువరాజ్, రాజు సైతం అతిగా మద్య తాగారు. సురేశ్ పడిపోయి ఉండటాన్ని గుర్తించారు. అతడి జేబులోని సెల్‌ఫోన్ అమ్మేసి మరింత మద్యం తాగాలని భావించారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ దొంగిలిస్తుండగా సురేశ్ వారిని గుర్తించాడు. తాము ఎక్కడ దొరికిపోతామో అని భావించి సురేశ్ గొంతును టవల్‌తో గట్టిగా నులిమి చంపేశారు. సెల్‌ఫోన్‌తో పాటు జేబులో ఉన్న రూ. 60 దొంగిలించారు. చనిపోయాడనుకున్న సురేశ్ కొద్దిగా కదిలినట్లు అనిపించడంతో పక్కనే ఉన్న గ్రనేట్ రాయిని ముఖంపై వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేవలం 6 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో సీతారామ్ తెలిపారు.
సెల్‌ఫోన్ విషయంలో వివాదం ఒకరిపై హత్యాయత్నం
సెల్‌ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. జీడిమెట్ల పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రామిరెడ్డినగర్‌కు చెందిన నీరుగొండ వెంకటే్‌షగౌడ్‌కు ముగ్గురు సంతానం. కుమార్తె, ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు
విజయ్ అలియాస్ విక్కీ(25) చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతున్నాడు. మద్యం తాగి, అందరితోనూ గొడవలు పెట్టుకుంటున్నాడు. తల్లిదండ్రులపై కూడా పలుమార్లు దాడులకు పాల్పడ్డాడు. గతంలో విజయ్‌పై అనేక కేసులు ఉన్నాయి. అతడికి స్థానిక యువకుడు లిల్లీ స్నేహితుడు. లిల్లీ కూడా అనేక కేసుల్లో ఉన్నాడు. ఇటీవలే బిహార్ వెళ్లొచ్చిన లిల్లీ.. విజయ్‌తో కలిసి మద్యం కొనుగోలు చేసి హెచ్‌ఎంటీ జంగల్ ప్రాంతానికి వెళ్లి తాగుతున్నారు. సెల్‌ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. అది తీవ్రమై బండరాయి తీసుకుని విజయ్ తలపై లిల్లీ బలంగా కొట్టాడు. రక్తపుమడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విజయ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లిల్లీ పోలీ్‌సస్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది
May 07 2023, 13:58