నేడు పాలమూరులో పర్యటించనున్న ఐటీ మంత్రి కేటీఆర్
మహబూబ్ నగర్ జిల్లా
పాలమూరు పారిశ్రామికంగా ఎదిగేందుకు సిద్దపడుతుంది. ఇన్నాళ్లూ ఉపాధికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన యువతకు ఇపుడు ఉన్నచోటేకే పరిశ్రమలు పరుగులుపెడుతూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమ అంటే కేవలం మాధాపూర్.. గచ్చిబౌలీ ప్రాంతాలకే పరిమితమం అనుకుంటున్న తరుణంలో పాలమూరులో ఐటీ ఇంకుబ్యేటర్ సెంటర్ రూపుదిద్దుకుంది. సాంకేతిక ఉపాధి సైతం అందుబాటులోకి వచ్చింది. దీనికి తోడు అమర్ రాజా గిగా క్యారిడార్‌కు కూడా భూమిపూజ జరగనుండటంతో.. పాలమూరు యువతకు డబుల్ బొనాంజాగా మారింది.
స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యంగా మహబూబ్‌నగర్ లో ఐటీ ఇంకుబ్యేషన్, ఎనర్జీ పార్కు ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇక్కడ నిర్మించిన ఐదంతస్తుల ఐటీ టవర్ ప్రారంభోత్సవంతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా భావిస్తోన్న అమరరాజా గిగా కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ నెల 6న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే.టీ.ఆర్, స్థానిక మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ పనులను ప్రారంభించనుండడంతో అధికారయంత్రాంగం ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
జీవనోపాధిలేక వలసలు పోతున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని యువతకు... స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2018లో దివిటిపల్లి వద్ద 370 ఎకరాల భూమిని ఐటీ, మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్కుకు కేటాయించారు. 2018 జులైలో ఈ ఐటీ, ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగెకరాల స్థలంలో 40 కోట్ల రూపాయలతో ఇక్కడ ఐదంతస్తుల ఐటీ టవర్‌ను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో నిర్మించారు.
ఇక్కడ సార్ట్‌అప్ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు ఐటీ సంస్థలను ఆహ్వానించగా.. ఈనెల ఆరు నుంచి కనీసం ఆరు కంపెనీలు ఇక్కడ తమ సంస్థల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించనున్నాయి. ఐతే ఈ ఐటీ టవర్ ప్రారంభం కానుండటంతో జిల్లాలోని వద్యార్థుల్లో సంతోషం వ్యక్తమౌతుంది.
ఈ టవర్లోని ఐదు అంతస్థుల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణపు స్థలం అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఇక్కడ నలభై నాలుగు ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా పది కాన్ఫరెన్స్ హాళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే ఐ.టీ కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామంటోన్న ప్రభుత్వం ఆదిశగా కార్యాచరణ అమలు చేస్తోంది. ఐటీ టవర్ లోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. నిరుద్యోగులకు రాబోయే సంస్థల్లో పనిచేసేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, అదేవిధంగా టెక్నికల్ స్కిల్స్‌లో పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఇదిలాఉండగా దిగ్గజసంస్థ అమరారాజా గ్రూప్ కూడా ఇక్కడే గిగాసెల్ కారిడార్‌ను ఏర్పాటుచేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేస్తున్న లిథియం గిసెల్..బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధిత అమరరాజా గిగా కారిడార్‌కు సైతం శనివారం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేయనున్నారు.
ఎలక్ట్రికల్ వాహనాల్లో వాడే బ్యాటరీలను పర్యావరణ హితంగా.. ఇక్కడ ఏర్పాటు చేసే కారిడార్‌లో ఉత్పత్తి చేస్తారని పేర్కొంటున్నారు. వచ్చే పదేళ్లలో ఈసంస్థ ఇక్కడ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీని విస్తరించనుందని, ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 7,500 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఒకవైపు ఐటీ ఇంకుబేటర్ కంపెనీలు.. మరోవైపు అమరరాజా గీగా కారిడార్ ఏర్పాట్లతో పాలమూరు ఉద్యోగ, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారుతుందనే ఆశ నిరుద్యోగుల్లో చిగురిస్తోంది.
May 06 2023, 12:42