ప్రియాంక చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్
హైదరాబాద్ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ నెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే ‘యువ సంఘర్షణ’ సభలో ప్రియాంక పాల్గొనబోతున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు. ప్రియాంక పర్యటనలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రియాంక రిలీజ్ చేయనున్నట్లు రేవంత్ తెలిపారు. ‘గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద యువనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారు. అదే స్పూర్తితో హైదరాబాద్ డిక్లరేషన్‌ను సరూర్ నగర్ సభలో విడుదల చేస్తాం. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్‌లో ప్రకటిస్తాం.
టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఉద్యోగ నియామకాలు ఎలా చేపడతామో సభలో వివరిస్తాం. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్‌ను అడగడం కాదు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊదరగొడితేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ యువ సంఘర్షణ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు పార్టీలకు అతీతంగా మద్దతుగా తరలి రావాలి. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలి. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలి’ అని రేవంత్ రెడ్డి కోరారు.
ఇలా చేస్తే గౌరవం తగ్గుతుంది..!
కర్ణాటకలో ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయ్. ముఖ్యంగా బజరంగ్‌దళ్ విషయంలో కాంగ్రెస్‌కు ఒకరిద్దరు నేతలు చేసిన ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎక్కడిక్కడ బీజేపీ ధర్నాలు చేపడుతోంది. అదికాస్త తెలంగాణకు కూడా పాకింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది.
దీంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ, నిరసన తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. ‘కర్ణాటకలో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ మా పార్టీ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడుతోంది. ఈ రకమైన పోకడలు తెలంగాణ రాజకీయ సంస్కృతి మంచిదా..?. బండి సంజయ్, కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఇలాంటి చర్యలతో మీ గౌరవం తగ్గుతుందే.. తప్ప పెరగదు’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
May 06 2023, 09:40