కేటీఆర్ పర్యటనలో బిఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కొంతమంది బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకప్పుడు పార్టీలో కీల కంగా పనిచేసిన తమకు కనీస గుర్తింపు దక్కడం లేదని ఆవేదనకు లోనవుతున్నారు.
ఇందులో ఉద్యమ కాలం నాటి డివిజన్ స్థాయి నేతలతో పాటు, మాజీ కార్పొరేటర్లు కూడా ఉండటం గమనార్హం. ఆ మాటకొస్తే నియోజకవర్గస్థాయి నేతలను కూడా విస్మరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కొంతమందికే నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
ఉద్యమ నేతల్లో నైరాశ్యం..!
ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్న తమకు ప్రస్తుతం పార్టీలో గుర్తింపు కరువైందని వాపోతున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను నిర్వహించేందుకు శుక్రవారం మధ్యాహ్నం నగరానికి మంత్రి కేటీఆర్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయి.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేతో విబేధాలున్న నేతలకు ఆహ్వానం అందలేదన్న చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా తంతు కార్యక్రమానికి, ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సిందిగా నేతలకు మాటమాత్రంగానైనా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వెళ్లలేదని సమాచారం.
కాజీపేటలో పార్టీ కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో కీలకంగా పనిచేసిన తమకు ఆహ్వానం లేదు.. బాధ్యతల్లేవన్న బాధను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇక శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగిన పూజాతంతులో ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే కొద్దిమంది నేతలే హాజరవడాన్ని గుర్తు చేస్తున్నారు.
May 05 2023, 18:34