కారు’కు బ్రేకులు❓️
•బీఆర్‌ఎస్ పార్టీలో కుమ్ములాటలు
•సవాళ్లు విసురుకుంటున్న నేతలు
•ఆత్మీయ సంబురాల్లో అసమ్మతి జాడలు
•సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా రహస్య సమావేశాలు
ఎన్నికలకు సమయాత్తమవుతున్న అధికార బీఆర్‌ఎస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయి పనిచేసుకుంటున్నారు. టిక్కెట్ రేస్‌లో ఉన్న కొందరు నేతలు సిట్టింగ్‌లపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో ఇటీవల పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలు అసలు ఈ సమావేశాలకే హాజరుకాలేదు. మరికొన్ని చోట్ల అసమ్మతి నేతలు హాజరైనప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అనేక చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు గిట్టని నేతలకు ఆహ్వానాలు కూడా పంపలేదు.
మరో వైపు ఎలక్షన్ హీట్ పెరుగుతుండడంతో అధికార పార్టీలో కుమ్ములాటలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల నేతలు సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి చెందిన వారే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ (ఇపుడు బీఆర్‌ఎ్‌స)లో చేరడంతో అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ పాగా వేసింది. అయితే ఇపుడు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లు, ఆశావహులు టిక్కెట్ కోసం సిట్టింగ్‌లతో పోటీపడుతున్నారు. స్థానికంగా పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్‌లకు టిక్కెట్ ఆశించే ఆశావహుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కూడా స్థానికంగా అసమ్మతి ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, మరికొందరు నేతలకు అసలు పొసగడం లేదు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు జడ్పీ చైర్మన్ సైతం హాజరుకాలేదు. ఇంతకు ముందు జరిగిన ఓ సమావేశంలో మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి మధ్య స్వల్ప వివాదం జరిగింది. సుధీర్‌రెడ్డి మైక్‌ను మంత్రి బలవంతంగా లాక్కోవడంతో వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి డుమ్మా కొట్టారు. ఆయన వర్గం కూడా ఎవరూ హాజరు కాలేదు. అలాగే మహేశ్వరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సబితారెడ్డికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. కొన్ని నెలల కిందట తీగల కృష్ణారెడ్డి మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శించారు. తరువాత అధిష్ఠానం ఆయన్ని పిలిచి మందలించడంతో కొంత మెత్తబడ్డారు. కానీ ఆయన వర్గం ఇప్పటికీ సబితవర్గంతో ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అలాగే తాండూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి, సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అసలు పొసగడం లేదు. ఇటీవల నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి సైతం మహేందర్‌రెడ్డి వర్గం హాజరు కాలేదు. ఈ సమావేశానికి మహేందర్‌రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న, బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, తాండూరు జడ్పీటీసీ మంజుల, యాలాల్ జడ్పీటీసీ సంధ్య, తాండూరు ఎంపీపీ అనితాగౌడ్, బషీరాబాద్ ఎంపీపీ కరుణ, డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్‌తోపాటు సీనియర్ నేత కరణం పురుషోత్తమరావు సైతం ఈ కార్యక్రమానికి రాలేదు. ఇక వికారాబాద్ నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు జతకట్టారు. మహేందర్‌రెడ్డి వర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, ధారూర్ సొసైటీ మాజీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, మర్పల్లి ఎంపీపీ లలిత డుమ్మా కొట్టారు. ఇక్కడ రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అలాగే పరిగిలో కూడా అధికార పార్టీలో అసమ్మతి పోరు నడుస్తోంది. పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి, దోమ ఎంపీపీ అనసూయ హాజరుకాలేదు. కొడంగల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్‌రెడ్డి వర్గానికి పడడం లేదు. ఇటీవల జరిగిన ఆత్మీయ సమావేశానికి కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి హాజరుకాలేదు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు రాజుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి పడడం లేదు. అలాగే మాజీ మంత్రి చిత్తరంజన్‌దా్‌స కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. షాద్‌నగర్‌లో కూడా అంజయ్య యాదవ్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి వర్గానికి పొసగడం లేదు. పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ప్రతా్‌పరెడ్డి వర్గం హాజరు కాలేదు.
May 04 2023, 08:11