బి ఆర్ ఎస్ అంటే భారత రైతు సమితి
నూతన సచివాలయంలోకి సామాన్యులను అనుమతించకపోవడానికి కారణాన్ని మంత్రి కేటీఆర్ సరికొత్తగా నిర్వచించారు. సచివాలయం.. సచివులు ఉండే ఆలయం మాత్రమేనని ఆయన అన్నారు. తద్వారా సెక్రటేరియట్ కేవలం మంత్రుల కోసమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో కొందరు ఈ విషయాన్ని ప్రస్తావించగా మంత్రి సమాధానం దాట వేశారు. జిల్లాలోని ముస్తాబాద్, గోపాలపల్లె, గుండపల్లి చెరువు తండా, వీర్నపల్లి గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యాన్ని కేటీఆర్ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారికి భరోసా కల్పించారు. లావణి పట్టా కలిగిన రైతులకు కూడా పంట నష్టం సాయం అందుతుందన్నారు.
కొందరు రైతులు ఇళ్ల గురించి ప్రస్తావించగా గృహలక్ష్మి పథకం కింద నిర్మించుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నమొన్నటి వరకు ఉచితాలు దేశానికి మంచిది కాదంటూ ప్రధాని మోదీ పదే పదే గొంతు చించుకున్నారని, కానీ.. కర్ణాటకలో మూడు సిలిండర్లు, పాలు ఫ్రీ అంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. కర్ణాటకు ఇచ్చినప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఫ్రీ సిలిండర్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అదానీ కొనే ఎయిర్‌పోర్టులకు జీఎస్టీ లేదని, కానీ.. పాలు, పెరుగు, సామాన్యులు వాడే మందులకు జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ఇలాంటి పిరమైన ప్రధానికి, బీజేపీకి కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు బుద్ధి చెప్తారన్నారు.
బీఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో ఏర్పాటు చేసుకున్న కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ అడుగు పెట్టిన మొదటిరోజే రాష్ట్రంలో పేదలు, రైతులు, కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్లకు రైతులు నష్టపోయిన సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి ఐదు జిల్లాల్లో పర్యటించారని, రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి అని, రైతుకు భరోసా ఇచ్చే పార్టీ అని కొత్త నిర్వచనం చెప్పారు. వడగండ్లు, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా హెక్టారుకు రూ.25 వేలు, ఎకరానికి రూ.10 వేల పరిహారాన్ని సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. అధికారులు, పంట నష్టం అంచనాలు వేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్
పంటనష్టం పరిశీలనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే యత్నం చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎకరానికి రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కాన్వాయ్‌కు అడ్డంగా వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకు లాగేశారు.
మహిళల రక్షణకు ‘అభయం’ యాప్
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృతంలో పోలీసులు ‘అభయం సేఫ్ ఆటో’ యాప్‌ను రూపొందించారు. మంగళవారం జిల్లా పోలీస్ క్రీడల ముగింపు సందర్భంగా ఈ యాప్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జిల్లాలోని ఆటోల్లో సేఫ్ ఆటో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా లేమని అనిపిస్తే తమ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డ్రైవర్ ఫొటో వివరాలతోపాటు వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ కమాండ్ ఏరియాకు వెళ్తుంది. ఈ యాప్‌ను రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. పోలీస్ క్రీడల్లో గెలుపొందిన వారికి పతకాలను అందజేశారు
May 03 2023, 15:37