కేసీఆర్‌లాంటి సీఎం కావాలంటున్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రలో కుల రాజకీయం చేస్తున్నరు. రెడ్డి, కాపు, కమ్మలు వేర్వేరుగా రాజకీయాలు చేస్తూ ప్రజలను పట్టించుకుంటలేరు. రేపు ఏపీలో ప్రజలను పట్టించుకునేది కూడా బీఆర్‌ఎస్ పార్టీనే. పోలవరం పూర్తి చేసేది.. విశాఖ ఉక్కును కాపాడేది కూడా కేసీఆరే. ఇంక ఎవరికీ ఆ దమ్ము లేదు. 2024లో ఆంధ్రలో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుంది’’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లోని ప్రజలు కేసీఆర్‌లాంటి సీఎం కావాలని, తెలంగాణలో ఉన్నటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో మే డే వేడుకలు నిర్వహించారు. పలు సంస్థలకు బెస్ట్ మెనేజ్‌మెంట్ అవార్డులను; పలువురు వ్యక్తులకు శ్రమ శక్తి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. ‘‘విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు ఒకేసారి ఏర్పడ్డాయి.
తొమ్మిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే.. ఆంధ్ర అవుట్ అయ్యింది. జాతీయ హోదా కల్పించి కేంద్రం నిధులిస్తున్నా.. పోలవరం పూర్తి కాలేదు. కానీ, రాష్ట్ర నిధులతోనే కేసీఆర్ సర్కారు ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అనతికాలంలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఏపీలో పోలవరం పూర్తి చేసే దమ్ము కేసీఆర్‌కే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన 75 వేల మంది విద్యార్థులు తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాశారని, ఉన్నత విద్యలో ఇక్కడున్న మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలే ఇందుకు కారణమని చెప్పారు. కేసీఆర్ సినిమా యాక్టర్ కాదని, అయినా, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సభలకు లక్షల మంది వస్తున్నారని, బ్రహ్మరథం పడుతున్నారని, అక్కడ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో తెలంగాణ గాలి నడుస్తోందని, కేసీఆర్‌కు మనమంతా మద్దతుగా నిలవాలని కార్మికులను కోరారు. ఇక్కడ అభివృద్ధి జరుగుతుండడంతో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 25 లక్షలమంది ఉపాధి పొందుతున్నారన్నారు. అమెరికా పాతబడిందని, వచ్చే మూడున్నరేళ్లలో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందని చెప్పుకొచ్చారు.
ఉసురు తాకి పోతరు
రాష్ర్టానికి బీజేపీ నిధులు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ దేశాన్ని సర్వనాశనం చేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆ రెండు పార్టీలకు చెందిన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడుతున్న రామచంద్రుల (కేసీఆర్, కేటీఆర్)ను దుర్భాషలాడుతున్నారు. పని చేసేటోళ్లను తిడితే ఆ ఉసురు తాకి గాలికి కొట్టుకుపోతారు’’ అంటూ శాపనార్థాలు పెట్టారు. మోదీ పిరమైన ప్రధాని అని, ఒక్కనికే ఆయన దోచిపెట్టడం దేవుడు చూస్తున్నాడని, పాపం పండుతుందని వ్యాఖ్యానించారు. ఇంకెన్నాళ్లు.. మరో ఏడాది ఉంటాడని, వచ్చే ఎన్నికల్లో ఆయనను ప్రజలు తరిమేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు, వారి పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని, కరోనాతో ఆలస్యం జరిగిందని చెప్పారు. గతంలో తెలంగాణ ప్రజలు బతకడానికి దూర ప్రాంతాలకు పోయేవారని, ఇప్పుడు దేశానికి బతుకు దెరువుగా రాష్ట్రం మారిందని మరో మంత్రి శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌ను చూసి న్యూయార్కా..? హైదరాబాదా...? అని ఆశ్చర్యపోయానని సినీనటుడు రజనీకాంత్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
May 02 2023, 20:24