నూతన సచివాలయంలో సుదర్శన యాగంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతున్నది. అన్నిరకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. ఉదయం 5.50 గంటలకే రుత్విక్కులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి చేరుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి దంపతులు యాగశాలకు హాజరై చండీయాగం, సుదర్శన యాగాల్లో పాల్గొన్నారు.

అనంతరం అక్కడే జరిగే వాస్తు పూజలో కూడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొననున్నారు. హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్లొంటున్నారు.

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు..

ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి..

ఈ రోజు మధ్యాహ్నం నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వర్షాలు మొదలవనున్నాయి..

రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు అలాగే కొన్నిచోట్ల భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు..

ఇక ఈ రోజు రాయలసీమలో వర్షాలు ఎక్కువగా ఉండనున్నాయి..

ఇవాళ రాత్రి, రేపు తెల్లవారు జామున కోస్తాంధ్రలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి..

మే 1, 2 తేదీలలో ఎక్కువ చోట్ల భారీ ఉరుములు మెరుపులు పిడుగులు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. 

RTC Bus | భద్రాచలంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ.. గాయపడిన 43 మంది..

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.

జిల్లాలోని చుంచుపల్లి (Chunchupally) మండలం రుద్రాపూర్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ (Lorry) అదుపుతప్పి ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీకొట్టింది.

దీంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 43 మంది గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం దవాఖానకు తరలించారు.

తెలంగాణ నూతన సచివాలయంలో ప్రారంభమైన పూజలు..

తెలంగాణకే తలమానికంగా మారిన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేటి మధ్యాహ్నం 1.20-1.32 మధ్య ప్రారంభించనున్నారు..

ఆ తర్వాత 1.56-2.04 గంటల మధ్య మంత్రులు, అధికారులు ఒకేసారి తమ సీట్లలో ఆసీనులవుతారు. 2.15 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. నూతన సచివాలయంలో ఈ తెల్లవారుజామున 5.50 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

6.15 గంటలకు ప్రారంభమైన చండీయాగం, సుదర్శన యాగాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం జరగనున్న వాస్తు పూజలోనూ వారు పాల్గొంటారు.

హోమం, యాగ నిర్వహణ, సచివాలయంలో వివిధ చాంబర్లలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో 110 మంది వేదపండితులు, రుత్విక్కులు పాల్గొంటారు. శృంగేరీ పీఠానికి చెందిన గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ, వాస్తు పండితుడు సుద్దాల సుధాకర తేజ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు..

ఔటర్ రింగ్ రోడ్డు అమ్మేశారు

భాగ్యనగరానికి మణిహరంలా ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి శనివారం రోజు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సుమారు రూ.30వేల కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్‌ రోడ్డును రూ.7, 380 కోట్లకు కారుచౌకగా ముంబయి కంపెనీకి కట్ట్టబెట్టారని రేవంత్‌ మండిపడ్డారు. దేశంలోనే ఇది అత్యంత పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఇందులో రూ.1,000 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు.

ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోదని.. అధికారంలోకి వచ్చాక దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తామన్నారు. యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సోమేష్‌కుమార్, అరవింద్‌కుమార్, జయేష్‌ రంజన్ నిర్ణయాలన్నింటిపై కాంగ్రెస్‌ పార్టీ సమీక్షిస్తుందన్నారు. వీటిపై భాజపా ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులను కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్‌, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడంలేదని రేవంత్‌ నిలదీశారు.

రేపు హైదరాబాదులో వినోద ప్రదేశాలు మూసివేత

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది.

కాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.

నూతన సచివాలయంలో అడుగుపెట్టం : బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం చేపట్టారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని తెలిపారు.

సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని.. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని తేల్చి చెప్పారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయ భవనం ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ఉదయం 4నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

వీవీ విగ్రహం, నెక్లెస్‌ రోటరీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, తెలుగు తల్లి జంక్షన్‌ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేస్తారు. ఆహ్వానితుల కోసం పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని, సచివాలయానికి వచ్చే ఆహ్వానితులు తమ పాస్‌లను కార్‌ డోర్లకు అతికించుకోవాలని సూచించారు.

తెలంగాణలో మళ్లీ TRS పార్టీ.. ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం

రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ ఉనికిలోకి రాబోతున్నది. తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వెళ్ళింది. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

పార్టీ కార్యాలయంగా ఓల్డ్ అల్వాల్ (ఇం. నెం. 1-4-177/148, 149/201) చిరునామాతో అప్లై చేశారు. పార్టీ ఉపాధ్యక్షులుగా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల మురళీకంఠ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిపేట జిల్లా వెల్గటూర్ గ్రామానికి చెందిన నల్లా శ్రీకాంత్, కోశాధికారిగా పొన్నాల గ్రామానికి చెందిన సదుపల్లి రాజు వ్యవహరిస్తున్నట్లు దరఖాస్తులో అధ్యక్షుడు తుపాకుల బాలరంగం పేర్కొన్నారు.

ఈ పేరుతో పార్టీని వీరే స్వచ్ఛందంగా పెడుతున్నారా లేక వీరితో ఎవరైనా రాజకీయ నాయకుడు పెట్టిస్తున్నారా అనేది స్పష్టం కావాల్సి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌)గా మార్చిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతో మరో రాజకీయ పార్టీ ఏదీ లేదు.

ఎలాగూ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కొత్తగా ఎవ్వరూ పార్టీని పెట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళడం గమనార్హం. టీఆర్ఎస్ పేరు తెలంగాణలో ప్రజల్లో చిరపరిచితం కావడంతో కొత్త పార్టీ అబ్రివేషన్ టీఆర్ఎస్ వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.

కొత్త పార్టీ పేరుపై ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలంటూ 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రకటనను తెలంగాణ రాజ్య సమితి నిర్వాహకులు ఫోర్త్ వాయిస్ అనే పత్రికలో ఆంగ్లంలో మార్చి 29న ఇచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొన్నది.

ఇదే ప్రకటనను హిందీ భాషలో సులభ్ అనే పత్రికలో మార్చి 28న ఇచ్చినట్లు పేర్కొన్నది. దీనిపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ ఈ నెల 26న విడుదల చేసిన నోటీసు ప్రకారం మే నెల 27 వరకు అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు కమిషన్‌కు వెళ్తాయన్నది ఆసక్తికరం.

వాస్తవానికి ‘తెలంగాణ రాజ్య సమితి పార్టీ’ పేరుతో గతంలోనే రాజకీయ పార్టీ రిజిస్టర్ అయింది. కానీ ప్రతీ సంవత్సరం సమర్పించాల్సిన వార్షిక ఆడిట్ రిపోర్టును, ఆదాయపు పన్ను శాఖకు రిటన్‌లను సమర్పించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీచేసింది. నిర్దిష్ట గడువు ప్రకారం వాటిని సమర్పించకపోయినట్లయితే ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కూడా రాతపూర్వకంగా ఆ పార్టీకి సమాచారం ఇచ్చింది.

కానీ వరుస నోటీసులకు ఆ పార్టీ నుంచి స్పందన రాకపోవడం, పోస్టు ద్వారా పంపిన లేఖలు ‘డోర్ లాక్’ పేరుతో తిరిగి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు రావడంతో దాని రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ సెక్రటరీ అశోక్ కుమార్ 2016 జూలై 14న ఉత్తర్వులు జారీచేశారు. అప్పట్లో ఈ పార్టీ రిజిస్ట్రేషన్ కార్యాలయం సికింద్రాబాద్ లాలాగూడలోని తుకారాం గేట్ (డోర్ నెం. 10-5-342/34) చిరునామాతో ఉండేది.

టీఆర్ఎస్ అబ్రివేషన్ వచ్చేలా తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రైతు సమితి పేర్లతో ఖమ్మం జిల్లా నుంచి సీనియర్ పొలిటికల్ లీడర్ ప్రయత్నిస్తున్నట్లు గత నెలలో వార్తలు వచ్చాయి. తెలంగాణ రైతు సమితి పేరుతో ఇప్పటికింకా దరఖాస్తు విషయమై కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇవ్వకపోయినా తెలంగాణ రాజ్య సమితి పేరుతో మాత్రం కొత్త పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు వచ్చినట్లు వెల్లడించింది. వచ్చే నెల 27 నాటికి కమిషన్‌కు అందే అభ్యంతరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌పై నిర్ణయం జరగనున్నది.

తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీని రిజిస్ట్రేషనన్ చేయవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో సిద్దిపేట చిరునామాతో అప్లికేషన్ వెళ్ళడం గమనార్హం. నిజంగా పార్టీని పెట్టాలని పొంగులేటి భావించినట్లయితే సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం నుంచి ఈ పార్టీని టేక్ ఓవర్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

ముచ్చటగా మూడోసారి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కల్యాణే స్వయంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికెళ్లి మరీ కలిశారు. పవన్‌ను సాదరంగా స్వాగతించిన చంద్రబాబు.. సుమారు అరగంటపాటు ఇద్దరూ పలు కీలక విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా ఏపీలో తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఏ ఒక్కరికీ సమాచారం లేదేం..!?

చంద్రబాబు-పవన్ భేటీపై అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ ఏ ఒక్కరికీ సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండుసార్లు జరిగిన ఈ ఇద్దరి భేటీ అధికారికంగానే జరిగింది. అయితే ముచ్చటగా మూడోసారి జరిగిన ఈ భేటీపై ఇరుపార్టీల కీలక నేతలకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలేం జరుగుతోందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యే పవన్-బాబు భేటీ ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా సమావేశం కావడం, అది కూడా పవనే స్వయంగా బాబు ఇంటికెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.

పొత్తులపై చర్చించారా..?

ఈ అరగంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-జనసేన కలిసే పొత్తుతోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని అధికార పార్టీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవానికి బీజేపీతో (BJP) మిత్రబంధం కొనసాగిస్తున్న పవన్.. ఈ మధ్య ఎందుకో ఈ రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లేవ్. పైగా బీజేపీ నేతలు బహిరంగంగానే పవన్‌తో మాకేంటి..? మేం ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీపై ఓ జాతీయ మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ ఆకాశానికెత్తేశారు. మోదీ అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు కూడా బాబు చెప్పారు.

ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. ప్రధాని తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని.. ఆయన విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమ్ అని కూడా బాబు చెప్పేశారు. అటు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. ఇటు మోదీ గురించి చంద్రబాబు ఇలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మొత్తానికి చూస్తే.. చంద్రబాబు-పవన్ మధ్య అరగంటపాటు జరిగిన భేటీలో ఏమేం చర్చించారో పూర్తిగా తెలియట్లేదు కానీ.. మీడియా, సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా కథనాలు మాత్రం వచ్చేస్తున్నాయ్. అసలేం చర్చించారో.. ఈ భేటీకి వెనుక ఏం జరిగిందో తెలియాలంటే టీడీపీ, జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే

ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ

హైదరాబాద్: టీడీపీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో తాను చేరటం లేదని... బీజేపీలో కొనసాగాలనేది తన అభిమతమన్నారు. బీజేపీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేతపై ఆఖరి క్షణం వరకు ఎదురుచుస్తానని చెప్పారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే రాజకీయాలకు దూరంగా జరిగి.. హిందూ ధర్మం కోసం పనిచేస్తానన్నారు.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై రాజాసింగ్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి కారణం చంద్రబాబు అని.. కేసీఆర్‌తో ఏమీ కాలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మళ్ళీ గెలిచే అవకాశాలున్నాయని తెలిపారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని... రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారన్నారు. ‘‘గౌరవం ఉండటం వేరు.. రాజకీయాలు వేరు. ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. నా మెంటాలిటీకి బీజేపీ మాత్రమే సూట్ అవుతుంది’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.

కాగా.. రాజాసింగ్‌ 2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం బీజేపీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2018లోనూ అదే స్థానం నుంచి రాజాసింగ్ గెలుపొందారు. అయితే ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజాసింగ్‌ జైలుకు వెళ్లగా.. బీజేపీ అధిష్ఠానం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఇప్పటికీ సస్పెన్షన్‌ ఎత్తివేతపై పార్టీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా తాను టీడీపీలో చేరడం లేదంటూ రాజాసింగ్ చెప్పడంతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పడినట్లైంది.