ముచ్చటగా మూడోసారి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం పవన్ కల్యాణే స్వయంగా హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికెళ్లి మరీ కలిశారు. పవన్‌ను సాదరంగా స్వాగతించిన చంద్రబాబు.. సుమారు అరగంటపాటు ఇద్దరూ పలు కీలక విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా ఏపీలో తాజా పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఏ ఒక్కరికీ సమాచారం లేదేం..!?
చంద్రబాబు-పవన్ భేటీపై అటు టీడీపీలో కానీ.. ఇటు జనసేనలో కానీ ఏ ఒక్కరికీ సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటి వరకూ రెండుసార్లు జరిగిన ఈ ఇద్దరి భేటీ అధికారికంగానే జరిగింది. అయితే ముచ్చటగా మూడోసారి జరిగిన ఈ భేటీపై ఇరుపార్టీల కీలక నేతలకూ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలేం జరుగుతోందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రెండ్రోజుల పాటు పర్యటించిన పవన్ కల్యాణ్ బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఆ మధ్యే పవన్-బాబు భేటీ ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ఇప్పుడు సడన్‌గా సమావేశం కావడం, అది కూడా పవనే స్వయంగా బాబు ఇంటికెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది.
పొత్తులపై చర్చించారా..?
ఈ అరగంటపాటు జరిగిన భేటీలో టీడీపీ-జనసేన పొత్తులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-జనసేన కలిసే పొత్తుతోనే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాయని అధికార పార్టీ ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పిస్తోంది. వాస్తవానికి బీజేపీతో (BJP) మిత్రబంధం కొనసాగిస్తున్న పవన్.. ఈ మధ్య ఎందుకో ఈ రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లేవ్. పైగా బీజేపీ నేతలు బహిరంగంగానే పవన్‌తో మాకేంటి..? మేం ఒంటరిగానే పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పుకుంటున్నారు. మరోవైపు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీపై ఓ జాతీయ మీడియాలో చంద్రబాబు మాట్లాడుతూ ఆకాశానికెత్తేశారు. మోదీ అభివృద్ధి విధానాలతో తాను ఏకీభవిస్తున్నట్లు కూడా బాబు చెప్పారు.
ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా దేశానికి గుర్తింపు తెచ్చారన్నారు. ప్రధాని తెస్తున్న మార్పులు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని.. ఆయన విధానాలను మెరుగుపెడితే 2050 నాటికి భారత్‌దే అగ్రస్థానం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. దేశాభివృద్ధి కోసం ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎన్డీఏలో భాగస్వామి కావడమనేది మేటరాఫ్ టైమ్ అని కూడా బాబు చెప్పేశారు. అటు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత.. ఇటు మోదీ గురించి చంద్రబాబు ఇలా మాట్లాడిన రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మొత్తానికి చూస్తే.. చంద్రబాబు-పవన్ మధ్య అరగంటపాటు జరిగిన భేటీలో ఏమేం చర్చించారో పూర్తిగా తెలియట్లేదు కానీ.. మీడియా, సోషల్ మీడియాలో చిత్రవిచిత్రాలుగా కథనాలు మాత్రం వచ్చేస్తున్నాయ్. అసలేం చర్చించారో.. ఈ భేటీకి వెనుక ఏం జరిగిందో తెలియాలంటే టీడీపీ, జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే
Apr 29 2023, 20:12