మౌనిక మృతిపై హైకోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ
హైదరాబాద్: సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్లో పడి చిన్నారి మౌనిక మృతి చెందింది. ఈ ఘటనపై హైకోర్టుకు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని ఆయన ఫిర్యాదు చేశారు. గత నాలుగు సంవత్సరాల నుండి మ్యాన్‌హోల్ వల్ల అనేకమంది చనిపోయారని లేఖలో పేర్కొన్నారు. మ్యాన్‌హోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్నారులు చనిపోతున్నా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. చిన్నారి మృతి కారణమైన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టీస్ కు చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు.
సికింద్రాబాద్ కళాసిగూడలో మ్యాన్‌హోల్ మూత తెరిచి ఉండడంతో డ్రైనేజీలో పడి మౌనిక మృతి చెందింది. ఈరోజు ఉదయం చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది చిన్నారి కోసం గాలించగా... పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని గుర్తించారు. మ్యాన్‌హోల్‌లో పడి పాప మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతిచెందిన చిన్నారి స్థానిక స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. చిన్నారి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
జీహెచ్ఎంసీ మేయర్ హామీ
చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అందరిముందు మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మృతి చెందిన మౌనిక కుటుంబాన్ని పరామర్శించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు.
అధికారులపై చర్యలు
సికింద్రాబాద్ కళాసిగూడ చిన్నారి మృతి ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అధికారులపై వేటు వేసింది. బేగంపేట్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుమలయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణలను సస్పెండ్ చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇందిరాభాయ్‌కు బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పది రోజుల్లో ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.
Apr 29 2023, 16:37