రైతుబంధు ఇంకెప్పుడో..❓️
యాసంగి సీజన్ ముగిసినా అందని పెట్టుబడి సాయం
ఐదెకరాల లోపు రైతులకే తొలి ప్రాధాన్యం
నెల రోజుల్లో వర్షాకాలం పనులు ప్రారంభం
ప్రభుత్వ సాయంపై రైతుల్లో ఆందోళన
సంగారెడ్డి: యాసంగి సీజన్ ముగుస్తున్నా సంగారెడ్డి జిల్లాలోని కొందరు రైతులకు రైతుబంధు సాయం అందనే లేదు. ప్రతీ సీజన్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటికీ కొందరు రైతులకు రైతుబంధు సాయం అందలేదు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 3,82,000 మంది రైతులు వివిధ పంటలను సాగు చేశారు వీరిలో 3,28,010 మంది రైతులకు ప్రభుత్వం గతేడాది నవంబర్ నుంచి విడతలవారీగా రూ.350.03 కోట్ల రైతుబంధు సాయం అందజేసింది.
ఈ డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమ చేసింది. అయితే ఇంకా 60వేల మంది రైతులకు రైతుబంధు డబ్బులు జమకాలేదు. యాసంగి పంట సీజన్ మరో పక్షంలో ముగుస్తున్నందున తమకు రైతుబంధు రాదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు చెల్లిస్తున్నందున ప్రభుత్వం ఇతరత్రా రైతులకు అందే సాయం నిలిపివేసింది. దీంతో పెట్టుబడి సాయం అందని రైతులు విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది.
సన్నకారు రైతులకు ప్రాధాన్యం
రైతుబంధు పంపిణీలో ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తున్నది. ఎకరా నుంచి ఐదెకరాల లోపు ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యంగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఐదెకరాల లోపు రైతులందరికీ డబ్బులు జమయ్యాయి. ఇటీవల కొందరు ఐదు ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు కూడా రైతుబంధు అందింది. పది ఎకరాలు.. అంతకంటే ఎక్కువ ఉన్న రైతుల్లో చాలామందికి రైతుబంధు రాలేదు.
సాంకేతిక కారణాలతోనే
రైతుబంధు సాయం అందలేదకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమై ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. బ్యాంకుఖాతాల ఐఎ్‌ఫఎ్‌సఐ కోడ్ లేదా వివరాలు సరిగ్గా ఉండకపోతేనే రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కాకపోవచ్చని పేర్కొన్నారు.
రైతుబంధు వెంటనే జమ చేయాలి
రాఘవేందర్‌రెడ్డి, రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు
ఐదు, పదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు రైతుబంధు రాలేదని మా దృష్టికి వచ్చింది. యాసంగి సీజన్ ముగుస్తన్నందున మిగిలిన అందరు రైతులకు వెంటనే రైతుబంధు సాయం అందజేయాలి.
ఖజానాలో డబ్బులు లేకనే...
ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతోనే కొందరు రైతులకు రైతుబంధు రాలేదు. రైతు సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం విడుదల చేయాలి.
Apr 29 2023, 16:35