శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్

తిరుమల : తిరుమల శ్రీవారిని శనివారం ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు ఇస్తి కఫల్ స్వాగతం పలికారు..

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

అనంతరం ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.

అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్‌, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు..

చైనా షాకింగ్‌ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..

ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది షాంఘై. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి..

యావత్‌ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు లేదా ఒంటరి మహిళలు ఐవీఎఫ్‌ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది..

వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్‌ లేదా పబ్లిక్‌ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్‌ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్‌ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం..

దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్‌ చికిత్సకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్‌ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు.

Modi: కాంగ్రెస్ నన్ను 91 సార్లు నిందించింది: ఖర్గే వ్యాఖ్యలకు మోదీ బదులు..

బెంగళూరు: 'నన్ను నిందించిన ప్రతిసారి, కాంగ్రెస్ పార్టీనే పతనమవుతోంది' అని ప్రతిపక్షంపై ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) భగ్గుమన్నారు..

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈ మాట అన్నారు. ఎన్నికల(Karnataka Elections 2023 ) ప్రచారంలో భాగంగా ప్రధాని ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

'కాంగ్రెస్ మళ్లీ నన్ను నిందించడం ప్రారంభించింది. నన్ను నిందించిన ప్రతిసారి.. అది పతనమవుతోంది. కాంగ్రెస్ ఇప్పటికీ 91సార్లు నన్ను నిందించింది. దుర్భాషలాడే పని కాంగ్రెస్‌ను చేసుకోనివ్వండి. నేను మాత్రం కర్ణాటక(Karnataka) ప్రజల కోసం పనిచేస్తాను. వారు లింగాయత్ వర్గాన్ని నిందించారు.

అంబేడ్కర్, వీర్‌ సావర్కర్‌ను అవమానించారు. వారి నిందలకు ప్రజలు ఓట్లతో బదులిస్తారు. భాజపాపై ఎంత బురదచల్లితే.. కమలం అంతగా వికసిస్తుంది' అని కార్యకర్తలనుద్దేశించి మోదీ(Modi) అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కాదు.. ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌వన్‌గా చేయడానికని పేర్కొన్నారు. అలాగే డబుల్‌ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే.. రాష్ట్రం డబుల్‌ స్పీడ్‌తో దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు..

మీ పిల్లలకు కళ్లకలతలు వస్తున్నాయా..? జాగ్రత్త కొత్త వేరియంట్‌ లక్షణం..!

New variant: కరోనా కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. వైరస్‌ పేర్లు మార్చుకోని రూపాంతరం చెందుతుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి..

తాజాగా వచ్చిన వేరియంట్ కొత్త లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్ XBB.1.18 వేగంగా విస్తరిస్తోంది. దీన్నే ఆర్క్టురస్ అని కూడా పిలుస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ కేసులు ఘోరంగా పెరుగుతున్నాయి..

సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ఆర్క్టురస్ అనేది అత్యంత వేగంగా వ్యాపిస్తున్న అంటువ్యాధి. ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్ ఇది.

ప్రస్తుతం యూఎస్‌లో అత్యంత ప్రబలంగా ఉన్న వేరియంట్ ఇదే. మార్చి నెలలో ఇది అమెరికాలో 1.1 శాతం కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్‌ మూడో వారం నాటికి ఇది 19. 8 శాతానికి చేరుకుంది..

Viveka Murder : వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి రిమాండ్ పొడిగింపు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసి విచారిస్తోంది..

మరికొందరిని అరెస్టు చేయకుండా విచారిస్తోంది. ఈ క్రమంలో తాజాగా సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఆ ఉత్తర్వుల్లో భాస్కర్​రెడ్డి రిమాండ్‌ను మే 10వ తేదీ వరకు పొడిగించింది..

టీచర్లకు వేసవి సెలవుల్లేవ్! పనులు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసిన విద్యాశాఖ!

వేసవి సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు

ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళనచెందుతున్నారు.

వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ ఉత్తర్వులు.

ఏపీలో వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ టీచర్లకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడం, ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’, జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరా, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్‌ షీట్‌ రూపకల్పన, ‘నాడు-నేడు’ పనులు, పిల్లలు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడడం, విద్యార్థుల ప్రవేశాల నిర్వహణలాంటి పనులను అప్పగించింది. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులకు కాదంటూ కొందరు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 1నుంచి పాఠశాలలకు ఇచ్చే సెలవుల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులపై ఉన్నతాధికారులు ఆదేశాలనిచ్చారు.

ఉపాధ్యాయులు బడికి రావాలా? వద్దా? అనే దానిపై స్పష్టత ఇవ్వకుండానే అనేక పనులు అప్పగించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. ‘నాడు-నేడు’ పనులు, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, ఇతరత్రా కార్యకలాపాల కోసం ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు బడులకు రావాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ సమయంలో మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. 3,4,5 తరగతులకు వర్క్‌షీట్లను ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ముద్రించిన వాటిని మాత్రం సమకూర్చలేదు. వాటిని జిరాక్స్‌ తీసేందుకు ఉపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు నిర్వహించాలి.

గ్రంథాలయంలోని పుస్తకాలను ఒక్కొక్కరికి 5 నుంచి 10 ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాలి. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఈ పనులను రికార్డు చేయాలి. అధికారులు ఎప్పుడైనా పరిశీలిస్తే చూపించాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవేశాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 5వ తరగతి పూర్తయినవారు ప్రభుత్వ బడుల్లో ఆరో తరగతిలో ప్రవేశించేలా చూడాలి. కింది తరగతుల్లోనూ విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు నైతిక విలువలు నేర్పించాలి. పిల్లవాడి బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకోవాలి. వారే తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు సైతం వేసవి సెలవుల్లో తామేం చేశామో నోట్‌బుక్‌లో రాసి తరగతి ఉపాధ్యాయుడికి ఇవ్వాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలి. జగనన్న విద్యాకానుక కిట్లను వారు తీసుకెళ్లాలి.

వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెలవుల్లో ‘మేము చదవడాన్ని ఇష్టపడతాం’ అనే కార్యక్రమాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 19న ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1 నుంచి జూన్‌ 10 వరకు అమలు చేయాలని సూచించింది. ఉపాధ్యాయులు, అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆదేశించింది. పాఠశాలలోని విద్యార్థులను బృందాలుగా విభజించి ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని, వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, రోజువారీగా కథలను పోస్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పేర్కొంది.

హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన.. వడగండ్ల హెచ్చరికలు జారీ

హైదరాబాద్‌: నగరాన్ని Hyderabad Rains మరోసారి వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది..

రోడ్లు, లోతట్టు పప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన హెచ్చరికలూ జారీ చేసింది వాతావరణ శాఖ.

తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాలు వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకోగా.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది. మరో మూడు గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్‌ రిపోర్ట్‌ చెబుతోంది..

ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం

భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. మే నెల రెండో తేదీన ఢిల్లీ పర్యటనకు వెళ్తు న్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... నాలుగో తేదీన ఢిల్లీ వసంత విహార్‌లో నిర్మించిన పార్టీ జాతీయ కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.

జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టిపెట్టిన కేసీఆర్‌... ఢిల్లీలో కేంద్ర కార్యాలయ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. తాజాగా భవన నిర్మాణం పూర్తికావటంతో ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.

ఇది ఎన్నికల ఏడాది కావటంతో కేసీఆర్‌ మరింత స్పీడు పెంచారు. ఒకటి తర్వాత ఒకటి కీలక కార్యక్రమాలను పూర్తిచేస్తున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్‌ సాగరతీరంలో నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేఢ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని అంబేడ్కర్‌ జయంతి రోజున ప్రారంభించిన విషయం విదితమే.

30న నూతన సచివాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మే రెండో తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్‌... నాలుగో తేదీన పార్టీ కార్యాలయం ప్రారంభించిన తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఒకవేళ ఆయన ప్రయాణం వాయిదా పడితే నాలుగైదు రోజులు ఆయన ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి

రైతుబంధు ఇంకెప్పుడో..❓️

యాసంగి సీజన్‌ ముగిసినా అందని పెట్టుబడి సాయం

ఐదెకరాల లోపు రైతులకే తొలి ప్రాధాన్యం

నెల రోజుల్లో వర్షాకాలం పనులు ప్రారంభం

ప్రభుత్వ సాయంపై రైతుల్లో ఆందోళన

సంగారెడ్డి: యాసంగి సీజన్‌ ముగుస్తున్నా సంగారెడ్డి జిల్లాలోని కొందరు రైతులకు రైతుబంధు సాయం అందనే లేదు. ప్రతీ సీజన్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి ఇప్పటికీ కొందరు రైతులకు రైతుబంధు సాయం అందలేదు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో 3,82,000 మంది రైతులు వివిధ పంటలను సాగు చేశారు వీరిలో 3,28,010 మంది రైతులకు ప్రభుత్వం గతేడాది నవంబర్‌ నుంచి విడతలవారీగా రూ.350.03 కోట్ల రైతుబంధు సాయం అందజేసింది.

ఈ డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమ చేసింది. అయితే ఇంకా 60వేల మంది రైతులకు రైతుబంధు డబ్బులు జమకాలేదు. యాసంగి పంట సీజన్‌ మరో పక్షంలో ముగుస్తున్నందున తమకు రైతుబంధు రాదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు చెల్లిస్తున్నందున ప్రభుత్వం ఇతరత్రా రైతులకు అందే సాయం నిలిపివేసింది. దీంతో పెట్టుబడి సాయం అందని రైతులు విత్తనాలు, ఎరువులు, సాగు ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది.

సన్నకారు రైతులకు ప్రాధాన్యం

రైతుబంధు పంపిణీలో ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమిస్తున్నది. ఎకరా నుంచి ఐదెకరాల లోపు ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యంగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఐదెకరాల లోపు రైతులందరికీ డబ్బులు జమయ్యాయి. ఇటీవల కొందరు ఐదు ఎకరాల పైన భూమి ఉన్న రైతులకు కూడా రైతుబంధు అందింది. పది ఎకరాలు.. అంతకంటే ఎక్కువ ఉన్న రైతుల్లో చాలామందికి రైతుబంధు రాలేదు.

సాంకేతిక కారణాలతోనే

రైతుబంధు సాయం అందలేదకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమై ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. బ్యాంకుఖాతాల ఐఎ్‌ఫఎ్‌సఐ కోడ్‌ లేదా వివరాలు సరిగ్గా ఉండకపోతేనే రైతుబంధు సాయం ఖాతాల్లో జమ కాకపోవచ్చని పేర్కొన్నారు.

రైతుబంధు వెంటనే జమ చేయాలి

రాఘవేందర్‌రెడ్డి, రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు

ఐదు, పదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు రైతుబంధు రాలేదని మా దృష్టికి వచ్చింది. యాసంగి సీజన్‌ ముగుస్తన్నందున మిగిలిన అందరు రైతులకు వెంటనే రైతుబంధు సాయం అందజేయాలి.

ఖజానాలో డబ్బులు లేకనే...

ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడంతోనే కొందరు రైతులకు రైతుబంధు రాలేదు. రైతు సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం విడుదల చేయాలి.

రైతును కరుణించని వడగళ్ల వానలు

తెలంగాణలో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాళ్ల వానలు పడుతున్నాయి. వడగాళ్ల వానతో పంట నష్టపోయిన రైతులు ఆవేదన చెందుతుండగా.. పలు జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. ఈ మేరకు గురువారం రాత్రి హైదరాబాద్ వాతావరణశాఖ వెదర్ బులిటెన్ విడుదల చేసింది.

శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడతాయని స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాలో కూడా పలుచోట్ల వర్షాలు పడతాయంది. ఇక 29వ తేదీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని పేర్కొంది.

30వ తేదీ న ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెదర్ బులిటెన్‌లో పేర్కొంది.

మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఇక వచ్చే నెల 1వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.