నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:56

Delhi: లాయర్‌ దుస్తుల్లో వచ్చి.. కోర్టులో మహిళపై కాల్పులు..

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi)లో కాల్పులు కలకలం సృష్టించాయి. దక్షిణ దిల్లీలోని సాకేత్‌ కోర్టు (Saket court) ప్రాంగణంలో ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు..

లాయర్‌ దుస్తుల్లో వచ్చిన దుండగుడు.. మహిళపై నాలుగు రౌండ్లు కాల్పులు (Firing) జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. కోర్టు ప్రాంగణంలోని పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

సాకేత్‌ కోర్టులోని లాయర్‌ ఛాంబర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు విచారణ నిమిత్తం ఆ మహిళ నేడు కోర్టుకు హాజరయ్యారు.

ఆమె తన న్యాయవాదితో మాట్లాడుతుండగా.. దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:44

Somu Veerraju: బీజేపీతో టీడీపీ పొత్తు.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో పొత్తులపై చర్చ జరుగుతనే ఉంది. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో.. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది..

అయితే టీడీపీ (TDP), జనసేన (Janasena) పొత్తు పెట్టుకోకుండా.. బీజేపీ (BJP) అడ్డుపడుతోందని.. వైసీపీ, బీజేపీ రెండు ఒకటే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొన్న పీతాని సత్యనారాయణ, తరువాత తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ, వైసీపీ ఒక్కటో కాదో ప్రజలను అడిగితే తెలుస్తుంది అంటూ ఆరోపించారు. తాజాగా అచ్చెన్నాయుడుపై ఫైర్‌ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:37

Poonch Attack: జీ20 సదస్సే లక్ష్యంగా దాడి..?భారీ ఆపరేషన్‌ చేపట్టిన సైన్యం

భారత్‌(India)-పాక్‌(Pakistan) సంబంధాలు మరింత లోతుకు దిగజార్చే ఘటన చోటు చేసుకొంది. పాక్‌ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్‌(JEM) ముసుగు సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ (పీఏఎఫ్‌ఎఫ్‌)..

భారత సైనిక వాహనంపై దాడి బాధ్యతను స్వీకరించింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌-370ని తొలగించిన తర్వాత.. అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు శ్రీనగర్‌లో జీ-20(g20) సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది పాక్‌కు ఏమాత్రం మింగుడుపడలేదు. మరోవైపు పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ మే 5న భారత్‌లోని గోవాలో జరగనున్న షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సదస్సుకు హాజరు కానున్నట్లు ప్రకటించారు.

ఈ సమయంలో భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం కూడా ఉంది. దౌత్యపరంగా ఇంత కీలక సమయంలో భారత సైనిక వాహనంపై ముష్కరులు దాడికి తెగబడటం సంచలనంగా మారింది..

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 13:18

viveka murder case : అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే

సోమవారం మరోసారి విచారణ చేపడతామన్న సుప్రీం కోర్టు

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

సోమవారం వరకు అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయవద్దన్న సుప్రీం

కోర్టుసోమవారం అన్ని విషయాలు పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు

వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు

తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత పిటిషన్‌

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 12:19

కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరం లాంటిది : గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం కంటి వెలుగు పథకమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కంటి వెలుగు పథకం పేద ప్రజలకు గొప్ప వరమని ఆయన తెలిపారు.

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో కంటి వెలుగు పథకంలో మంజూరు అయిన కంటి అద్దాలను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సంధర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు . దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రైతులకు రైతు బంధు, రైతు భీమా , అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారేనని ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరం అయిన కంటి అద్దాలను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ సీఎం కేజ్రివాల్ గొప్ప పథకమని కొనియాడరని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం గా కొనసాగిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో ANM లు, ఆశ వర్కర్లు, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, పొలగొని స్వామి, కంచర్ల జన్నారెడ్డి, ఉయ్యాల నరేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 10:03

ఆరోగ్యానికి ఎండదెబ్బ

42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు

రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం

పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం

జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు

హైదరాబాద్‌: మే నెల రాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. హనుమకొండ, కర్నూలు, ఆదిలాబాద్‌, మెదక్‌, రామగుండంలలో గరిష్ఠంగా 42.5-43.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రి వేళల్లోనూ వేడి సెగలు ఇబ్బంది పెడుతున్నాయి. పగటిపూట ఇంట్లో ఉన్నా వేడి గాలుల ప్రభావం ఉంటోంది. ఇలాంటి వాతావరణంలో అనారోగ్య సమస్యలు వెంటాడే ముప్పు అధికంగా ఉంది.ఎక్కువమంది వడదెబ్బ బారిన పడుతుంటారు. గతేడాది పలువురు మృత్యువాత పడ్డారు. పనులపై బయటకు వెళ్లే వారు... ఎండలో పనిచేసే కార్మికులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తీవ్ర ఎండ బారిన పడితే...

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే కొంతసేపటికి నీరసంగా అనిపిస్తుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు పోతుంది. దాంతోపాటు ఖనిజలవణాలు వెళ్లిపోతాయి. దీంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. దీనినే డీహైడ్రేషన్‌ అని పిలుస్తారు. ఇదే వడదెబ్బకు దారి తీస్తుంది. అలాంటప్పుడు శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను భర్తీ చేయాలి. లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరానికి ఉండే సహజ గుణం వల్ల అవసరానికి తగ్గట్లుగా ఒక పరిమితి వరకు ఉష్ణోగ్రతలను నియంత్రించుకోగలదు. ఎండ తగిలినప్పుడు చెమట పట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే తీవ్రమైన ఎండకు గురైతే ఇలాంటి వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలోని వేడిని చెమట రూపంలో బయటకు పంపించే మార్గాలు మూసుకుపోతాయి. ఫలితంగా శరీరంలో వేడి పెరిగిపోయి వడదెబ్బ బారిన పడతారు. ఇలాంటి సమయంలో అత్యవసరంగా రోగికి చికిత్స అందించాలి. లేదంటే ఒక్కొక్కటిగా అన్ని అవయవాలు దెబ్బతిని మృత్యువు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే...

వెంటనే నీడ ప్రాంతానికి తరలించాలి.

బాధితుడి ఒంటిపై దుస్తులు తొలగించి గాలి తగిలేలా చూడాలి. చల్లని నీళ్లతో తుడవాలి.

వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

జ్వరం తగ్గించే పారాసిటమాల్‌, నొప్పి నివారణ మాత్రలు ఇవ్వకూడదు.

ఈ జాగ్రత్తలు అవసరం...

◾ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా ప్రతి గంటకూ ఓ గ్లాసు నీళ్లు తాగుతుండాలి. మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ మరింత మేలు చేస్తాయి. మూత్రం ముదురు పచ్చరంగులో వస్తుంటే శరీరంలో నీరు తగ్గుతోందని గుర్తించాలి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

◾వేసవిలో వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి

◾ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది.

◾ఉదయం 7 గంటలలోపే నడక, ఇతర వ్యాయామాలు ముగించాలి.

◾అత్యవసరమై ఎండలోకి వెళ్తే గొడుగు, టోపీ, హెల్మెట్‌ లాంటివి ధరించాలి

◾ఎండలో పిల్లలను ఆడనీయకూడదు..ఇండోర్‌ ఆటలే మేలు. ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు చాపలు, దుప్పట్లు లాంటివి కట్టి నీళ్లు పోస్తూ ఉండాలి

◾శీతల పానీయాల వల్ల దాహం తగ్గకపోగా...మరింత పెరుగుతుంది.

◾పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఫిల్టర్లు లాంటివిలేకపోతే కాచిచల్లార్చి వడబోసి తాగాలి.

ఎప్పుడు ప్రమాదమంటే..

జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు..

అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోతే..

చర్మం పొడిబారి వదులుగా మారినప్పుడు

బాగా నీరసం, నిస్సత్తువ ఉన్నప్పుడు..

నాలుక తడారిపోయినప్పుడు.

అధిక రక్తపోటు, మధుమేహ రోగులూ.. తస్మాత్‌ జాగ్రత్త

వడదెబ్బ విషయంలో అధిక రక్తపోటు, మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బీపీ మాత్రల్లో శరీరంలోని నీటిని తగ్గించే గుణం ఉంటుంది. దీనివల్ల రక్తంలో నీరు, సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నియంత్రణ లేని మధుమేహం వల్ల శరీరం ద్వారా నీరు బయటకు పోతుంది. ఇలాంటి వారికి వడదెబ్బ ముప్పు ఎక్కువే. అందుకే వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక సమస్యలు, పార్కిన్‌సన్స్‌ (వణుకుడు వ్యాధి)కు మందులు తీసుకునే వారిలో చెమట తగ్గుతుంది. దీంతో శరీరంలో వేడి పెరిగి వడదెబ్బకు గురవుతారు. ఇలాంటి వారు, వైద్యులను సంప్రదించి మందుల మోతాదులను మార్చుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌

నవజాత శిశువులు, గర్భిణులకు డీహైడ్రేషన్‌ ముప్పు

నవజాత శిశువులు అధిక చలి, వేడిని తట్టుకోలేరు. వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌ సమస్య ఎదురై ఫిట్స్‌, కిడ్నీ వైఫల్యం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. శరీరంపై వేడికి పొక్కులు వస్తాయి. వేసవిలో చంటి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎండలో ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ కాలంలో పిల్లల్లో ఎక్కువగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. తాగే నీళ్లు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చంటి పిల్లలు డీహైడ్రేట్‌ కాకుండా తల్లి పాలను అందించాలి. పెద్ద పిల్లలకు నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండాలి. ఎండలో ఆడనీయకూడదు. గర్భిణులు ఆసుపత్రి, ఇతర పనులు ఉంటే ఉదయం.. లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత చూసుకోవాలి.

డాక్టర్‌ ఉషారాణి, సూపరింటెండెంట్‌, నిలోఫర్‌ చిన్నపిల్లల ఆసుపత్రి

తాజా ఆహారమే తీసుకోవాలి...

వేసవిలో వేడి తీవ్రతకు ఆహారం త్వరగా పాడవుతుంది. ఎప్పటికప్పుడు వండుకొని తాజాగా తినడమే మేలు. నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీర, సొరకాయ, దోసకాయ లాంటివాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. పుదీనా, అల్లం వేసిన మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, టమాటా, ఉల్లిపాయలతో చేసిన సలాడ్లు, విటమిన్‌ సి ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డయాబెటిస్‌ ఉన్నవారు మజ్జిగ, తక్కువ షుగర్‌ ఉండే పండ్లు, గ్రీన్‌ టీ, లెమన్‌టీ, మొలకలు, బీరకాయ, సొరకాయతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు. అధికంగా ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బ బారిన పడే ప్రమాదం లేకపోలేదు.

సుజాత స్టీఫెన్‌, పోషకాహార నిపుణులు

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:48

WhatsApp | తాజాగా వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక యూజర్లకు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్

•Whatsapp | యానిమేటెడ్ ఎమోజీలు.. థ్రిల్డ్ సందేశాన్నిస్తాయి. ఇప్పుడు వాట్సాప్ లోనూ నేరుగా యానిమేటెడ్ ఎమోజీల ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నది.

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. అందులో ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు నిత్యం యూజర్లకు అందుబాటులో ఉంటాయి. మెసేజ్ పంపడం మొదలు గ్రూప్ కాల్ వరకు పలు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్ అందువల్లే యూజర్ ఫ్రెండ్లీ యాప్‌గా మారింది వాట్సాప్. ఫలితంగా ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వాట్సాప్ సేవలను ప్రధానంగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా వాట్సాప్ తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లు పరిచయం చేస్తున్నది. ఇప్పటికే కొన్ని ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి రాగా, తాజాగా మరో ఫీచర్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది వాట్సాప్ యాజమాన్యం.

యూజర్లు తమ రియాక్షన్ తెలపడానికి ఎమోజీలు ఉపయోగిస్తారు. మనం మాటల్లో చెప్పలేని భావాలు ఈ ఏమోజీల్లో తెలియ చేయొచ్చు. ఇప్పటి దాక వాట్సాప్ యాప్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఓఎస్‌లు ఇస్తున్న ఏమోజీలు మాత్రమే యూజర్లు వాడుతున్నారు.

ఇక నుంచి వాట్సాప్ తన యూజర్లకు సొంతంగా ఎమోజీలు అందుబాటులోకి తేనున్నది. టెలిగ్రామ్ యాప్‌లో మాదిరిగా యానిమేటెడ్ ఎమోజీలను యూజర్లకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది వాట్సాప్. ఈ యానిమేటెడ్ ఎమోజీలను ‘లొట్టి లైబ్రరీ’ సాయంతో తయారు చేస్తున్నారని వినికిడి. తాజాగా తీసుకొస్తున్న ఎమోజీలతో యూజర్లు సరికొత్త మెసేజింగ్ ఎక్స్ పీరియన్స్ పొందుతారని వాట్సాప్ అంచనా వేస్తున్నది. ఈ వాట్సాప్ యానిమేటెడ్ ఎమోజీ.. బేటాడెస్క్ టాప్ వర్షన్ డెవలప్ మెంట్ దశలో ఉంది.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:45

అంబేద్కర్‌ బీఎడ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దరఖాస్తు గడువు మే 22

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓ యూ)లో బీఎడ్‌, బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు వచ్చేనెల 22 వరకు ఉన్నది.

ఈ మేరకు అంబేద్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎవిఎన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌ www. braouonline.in ద్వారా దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.

ఎంట్రెన్స్‌ ఫీజు రూ.వెయ్యి, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు రూ.750 చెల్లించాలని కోరారు. జూన్‌ ఆరో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బీఎడ్‌ ప్రవేశ పరీక్ష,

మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:40

ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు..

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏప్రిల్‌ 12 నుంచి 20 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించారు.

పరీక్షలు ఇక ముగియడంతో ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్‌ 21 నుంచి 24 వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.

ఆ తర్వాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటిస్తారు. జూన్‌ 12న 2023-24 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం శుక్రవారం నుంచి వేసవి సెలవులను ముందస్తుగా ప్రకటించేశాయి.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:38

గురుకులాల్లో మహిళా గురువులు 80%

టీజీటీ, పీజీటీల్లో అత్యధికం మహిళలకే కేటాయింపు

జేఎల్‌, డీఎల్‌లో మెజారిటీ ఉద్యోగాలు మహిళలకే..

బాలికల గురుకులాలు ఎక్కువ ఉండటమే కారణం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్‌ పోస్టుల్లో దాదాపు 80 శాతం మహిళలకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో తొలిదఫా 9,231 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌ ) నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఇటీవలే జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎల్‌ 2,008, డీఎల్‌ 868 పోస్టులకుగాను దాదాపు 80 శాతం అంటే 2,301పోస్టులు మహిళలకే సొంతమయ్యాయి. ఈ నెల 24న పీజీటీ, టీజీటీ నోటిషికేషన్‌ విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పీజీటీ 1,276, టీజీటీ 4,020 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా మహిళలకే ఎక్కువభాగం దక్కనున్నాయని అధికారులు తెలిపారు.

సర్వీస్‌ నిబంధనలతో మహిళలకు లబ్ధి

గురుకుల విద్యాలయాలకు సంబంధించిన పోస్టుల్లో అత్యధికం మహిళలకు దక్కడానికి సర్వీస్‌ నిబంధనలే కారణమని అధికారులు తెలిపారు. బాలికల గురుకులాల్లోని పోస్టులు 100 శాతం మహిళలకే కేటాయించాలని సర్వీస్‌ రూల్స్‌ చెప్తున్నాయి. ఇక బాలుర గురుకులాల్లో సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు. వెరసి మహిళలకు అత్యధికంగా అవకాశాలు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,001 గురుకులాలను ఏర్పాటు చేసింది. అందులో 2016లో తొలుత ఐదో తరగతి నుంచి ప్రారంభించి క్రమంగా వాటిని ఇంటర్‌వరకు అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నది. మహిళల కోసం డిగ్రీ గురుకుల కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నది. మొత్తం గురుకులాల్లో బాలికలకు ప్రత్యేకంగా 5-10 తరగతి వరకు 551, ఇంటర్‌ వరకు 453 గురుకులాలున్నాయి. అవి కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం మొత్తం 54 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నెలకొల్పింది. మొత్తం 1,001 గురుకులాల్లో సగానికిపైగా బాలికలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలకు దక్కుతున్నాయి.

20వేలు దాటిన ఓటీఆర్‌

గురుకుల డిగ్రీ లెక్చరర్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఇప్పటిరకు దాదాపుగా 20 వేల మందికిపైగా అభ్యర్థులు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకొన్నారని ట్రిబ్‌ అధికారులు వెల్లడించారు. డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొంటుండటంతోపాటు పేమెంట్లు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ పోస్టులకు దాదాపు 3 లక్షల మందికిపైగా పోటీ పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు. జేఎల్‌, డీఎల్‌ పోస్టులకు మే17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అదనంగా లైబ్రేరియన్‌, పీడీ పోస్టులు

టీచింగ్‌ పోస్టులకు తోడు ఈసారి లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు అందుబాటులోకి రావడం విశేషం. స్కూల్‌ లెవల్‌ నుంచి మొదలు డిగ్రీ గురుకుల కాలేజీ వరకు ఆయా క్యాటగిరీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు వరంగా మారింది. గురుకుల పాఠశాలల్లో 434, జూనియర్‌ కాలేజీల్లో 50, డిగ్రీ కాలేజీల్లో 36 లైబ్రేరియన్‌ పోస్టులు కలిపి 520 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. గురుకుల పాఠశాలల్లో 275, జూనియర్‌ కాలేజీల్లో 34, డిగ్రీ గురుకులాల్లో 39 మొత్తంగా 348 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు భారీగా వచ్చాయి. పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులు మొత్తం 686 ఉన్నాయి.