గురుకులాల్లో మహిళా గురువులు 80%
టీజీటీ, పీజీటీల్లో అత్యధికం మహిళలకే కేటాయింపు
జేఎల్, డీఎల్‌లో మెజారిటీ ఉద్యోగాలు మహిళలకే..
బాలికల గురుకులాలు ఎక్కువ ఉండటమే కారణం
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్ పోస్టుల్లో దాదాపు 80 శాతం మహిళలకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో తొలిదఫా 9,231 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్ ) నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఇటీవలే జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎల్ 2,008, డీఎల్ 868 పోస్టులకుగాను దాదాపు 80 శాతం అంటే 2,301పోస్టులు మహిళలకే సొంతమయ్యాయి. ఈ నెల 24న పీజీటీ, టీజీటీ నోటిషికేషన్ విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీజీటీ 1,276, టీజీటీ 4,020 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా మహిళలకే ఎక్కువభాగం దక్కనున్నాయని అధికారులు తెలిపారు.
సర్వీస్ నిబంధనలతో మహిళలకు లబ్ధి
గురుకుల విద్యాలయాలకు సంబంధించిన పోస్టుల్లో అత్యధికం మహిళలకు దక్కడానికి సర్వీస్ నిబంధనలే కారణమని అధికారులు తెలిపారు. బాలికల గురుకులాల్లోని పోస్టులు 100 శాతం మహిళలకే కేటాయించాలని సర్వీస్ రూల్స్ చెప్తున్నాయి. ఇక బాలుర గురుకులాల్లో సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. వెరసి మహిళలకు అత్యధికంగా అవకాశాలు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,001 గురుకులాలను ఏర్పాటు చేసింది. అందులో 2016లో తొలుత ఐదో తరగతి నుంచి ప్రారంభించి క్రమంగా వాటిని ఇంటర్‌వరకు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నది. మహిళల కోసం డిగ్రీ గురుకుల కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నది. మొత్తం గురుకులాల్లో బాలికలకు ప్రత్యేకంగా 5-10 తరగతి వరకు 551, ఇంటర్ వరకు 453 గురుకులాలున్నాయి. అవి కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం మొత్తం 54 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నెలకొల్పింది. మొత్తం 1,001 గురుకులాల్లో సగానికిపైగా బాలికలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలకు దక్కుతున్నాయి.
20వేలు దాటిన ఓటీఆర్
గురుకుల డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఇప్పటిరకు దాదాపుగా 20 వేల మందికిపైగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారని ట్రిబ్ అధికారులు వెల్లడించారు. డీఎల్, జేఎల్ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొంటుండటంతోపాటు పేమెంట్లు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ పోస్టులకు దాదాపు 3 లక్షల మందికిపైగా పోటీ పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు. జేఎల్, డీఎల్ పోస్టులకు మే17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
అదనంగా లైబ్రేరియన్, పీడీ పోస్టులు
టీచింగ్ పోస్టులకు తోడు ఈసారి లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు అందుబాటులోకి రావడం విశేషం. స్కూల్ లెవల్ నుంచి మొదలు డిగ్రీ గురుకుల కాలేజీ వరకు ఆయా క్యాటగిరీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు వరంగా మారింది. గురుకుల పాఠశాలల్లో 434, జూనియర్ కాలేజీల్లో 50, డిగ్రీ కాలేజీల్లో 36 లైబ్రేరియన్ పోస్టులు కలిపి 520 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. గురుకుల పాఠశాలల్లో 275, జూనియర్ కాలేజీల్లో 34, డిగ్రీ గురుకులాల్లో 39 మొత్తంగా 348 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భారీగా వచ్చాయి. పీడీ, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 686 ఉన్నాయి.
Apr 21 2023, 09:48