దళారుల చేతిలో ధరలు
- మొక్క జొన్న ధరలు పతనం
మార్కెట్‌లో రూ. 2200 నుంచి రూ.1800లకు తగ్గుదల
- వ్యాపారులు సిండికేట్‌గా మారిన వైనం
- కానరాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు
పంట ఏదైనా రైతుల చెంతకు రాగానే ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు పత్తి, మిర్చిలో సిండికేట్‌గా మారిన వ్యాపారులు.. ఇప్పుడు మొక్కల కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్నారు. వారం రోజుల కిందట మొక్కజొన్న క్వింటాకు రూ.2200 ధర ఉండగా ఇప్పుడు రూ.1800లకు చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల మార్కెట్‌లో వ్యాపారులదే ఇష్టారాజ్యం అయింది. ధరలు పెరగకుండా వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కొనుగోళ్లను నిలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదనే ప్రచారం చేస్తున్నారు. దాంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాకు రూ. 2500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ మధ్ధతు ధర క్వింటాకు రూ.1960 ఖరారు చేసింది.
అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దాంతో రూ.1800కే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారుల చేతిలో రైతులు నష్ట్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి యాసంగిలో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. తాడూరు మండల పరిధిలోనే సుమారు 18,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. తెల్కపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో 150 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్‌లో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి పంటను అధికంగా సాగు చేశారు.
కౌలు రైతుల పరిస్థితి దయనీయం
మొక్క జొన్న సాగులో కౌలు రైతులే కీలకంగా ఉన్నారు. ఒక్కో ఎకరాకు రూ.పది వేలు చెల్లించి లీజుకు తీసుకున్నారు. ఎకరా పెట్టుబడి రూ.25 వేలకు దాటింది. లీజుతో కలుపుకొని మొత్తం రూ. 35వేలు అయ్యింది. 25 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న దిగుబడి 25 శాతం తగ్గడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. కాగా, పంట పూర్తిగా చేతికి వచ్చి కల్లాల్లో ఉన్నా నేటికీకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పెట్టుబడి అయినా..రావడం లేదు
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాను. కౌలుతో కలుపుకొని సుమారు రూ.1.60లక్షలు పెట్టుబడి అయింది. గతేడాది రూ.2500 అమ్మగా, ఈసారి రూ.1800కు పడిపోయింది. పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదు.
- బాలస్వామి, తాళ్లపల్లి, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
పత్తి వేసి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉంది. గతేడాది రూ. 2500లు ఉన్నది. ఈసారి 1800లకు పడిపోయింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.
- శ్రీనివాసులు, రైతు సంఘం
Apr 20 2023, 20:31