Kejriwal: దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా: కేజ్రీవాల్
దిల్లీ: కొత్త మద్యం విధానంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) అన్నారు. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదని..
సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ (CBI) ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ భాజపాపై నిప్పులు చెరిగారు. అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలోనూ కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వారు చాలా శక్తిమంతమైనవారని.. ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్ (Kejriwal) ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని భాజపా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐ (CBI)ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ తనను ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని అన్నారు. భాజపా నేతలకు అధికారం వల్ల వచ్చిన అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు.. ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు..
Apr 18 2023, 17:06