అన్ని సర్కార్ బడుల్లో రాగి జావ
•వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
హైదరాబాద్: అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగి జావ అందజేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 1-10 తరగతుల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. దాదాపు 22 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాగి జావ అని ఒకసారి, పల్లీ పట్టి అని మరోసారి, మొలకలు, బెల్లం అని ఇంకోసారి 2018-19 నుంచి ప్రతిపాదనలు పంపడం...
కేంద్ర విద్యాశాఖ 60% వ్యయాన్ని భరిస్తామని హామీ ఇవ్వడం...చివరకది అమలు కాకపోవడం షరా మామూలుగా మారింది. పిల్లల్లో రక్తహీనత నివారణకు వాటిని అందించాలనుకున్నా విద్యాశాఖ అధికారుల చొరవ లేని కారణంగా ఏటా అటకెక్కుతోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఈసారి దాన్ని పట్టాలెక్కించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో అందించాలంటే రూ.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేశారు. అందులో సగం ట్రస్ట్, మిగిలిన సగాన్ని ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు.
ట్రస్ట్ అమలు తీరును చూసి...
అన్నపూర్ణ ట్రస్ట్ 2022-23 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 6.50 లక్షల మందికి జాగి జావను ఉచితంగా అందించింది. ట్రస్ట్ ప్రతినిధులు రాగి మాల్ట్ పొడిని ఎంఈవో కార్యాలయాలకు పంపిస్తారు. దాన్ని విద్యాశాఖ అధికారులు అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తారు. పొడిలోనే బెల్లం కూడా కలిపి ఉంటుంది. దాన్ని వేడి నీళ్లలో వేస్తే చాలు. నీటిని వేడి చేయడం, రాగి మాల్ట్ పొడిని మిక్స్ చేయడం...దాన్ని విద్యార్థులకు అందించే బాధ్యత మధ్యాహ్న భోజనపథకం కార్మికులు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో దాన్ని అందిస్తున్నారు. కనీసం సగం మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏమీ తినకుండా ఉంటున్నారు. ఆ లోపాన్ని కూడా రాగి జావ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారానే అమలుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
Apr 16 2023, 08:56