రాష్ట్రంలో పకడ్బందీగా ఓటర్ల జాబితా
•జూన్ 1కల్లా ఈవీఎంల తొలి విడత తనిఖీ చేయాలి
•సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రాథమిక దశ స్థితిగతులను, సన్నద్ధతను తెలుసుకునేందుకు ముగ్గురు అధికారుల బృందాన్ని హైదరాబాద్ పంపింది.
ఈ బృందం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. ఎన్నికల క్రతువులో భాగస్వాములయ్యే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితీష్‌వ్యాస్ స్పష్టం చేశారు. ‘తొలిదశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించాలి. ఆ తర్వాత అన్ని స్థాయుల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఈఆర్పీనెట్ 2.0 పనితీరునూ సమీక్షించాలి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా నిర్వహించాలి. చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలి.
ఓటు ప్రాధాన్యంపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి. అధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియను జూన్ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలి’ అని ఆయన సూచించారు. తనిఖీ ప్రక్రియను పూర్తి చేసిన తరవాత ఈవీఎంలను ఆయా జిల్లాలకు తరలిస్తామని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అధికారుల బృందానికి వివరించారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రవికిరణ్, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Apr 16 2023, 08:55