Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు.. 16న విచారణకు రావాలంటూ..

మద్యం కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమన్లు పంపినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు..

కీలక అంశాలపై పంకజ్‌ జైన్‌తో ఏపీ సీఎస్‌ చర‍్చలు..

విజయవాడ: కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం చమురు మరియు సహజ వాయువు రంగానికి సంబంధించి లైసెన్సులు, క్లియరెన్స్‌ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్రోకెమికల్ ప్రాజెక్టుల స్థాపనకు సంబంధించిన ఫీజులు, వాటి నిర్వహణ వంటి కీలక అంశాలపై ఈసమావేశంలో ఇరువురు ప్రధానంగా చర్చించారు..

అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న పెట్రోలియం మైనింగ్ లీజులు (PMLs) మరియు అన్వేషణ,ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన వేగవంతమైన అనుమతులు మంజూరుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు..

CM KCR : బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం నాడు 125 అడుగుల ఎత్తైన డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ హాజరయ్యారు. అయితే..ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన మనవడు, లోక్‌సభ మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రకాష్‌ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లాంఛనంగా సమావేశం నిర్వహించి, అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌కు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీలు జే సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee: చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు.. భాజపాపై దీదీ విమర్శలు

కోల్‌కతా: ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌) సిలబస్‌ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా కొన్ని పాఠ్య భాగాలను తొలగించడాన్ని పశ్చిమ బెంగాల్‌(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు.

కోల్‌కతా(Kolkata)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె భాజపాపై విమర్శలు గుప్పించారు.

'మీరు నాకు మద్దతుగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను దేనిని విచ్ఛిన్నం చేయను. అకస్మాత్తుగా తాజ్‌మహల్‌, విక్టోరియా మెమోరియల్‌ను చరిత్ర నుంచి తుడిచేయాలని చూడను. చరిత్ర ఎప్పుడూ చరిత్రనే. దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు. భారత చరిత్రే మన సంపద. భారతదేశ లౌకికవాదం బెంగాల్ ఇచ్చిన సంపద. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్, నజ్రుల్‌(బెంగాలీ కవి), రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ వంటి వారు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు' అని మమత(Mamata Banerjee) అన్నారు..

మహాత్ముడి హత్య.. హిందూ, ముస్లిం ఐక్యత.. ఆరెస్సెస్‌ నిషేధం వంటి పాఠాలు 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి కొత్త విద్యాసంవత్సరంలో అదృశ్యమయ్యాయి. గతేడాది చేపట్టిన ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) సిలబస్‌ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా ''అతివ్యాప్తి'', ''అసంబద్ధం'' కారణాలుగా చూపుతూ ఇలా కొన్ని పాఠ్యభాగాలను తొలగించారు. తొలగించిన వాటిలో గుజరాత్‌ అల్లర్లు - వాటి పరిణామాలు, మొగల్‌ దర్బార్లు, ఎమర్జెన్సీ వంటి అంశాలు సైతం ఉన్నాయి. అయితే, అది ఈ విద్యాసంవత్సరం జరిగిన సిలబస్‌ మార్పు కాదని.. గతేడాది జూన్‌లోనే సిలబస్‌ హేతుబద్ధీకరణ జరిగినట్లు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ సక్లానీ చెప్పారు..

CM YS Jagan: బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్‌.. దేశం గర్వించదగ్గ మేధావి

CM YS Jagan: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు..

భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

TTD: నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ..

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది..

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాలి..

స్కాన్‌ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. స్వామివారి దర్శనానికి అనుమతించరు..

శ్రీవారి మెట్టుమార్గంలో జారీ చేస్తున్న దివ్య దర్శన టోకెన్లను అక్కడే ఇస్తారు..

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు.

Vizag: గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత.. భారీగా పోలీసు బందోబస్తు..

విశాఖపట్నం: నగరంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో కొంత మేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు..

కంచె నిర్మాణం చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేస్తున్నారు.

ఈ కారణంగా తెల్లవారుజామున 2 గంటల నుంచే గీతం వర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు రెండు కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులను ఆ మార్గంలో పంపిస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో చుట్టు పక్కల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే..

Heavy Rains: నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

లంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.

Traffic Restrictions: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా.. నెక్లెస్‌ రోడ్ లో రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు..

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి..

ఇక ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు ఇవాళ మూసివేయనున్నారు..

ట్రాఫిక్ అప్డేట్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా పేజ్ ను అనుసరించాలని కోరారు...

YSR EBC Nestham: అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా: సీఎం జగన్‌..

•లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

ప్రకాశం జిల్లా: 2014-19 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది, మా పాలన హయాంలో జరిగిన మంచి ఎంత బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల బ్యాచ్‌ను నమ్మకండి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని బాబుకు ఏం మంచి చేశావని మా ఇంటి ముందు స్టిక్కర్‌ అంటిస్తానంటారని చంద్రబాబుని అడగండి.. రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారు’’ అని సీఎం మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు.