Mamata Banerjee: చరిత్రను మార్చే శక్తి ఎవరికీ లేదు.. భాజపాపై దీదీ విమర్శలు
కోల్‌కతా: ఎన్‌సీఈఆర్‌టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిలబస్ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా కొన్ని పాఠ్య భాగాలను తొలగించడాన్ని పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) తప్పుపట్టారు.
కోల్‌కతా(Kolkata)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆమె భాజపాపై విమర్శలు గుప్పించారు.
'మీరు నాకు మద్దతుగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. నేను దేనిని విచ్ఛిన్నం చేయను. అకస్మాత్తుగా తాజ్‌మహల్, విక్టోరియా మెమోరియల్‌ను చరిత్ర నుంచి తుడిచేయాలని చూడను. చరిత్ర ఎప్పుడూ చరిత్రనే. దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు. భారత చరిత్రే మన సంపద. భారతదేశ లౌకికవాదం బెంగాల్ ఇచ్చిన సంపద. రామకృష్ణ పరమహంస, స్వామీ వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, నజ్రుల్(బెంగాలీ కవి), రాజారామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ వంటి వారు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు' అని మమత(Mamata Banerjee) అన్నారు..
మహాత్ముడి హత్య.. హిందూ, ముస్లిం ఐక్యత.. ఆరెస్సెస్ నిషేధం వంటి పాఠాలు 11, 12 తరగతుల రాజనీతిశాస్త్రం, సామాజికశాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి కొత్త విద్యాసంవత్సరంలో అదృశ్యమయ్యాయి. గతేడాది చేపట్టిన ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) సిలబస్ హేతుబద్ధీకరణ కసరత్తులో భాగంగా ''అతివ్యాప్తి'', ''అసంబద్ధం'' కారణాలుగా చూపుతూ ఇలా కొన్ని పాఠ్యభాగాలను తొలగించారు. తొలగించిన వాటిలో గుజరాత్ అల్లర్లు - వాటి పరిణామాలు, మొగల్ దర్బార్లు, ఎమర్జెన్సీ వంటి అంశాలు సైతం ఉన్నాయి. అయితే, అది ఈ విద్యాసంవత్సరం జరిగిన సిలబస్ మార్పు కాదని.. గతేడాది జూన్‌లోనే సిలబస్ హేతుబద్ధీకరణ జరిగినట్లు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ చెప్పారు..
Apr 14 2023, 17:37