CM YS Jagan: బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్‌.. దేశం గర్వించదగ్గ మేధావి

CM YS Jagan: దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..

న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు..

భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

TTD: నేటి నుంచి అలిపిరిలో దివ్యదర్శన టోకెన్ల జారీ..

తిరుపతి (తితిదే) తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వచ్చే భక్తులకు ఇప్పటివరకు గాలిగోపురం వద్ద ఇస్తున్న దివ్యదర్శన టోకెన్ల జారీ కేంద్రాన్ని తితిదే మార్పు చేసింది..

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో శుక్రవారం నుంచి టోకెన్లను జారీ చేయనున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి కాలినడక మార్గంలోని గాలిగోపురం వద్ద ఉన్న కేంద్రంలో స్కాన్‌ చేసుకోవాలి..

స్కాన్‌ చేసుకోకపోయినా, ఇతర మార్గాల్లో తిరుమల చేరుకున్నా.. స్వామివారి దర్శనానికి అనుమతించరు..

శ్రీవారి మెట్టుమార్గంలో జారీ చేస్తున్న దివ్య దర్శన టోకెన్లను అక్కడే ఇస్తారు..

అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు జారీ చేస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) కేంద్రాన్ని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయానికి మార్చారు.

Vizag: గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత.. భారీగా పోలీసు బందోబస్తు..

విశాఖపట్నం: నగరంలోని గీతం యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో కొంత మేర ప్రభుత్వ స్థలంగా గుర్తించినట్లు తెలిపిన రెవెన్యూ అధికారులు..

కంచె నిర్మాణం చేపడుతున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో వర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. ప్రధాన క్యాంపస్‌లోని డెంటల్‌ కాలేజ్‌ వద్ద కిలోమీటర్‌ మేర కంచె వేస్తున్నారు.

ఈ కారణంగా తెల్లవారుజామున 2 గంటల నుంచే గీతం వర్సిటీకి వెళ్లే అన్ని రోడ్లపై పోలీసులు ఆంక్షలు విధించారు. సుమారు రెండు కిలోమీటర్ల ముందుగానే బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ వెళ్లనివ్వలేదు. ఐడీ కార్డులు చూపిస్తేనే స్థానికులను ఆ మార్గంలో పంపిస్తున్నారు. పోలీసుల ఆంక్షలతో చుట్టు పక్కల ప్రజలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరిలోనూ గీతం కళాశాలను ఆనుకొని ఉన్న 14 ఎకరాల భూమిని ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే..

Heavy Rains: నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు

లంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

రాబోయే మూడు గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.

Traffic Restrictions: అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా.. నెక్లెస్‌ రోడ్ లో రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు..

మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి..

ఇక ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు ఇవాళ మూసివేయనున్నారు..

ట్రాఫిక్ అప్డేట్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా పేజ్ ను అనుసరించాలని కోరారు...

YSR EBC Nestham: అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా: సీఎం జగన్‌..

•లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

ప్రకాశం జిల్లా: 2014-19 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది, మా పాలన హయాంలో జరిగిన మంచి ఎంత బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల బ్యాచ్‌ను నమ్మకండి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని బాబుకు ఏం మంచి చేశావని మా ఇంటి ముందు స్టిక్కర్‌ అంటిస్తానంటారని చంద్రబాబుని అడగండి.. రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారు’’ అని సీఎం మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు.

Firing at Military Station: పంజాబ్‌లో కలకలం.. బఠిండా మిలిటరీ స్టేషన్‌లో దాడి..

చండీగఢ్‌: పంజాబ్‌ (Punjab)లో ఓ సైనిక శిబిరంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బుధవారం తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండాలోని మిలిటరీ స్టేషన్‌ (Bathinda Military Station)లో ఆగంతకులు కాల్పులు జరిపారు..

ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పులు వినిపించగానే స్టేషన్‌లోని క్విక్‌ రియాక్షన్ బృందాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గాలింపు చేపట్టాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి కోసం వేట కొనసాగుతోంది. మిలిటరీ స్టేషన్‌ను మూసివేసి కార్డన్‌ సెర్చ్‌ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు..

ఈ ఘటన సైనిక స్థావరం (Bathinda Military Station)లోని శతఘ్ని యూనిట్‌లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న ఓ ఆఫీసర్స్ మెస్‌లో ఇది జరిగినట్లు భావిస్తున్నారు. ఆ ప్రదేశంలోనే సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. పౌర దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ సైనిక స్థావరంలో ఒక ఇన్సాస్‌ రైఫిల్‌, 28 తూటాలు అదృశ్యమయ్యాయి. ఈ ఘటనలో వీటిని వాడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి.. పది మందికి గాయాలు

ఖమ్మం: వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటుచేసుకుంది. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆరెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలు బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో తారాజువ్వ పడటంతో సమీపంలోని గుడిసెకు నిప్పు అంటుకుంది.

దీంతో గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలవ్వగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు కాళ్లు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సిరిసిల్ల జిల్లాకు మళ్లీ రానున్న మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా:

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి పర్యటించనున్నారు. ఈ పర్యటలో భాగంగా

రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఈ క్రింది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 9:45 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గం, తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల గ్రామానికి చేరుకుంటారు.

ఉదయం 10గంటలకు తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాలను ప్రారంభిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు.

మధ్యాహ్నం 1:30 గంటలకు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఎస్సీ హాస్టల్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ముస్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

నేడు ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు

•సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్: ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఎల్‌బీ స్టేడియం వేదిక‌గా ఇఫ్తార్ విందు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముస్లిం ప్ర‌తినిధులు హాజ‌రు కానున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్‌బీ స్టేడియం ప‌రిస‌ర ప్రాంతాల్లో బుధ‌వారం సాయంత్రం 5 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

చాపెల్ రోడ్, నాంప‌ల్లి నుంచి వ‌చ్చే వాహ‌న‌దారులు బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద ఏఆర్ పెట్రోల్ పంప్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ నుంచి బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను చాపెల్ రోడ్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. ర‌వీంద్ర భార‌తి, హిల్ ఫోర్ట్ నుంచి బీజేఆర్ విగ్ర‌హం వైపు వెళ్లే వాహ‌న‌దారుల‌ను సుజాత స్కూల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు.

బ‌షీర్‌బాగ్ ఫ్లై ఓవ‌ర్ నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను బీజేఆర్ విగ్ర‌హం వ‌ద్ద కుడి వైపున‌కు అనుమ‌తించ‌రు. ఎస్‌బీఐ గ‌న్‌ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్ వైపు వెళ్లాలి.

నారాయ‌ణ‌గూడ సెంటిన‌రీ నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వెహిక‌ల్స్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట‌ర్స్ వ‌ద్ద హిమాయ‌త్‌న‌గ‌ర్ వై జంక్ష‌న్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. కింగ్ కోఠి, బొగ్గుల‌కుంట నుంచి బ‌షీర్‌బాగ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కింగ్ కోఠి క్రాస్ రోడ్స్ వ‌ద్ద తాజ్‌మ‌హ‌ల్ హోట‌ల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. వాహ‌న‌దారులు ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు.