Air India: సిబ్బందిపై ప్రయాణికుడి దాడి.. విమానం వెనక్కి..!
దిల్లీ: విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎయిరిండియా (Air India) విమానంలో ఓ ప్రయాణికుడు (unruly passenger) సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించాడు..
దీంతో అతడిని దించేయడం కోసం విమానం మళ్లీ వెనక్కి వచ్చింది. దిల్లీ నుంచి లండన్ (Delhi-London flight) బయల్దేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సోమవారం ఉదయం దిల్లీ (Delhi Airport)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 225 మంది ప్రయాణికులతో ఓ ఎయిరిండియా విమానం (Air India Flight) లండన్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. దీంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. మళ్లీ దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేసి ఆ ప్రయాణికుడిని దించేశారు. ఘటన నేపథ్యంలో ఈ విమానం ఆలస్యమైంది..
ఘటనపై ఎయిరిండియా (Air India) స్పందించింది. ''దిల్లీ నుంచి లండన్ బయల్దేరిన ఏఐ 111 విమానం.. ప్రయాణికుడి అభ్యంతరకర ప్రవర్తన (Unruly Behaviour) కారణంగా కాసేపటికే వెనక్కి రావాల్సి వచ్చింది. మాటలతో, రాతపూర్వకంగా హెచ్చరించినా ఆ ప్రయాణికుడు వినిపించుకోలేదు సరికదా.. ఇద్దరు క్యాబిన్ సిబ్బందిని గాయపర్చాడు. దీంతో విమానాన్ని దిల్లీకి మళ్లించాలని పైలట్ నిర్ణయించారు. ల్యాండ్ అయిన తర్వాత అతడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అని ఎయిరిండియా తన ప్రకటనలో వెల్లడించింది. విమానంలోని ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం, వారి మర్యాదను కాపాడటం తమకు అత్యంత ప్రాధాన్యమని ఎయిర్‌లైన్ తెలిపింది. ఈ ఘటనతో ఇతర ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నట్లు పేర్కొంది. విమానాన్ని మధ్యాహ్నానికి రీషెడ్యూల్ చేసినట్లు
వెల్లడించింది.
ఇటీవల ప్రయాణికుడి మూత్ర విసర్జన ఘటనతో ఎయిరిండియా తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. విమానంలో ప్రయాణికుల ప్రవర్తనపై పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను ఎదుర్కొనేందుకు ఎయిరిండియా తమ సిబ్బందికి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది..
Apr 10 2023, 16:12