కేంద్ర కొలువులు హిందీ వాళ్లకేనా?.. కేంద్ర హోంమంత్రికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ చెందేలా తెలుగుతోపాటు భారత రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లో ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీఎఫ్ ఉద్యోగాల కోసం హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు.
ఈ పరీక్షను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతోపాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే పోటీ పరీక్షలు నిర్వహించడం ఇతర ప్రాంతాలపై తీవ్ర వివక్ష చూపటమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదవనివారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వివిధ ఉద్యోగాల కోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ విధానంలో 12 అధికార భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొన్న నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని విమర్శించారు.
రాజ్యాంగ విరుద్ధం
అనేక అధికారిక భాషలున్న భారతదేశంలో హిందీవారికి మాత్రమే పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలో రాజ భాష అంటూ ఏదీలేదని రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. సమాన అవకాశాలు పొందేలా ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హకును సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కాలరాస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ నిర్వహించాలని 2020 నవంబర్ 18న కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు.
దక్షిణాదిలో వెల్లువెత్తిన నిరసనలు
సీఆర్పీఎఫ్‌లో దాదాపు 1.3 లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ జారీచేసిన నోటిఫికేషన్‌లో పరీక్షను ఇంగ్లిష్, హిందీలో మాత్రమే నిర్వహిస్తున్నట్టు ప్రకటించటం దక్షిణాది రాష్ర్టాల్లో అగ్గి రాజేసింది. కేంద్ర ఉద్యోగాల భర్తీలో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆరోపిస్తూ నిరుద్యోగులు ఆందోళనబాట పట్టారు. 'లింగ్విస్టిక్ ఈక్వాలిటీ' కావాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సహా పలువురు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు గళం విప్పారు. 'బంగ్లా పోఖో' ప్రధాన కార్యదర్శి గార్గా ఛటర్జీ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ విషయంపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల్లోనూ సీఆర్పీఎఫ్ పరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
Apr 08 2023, 16:28