Bopparaju: అప్పుడు జీతం పెరిగితే.. ఇప్పుడు పడితే సంతోషించాల్సి వస్తోంది: బొప్పరాజు
అమరావతి: ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని దుస్థితి రాష్ట్రంలో తప్ప మరెక్కడా లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు..
జీతాలు సకాలంలో అందక ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డితో ఏపీ ఐకాస అమరావతి నేతలు సమావేశమయ్యారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ లేఖను ఆయనకు అందజేశారు. అనంతరం నేతలు బొప్పరాజు మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరిలో సీఎస్‌కు లేఖ ఇచ్చినా డిమాండ్లు పరిష్కారం కాలేదని బొప్పరాజు చెప్పారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని సీఎస్‌కు తెలిపినట్లు వెల్లడించారు. ''ఉద్యోగ సంఘాల పోరాట కార్యాచరణపై సీఎస్‌కు నోటీసిచ్చాం. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు ఇవ్వట్లేదు. మేం దాచుకున్న డబ్బుకూ ప్రభుత్వం
లెక్కలు చెప్పడం లేదు. జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు కష్టాలు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు చెల్లించలేక వడ్డీలు కట్టాల్సిన దుస్థితి నెలకొంది. కొంతమంది ఉద్యోగులు లోన్ యాప్‌ల ద్వారా డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం దారుణం. ఇవన్నీ పరిష్కరించకపోవడం వల్లే ఉద్యమానికి దిగాం. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. తెలంగాణలో ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. గతంలో జీతం పెరిగితే సంతోషించేవాళ్లం.. ఇప్పుడు జీతం పడితే సంతోషించాల్సి వస్తోంది. పోరాటంలో కలిసి రావాలని ఏపీ ఎన్జీవో ఐకాసను కోరాం. మాతో కలిసొచ్చినా.. లేక విడిగా పోరాటం చేసినా ఫర్వాలేదు'' అని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
Apr 08 2023, 09:22