Kiran Kumar Reddy: భాజపా ఎదిగేకొద్దీ.. కాంగ్రెస్ దిగజారింది: కిరణ్‌కుమార్‌రెడ్డి..
దిల్లీ: దేశ నిర్మాణం, పేదరిక నిర్మూలనకు భాజపా చేస్తున్న కృషి నచ్చడంతోనే ఆ పార్టీలో చేరినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు..
దిల్లీలో కాషాయ పార్టీలో చేరిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే భాజపా బలీయమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. అక్కడ పార్టీ పటిష్ఠత, కార్యాచరణపై నాయకులతో కనీస చర్చ కూడా ఉండదని కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న ఆరు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నట్లు చెప్పారు.
''కాంగ్రెస్ అధిష్ఠానం తప్పుడు నిర్ణయాలతో ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పార్టీ నాయకత్వం చెల్లాచెదురైంది. ఎవరి నాయకత్వంలో పనిచేయాలో తెలియని అయోమయం ఏర్పడింది. భాజపా ఎదిగేకొద్దీ కాంగ్రెస్ దిగజారుతూ వచ్చింది. పరిస్థితులు, పరిణామాలను అర్థం చేసుకుని కాయకల్ప చికిత్స చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. వాస్తవాలు గ్రహించకుండా మేం చేసిందే సరైనదనే ధోరణి కాంగ్రెస్‌లో ఉంది. దేశ నిర్మాణం పట్ల భాజపా నాయకత్వంలో స్పష్టమైన అవగాహన ఉంది. శక్తిమంతమైన నాయకులే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పేదలకు సేవ చేయడమే జాతి నిర్మాణన్న సంకల్పం భాజపాకు ఉంది. దేశం కోసం మోదీ, అమిత్‌షా కంకణబద్ధులై ఉన్నారు'' అని కిరణ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు..
Apr 07 2023, 18:01