Naxals Encounter: ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత..?

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)లోని నక్సల్స్‌ (Naxals) కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైంది. ఛత్రా (Chatra) అడవుల్లో మావోయిస్టులపై జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు..

వీరిలో రూ.25లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు (Maoist) అగ్రనేత కూడా హతమైనట్లు తెలుస్తోంది.(Naxals Encounter)

ఛత్రా-పాలము సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్‌ (CRPF Cobra Unit) ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సల్స్‌ హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుపాకులు సహా పెద్దమొత్తంలో ఆయుధాలు లభించినట్లు ఝార్ఖండ్‌ పోలీసులు వెల్లడించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులపై రూ.25లక్షల రివార్డు, మరో ఇద్దరు నక్సల్స్‌పై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు..

నక్సల్స్‌ ముఠాకు చెందిన స్పెషల్‌ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్‌ పాసవాన్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతడి తలపై రూ.25లక్షల రివార్డు ఉంది. అయితే గౌతమ్‌ మృతిపై అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది..

Pawan Kalyan: దిల్లీకి పవన్‌.. భాజపా ముఖ్యులతో భేటీకానున్న జనసేనాని

దిల్లీ: జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) దిల్లీలో పర్యటిస్తున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వెళ్లిన పవన్‌..

నేడు హస్తినకు చేరుకున్నారు. పవన్‌తో పాటు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు.

దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా(BJP)కు చెందిన పలువురు ముఖ్యనేతలు, కేంద్రమంత్రులతో పవన్‌, మనోహర్‌ భేటీ కానున్నారు. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై భాజపా పెద్దలతో పవన్‌ చర్చిచే అవకాశముంది. జనసేనాని దిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అత్తారింటి ముందు అల్లుడి ధర్నా

కోదాడ :

తన కొడుకును తనకు దూరం చెయ్యొద్దంటూ ఓ తండ్రి ఆందోళన చేస్తున్నాడు. అత్తారింటి ముందు తన తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగాడు.

ఏడాదిన్నరగా తన కొడుకును కలవనివ్వడంలేదని, కోర్టు తీర్పును కూడా అమలుచేయట్లేదని వాపోతున్నాడు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన.

హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ కు కోదాడకు చెందిన రమణి పృథ్వితో 2018లో వివాహం జరిగింది. మూడేళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఓ కొడుకు కూడా పుట్టాడు. అయితే, 2021లో భార్యాభర్తల మధ్య విభేదాలు తలేత్తాయి. దీంతో రమణి పృథ్వి కొడుకును తీసుకుని కోదాడలోని పుట్టింటికి చేరుకుంది.

ఆ తర్వాత కొడుకును తల్లిదండ్రుల వద్ద వదిలి కెనడా వెళ్లింది. దీంతో ప్రవీణ్ కుమార్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. వారానికోమారు తండ్రీకొడుకులు కలుసుకునేందుకు వీలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..

ఏడాదిన్నరగా తన కొడుకును చూసుకునేందుకు ప్రవీణ్ ఎన్నిమార్లు ప్రయత్నించినా అత్తామామలు కుదరనివ్వలేదు. దీంతో తన కొడుకును తనకు చూపించాలంటూ తల్లిదండ్రులతో కలిసి ప్రవీణ్ అత్తారింటి ముందు ధర్నాకు దిగాడు. కొడుకు కోసం కొన్న ఆట వస్తువులను ప్రదర్శిస్తూ అత్తామామల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు.

Andhra Pradesh: ఏపీలో వర్షాలు.. అరుదైన రికార్డు నమోదు..!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, ఈ సారి వర్షాలు అరుదైన రికార్డు నమోదు చేశాయి.. గత 10 సంవత్సరాలలో మార్చిలో కురిసిన వర్షాల్లో ఈసారి మార్చి కూడా ఒకటిగా నిలిచింది..

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో వర్షపాతం సాధారణం కంటే దాదాపు 300 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.. అందులో బాపట్ల జిల్లాలో అత్యధికంగా 870 శాతం వర్షపాతం నమోదైంది. తిరుపతి మరియు విశాఖపట్నం జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా ఏపీలో మార్చిలో 10-20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది.. కానీ, ఈసారి చాలా ఎక్కువగా అంటే 60-70 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. ఇది చాలా అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు..

ఇక, ఇదే సమయంలో.. కోనసీమ జిల్లాలో 733 శాతం, విశాఖపట్నంలో 623 శాతం, శ్రీకాకుళంలో 429 శాతం, అనకాపల్లిలో 439 శాతం, కాకినాడలో 523 శాతం, కృష్ణా జిల్లాలో 564 శాతం, నెల్లూరులో 553 శాతం, కడపలో 646 శాతం, తిరుపతిలో 671 శాతం, అన్నమయ్య జిల్లాలో 386 శాతం, ఏలూరులో 353 శాతం వర్షపాతం మార్చి నెలలో నమోదు అయ్యింది.. అత్యల్పంగా అంటే ప్రకాశం జిల్లాలో 6 శాతం మాత్రమే నమోదైంది.. కర్నూలులో 16 శాతం, అనంతపురం 35 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 110 శాతం, నంద్యాల 123 శాతంలో వరుసగా చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా, మార్చిలో కురిసిన అకాల వర్షాలతో భారీ పంట నష్టం జరిగిన విషయం విదితమే..

CM YS Jagan: సీఎం జగన్‌ కీలక భేటీ.. మారబోతున్న ఎమ్మెల్యేల జాతకాలు..!

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశానికి సిద్ధం అయ్యారు.. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించబోతున్నారు..

ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరుకాబోతున్నారు.. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్‌ జగన్‌ వార్నింగ్‌ ఇస్తారు అనే చర్చ సాగుతోంది.. గతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్‌.. మరోవైపు.. మంత్రివర్గంలో మార్పులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశంలోనే.. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడంతో.. ఆ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నేతలకు టెన్షన్‌ పట్టుకున్నట్టు తెలుస్తుంది..

Chandra Babu Naidu: వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్

ఎలక్షన్లు ఎప్పుడు వచ్చిన తాము సిద్ధమేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు..

అయితే వైసీపీ ఎమ్మెల్యేలు చాలాంది తమతో టచ్ లో ఉన్నారని పేర్కొ్న్నారు. వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి వివేక హత్యకేసు అనేది దేశ చరిత్రలోనే సస్పెన్స్ థ్రిల్లర్ అని..ఫిజ్ఞన్ కథలు రాసేవారు కూడా ఇలాంటివి రాయలేరని విమర్శించారు. ఇన్ని ట్విస్టులు ఉన్న కేసు దేశంలో మరొకటి లేదని ఆరోపించారు. జగన్ పేదల ప్రతినిధి కాదని పెద్ద దోపిడీదారని విమర్శించారు..

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలు షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారని..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని పేర్కొన్నారు.ఎన్నికల ఫలితాలపై సజ్జల ఒకటంటే, మంత్రి బొత్స మరొమాట అంటున్నారని విమర్శించారు. ఏప్రిల్ ఫూల్ అనే పదం జగన్‌కి సరిగ్గా సరిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజలందర్నీ ఎల్లకాలం ఫూల్స్ చేయొచ్చనే భ్రమలో జగన్ ఉన్నారని.. కానీ, ప్రజలంతా కలిసి ఆయనను ఫూల్ చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. 175 స్థానాల్లో వైసీపీను ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి ఉన్న 23 మంది సభ్యుల బలంతోనే ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నామని తెలిపారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన వైకాపా తిరిగి తమపైనే నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు..

India Corona | 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి

•తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి..

India Corona | దేశంలో (India) కరోనా వైరస్‌ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Health ministry Of India) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి..

మరోవైపు దేశంలో పాజిటివ్‌ కేసుల (Positive Cases) సంఖ్య 16వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 16,354 కేసులు యాక్టివ్‌గా (Active Cases) ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 4,41,71,551 మంది కోలుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో కేరళ (Kerala)లో ముగ్గురు, గోవా (Goa), గుజరాత్‌ (Gujarat)లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో కొవిడ్‌ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 5,30,876కి చేరింది..

Andhra News: పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథరెడ్డి కారును ధ్వంసం చేసిన వైకాపా కార్యకర్తలు..

పుట్టపర్తి : శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై తెదేపా నేత పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పరస్పర సవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది..

ఇటీవల నారా లోకేశ్‌ పాదయాత్ర పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని, లోకేశ్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై తెదేపా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పుట్టపర్తి అభివృద్ధి ఏ మేరకు చేశారో చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి.. వైకాపా ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. స్థానిక సత్తెమ్మ ఆలయం వద్ద చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వేదిక ఏర్పాటు కోసం పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి తెదేపా కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని తెదేపా కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు..

అయితే తెదేపా కార్యాలయం గోడ దూకి పల్లె రఘునాథరెడ్డి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. అక్కడ ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. పల్లె రఘునాథరెడ్డి కారును వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పల్లె రఘునాథరెడ్డిని అరెస్టు చేశారు.

హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు

ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు

దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్న ఈ డి అధికారులు

తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న చూదాలు

జూబ్లీహిల్స్ మాదాపూర్ లో ఫార్మా కంపెనీ డైరెక్టర్ ల ఇళ్ళల్లో సోదాలు

బీజేపీ డ్రామాలు ఇకనైనా ఆపాలి: బిగాల గణేష్ గుప్త

హైదరాబాద్: కేజీవాల్ చెప్పినట్లు BRSకు రూ.75 కోట్లు ఇచ్చానని సుఖేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు BRS నేత గణేష్ గుప్త.

బీజేపీ నేతలు ఇకనైనా డ్రామాలు ఆపాలని.. BRSకు డబ్బు ఇచ్చానని రేపు సిసోడియాతో కూడా చెప్పించినా ఆశ్చర్యం లేదన్నారు.

ఈడీతో ప్రతిపక్షాలపై బీజేపీ దాడులు చేయిస్తోందని.. సుఖేష్ కు లేఖ రాసిచ్చింది బీజేపీనేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నియంతృత్వంగా మారుస్తోందని విమర్శించారు.