ఏపీ :మడికి గ్రామపంచాయతీ @75 వసంతాలు. పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949.ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు
మడికి గ్రామపంచాయతీ వసంతాలు
పంచాయతీ ఆవిర్భావం 3 ఏప్రిల్ 1949
ఇప్పటి వరకూ 11 మంది సర్పంచులు
నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతన అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్‌తో కళకళలాడుతూ ఉండే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామపంచాయతీ 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ పంచాయతీ 1949 ఏప్రిల్ 3 న ఆవిర్భవించింది. అప్పటినుంచి అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ గ్రామానికి చిలకలపాడు, మల్లావానితోట శివారు గ్రామాలుగా ఉన్నాయి. ఈ గ్రామానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటు కోనసీమకు అటు తూర్పుగోదావరి జిల్లాకి సరిహద్దు గ్రామం ఇది. ఇక్కడి కూరగాయల మార్కెట్ కు రాష్ట్ర నలుమూలన నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు అక్కడకు దిగుమతి చేసుకుంటారు.ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. అనతి కాలంలోనే ఈ మార్కెట్ విశేష గుర్తింపు పొందింది.
గ్రామ చరిత్ర ఇది ...
పావన గౌతమీ గోదావరికి కూత వేటు దూరంలో ఉన్న మడికి గ్రామానికి పురాణ ప్రాశస్త్యం ఉంది. దేవతాకాలంలో మణికర్ణిక అనే మహిళ ఇక్కడ ఘోర తపస్సు ఒనరించినట్లు చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తుంది. నారద మహాముని ప్రేరణతో ఆమె ఏకాదశ రుద్రుల్లో ఒకరైన సోమేశ్వర స్వామిని ప్రతిష్టించగా, నారదుడు నవ జనార్ధనుని ప్రతిష్టలో భాగంగా రెండవ ఆలయం ఎక్కడ నిర్మించినట్లు నేటికీ సజీవ సాక్షాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఒకే ప్రాంగణంలో శివ-విష్ణువాలయాలు ఉండడం ఈ గ్రామ విశేషం. మణికర్ణికచే ఆలయ నిర్మాణం జరగడంతో ఆ గ్రామానికి మణిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మడికి గా రూపాంతరం చెందింది.
75 ఏళ్లలో 11 మంది సర్పంచులు
75 ఏళ్ల చరిత్ర గల ఈ గ్రామపంచాయతీకి ఇప్పుడు వరకు మంది సర్పంచులు గా పనిచేశారు. తొలి సర్పంచ్‌గా జయవరపు సత్తయ్య(మడికి) పనిచేశారు. ఆ తర్వాత రావిపాటి పట్టాభిరామయ్య(చిలకలపాడు),గండి నాగేశ్వరరావు(చిలకపాడు), రాయపాటి రామారావు(చిలకలపాడు) లు సర్పంచ్ పదవులు చేపట్టారు.వీరి హయాంలో పాఠశాలలు, విద్యుత్ సౌకర్యాలు వచ్చాయి. అయితే 8 జూన్ 1966 నుంచి 7జూన్ 1970 వరకు ఉప సర్పంచ్‌గా ఉన్న కురమళ్ల వీర్రాజు(చిలకలపాడు) సర్పంచిగా ఇంచార్జ్ బాధితులు చేపట్టారు. ఆ తర్వాత 8జూన్1970 నుంచి 31 మార్చి 79 వరకు మామిడిశెట్టి వీరంశెట్టి(మడికి) సర్పంచ్ గా కొనసాగారు.ఈయన కాలంలో సబ్ హెల్త్ సెంటర్, పశువుల ఆసుపత్రి వంటి సౌకర్యాలు వచ్చాయి. అలాగే 2 జూలై 1979 నుంచి 26 మే 1981 వరకు ఉప సర్పంచ్ గా ఉన్న కొప్పిశెట్టి వెంకటరాజు(మల్లావానితోట) ఇంచార్జ్ సర్పంచ్‌గా ఉన్నారు. అనంతరం 27 మే 1981 నుంచి 20 అక్టోబర్ 1995 వరకు సుమారు 14 ఏళ్ల పాటు కురమళ్ల వీర్రాజు సర్పంచ్ గా ఏకచత్రాధిపత్యం వహించారు.ఆ సమయంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సంగిత వెంకట రెడ్డి మార్కెట్ శాఖ నుంచి(1993లో) రూ.5 లక్షలతో కాలిబాట వంతెన నిర్మించారు. అప్పటి వరకూ దోనె పైనే రైతులు, గ్రామస్థులు కాలవుపై రాకపోకలు సాగించేవారు.అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం కూడా ఆయన హయాంలో నిర్మించారు.
అయితే 1995 నుంచి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.విచిత్రం ఏంటంటే అప్పటినుంచి ఇప్పటివరకు ఆ గ్రామ సర్పంచ్ పదవి జనరల్‌కు ఒక్కసారి కూడా కేటాయించబడలేదు. ఎస్సీ, బీసీల కేటగిరిలకే రిజర్వు అవుతూ వచ్చింది. 21 అక్టోబర్ 1995 నుంచి 23 ఆగస్టు 2001 వరకు బిసి జనరల్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి యనమదల నాగేశ్వరావు(మడికి) సర్పంచ్ పదవి చేపట్టారు. ఆయన హయాంలోనే తొలిసారిగా సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టారు. అలాగే కాలుపై రేవులను నిర్మించారు.ఆ తర్వాత బిసి జనరల్ స్థానంకు టిడిపి పార్టీ నుంచి పంపన సూర్యారావు (మల్లావానితోట) సర్పంచ్ గా గెలిచి 23 ఆగష్టు2001 నుంచి 22 ఆగష్టు2006 వరకూ పనిచేశారు. అనంతరం తొలిసారిగా ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులను పోటీలో నిలపగా స్వతంత్ర అభ్యర్థిగా రెల్లి సామాజిక వర్గానికి చెందిన బంగారి ఆదినారాయణ విజయం సాధించారు. ఆయన 23 ఆగష్టు 2006 నుంచి 22 ఆగష్టు2011 వరకూ సర్పంచ్‌గా పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులు యనమదల నాగేశ్వరరావు తదితరుల కృషి తో నాగులపేట ఇళ్ల స్థలాలు, ఇళ్లు,గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణాలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలలో బిసి మహిళకు రిజర్వ్ కావడంతో గుత్తుల సీతామహాలక్ష్మి(మడికి)గెలుపొందారు. 2ఆగస్టు 2013 నుండి 1 ఆగష్టు2018వరకు సర్పంచుగా పనిచేశారు. ఆ సమయంలో సిమెంట్ రోడ్లు,డ్రెయినేజీలు నిర్మించారు. ఆ తరువాత ఎస్సీ మహిళలకు సర్పంచ్ పదవి రిజర్వ్ కావడంతో రెండేళ్ల క్రితం ఉండ్రాజపు లక్ష్మి మౌనిక చిన్న గెలుపొందారు.
ఇద్దరు ఎంపీపీలు.. ఇద్దరు జడ్పిటిసిలు
ఈ గ్రామానికి రాజకీయంగాను మంచి గుర్తింపు ఉంది. ఏకంగా ఇద్దరు మండల పరిషత్ అధ్యక్షులుగాను,మరో ఇద్దరు జడ్పిటిసిలుగాను పనిచేశారు. అంతేకాదు మరో ఇద్దరు మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పని చేశారు. గత ప్రభుత్వంలో కొత్తపల్లి ధనలక్ష్మి, కొత్తపల్లి వెంకటలక్ష్మి లు టిడిపి పార్టీ నుంచి చెరో రెండున్నర సంవత్సరాలు ఎంపిపిగా పనిచేశారు. అలాగే మండలంలో తొలి జడ్పిటిసిగా ఈ గ్రామానికి చెందిన మామిడిశెట్టి జానికరత్నం(బిసి మహిళ) కాంగ్రెస్ పార్టీ నుంచి 1995లో గెలుపొందారు. ఇదే గ్రామానికి చెందిన మల్లిపూడి ఉదయ భాస్కరరావు(జనరల్) 2001లో టిడిపి పార్టీ నుంచి విజయ సాధించారు. మండల పరిషత్తులు ఆవిర్భవించిన 1985లో మడికి సర్పంచ్ గా గెలుపొందిన కురమళ్ల వీర్రాజు మండల పరిషత్తు ఉపాధ్యక్షులుగా పనిచేశారు.అలాగే మలియాల బాబి మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా చేపట్టారు.అంతేకాక కరుమళ్ల వీర్రాజు, కొత్తపల్లి కృష్ణ లు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు గాను,యనమదల నాగేశ్వరరావు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగాను పనిచేసి మడికి గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు.
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి
రెండేళ్ళ తన పదవి కాలంలో ఎంతో అభివృద్ధి జరిగిందని మరింత అభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ ఉండ్రాజపు లక్ష్మీ మౌనికి తెలిపారు.కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, గ్రామస్థులు,పాలకవర్గం సహకారంతో అభివృద్ధి సాదిస్తున్నామన్నారు. నాలుగు సచివాలయాల పరిధిలో భవన నిర్మాణాలు చేపట్టామ్మారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ భవనాలు కొన్ని పూర్తవుగా మరికొన్ని వివిధ దశలో ఉన్నట్లు వివరించారు. అలాగే రూ. కోటి 20 లక్షలతో త్రాగునీరు అందించేందుకు జల జీవన మిషన్ పధకం ద్వారా మంజూరయ్యాయని ఇప్పటికే రూ.50 లక్షల విలువైన పనులు జరిగాయన్నారు. మరో రూ.70 లక్షలతో పనులు చేపట్టనున్నామన్నారు. నాగుల పేటలో రూ.40 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజి పనులు జరుగుతున్నాయన్నారు.రూ. 15 లక్షలతో చిలకలపాడు డ్రైనేజీ నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ వివరించారు. గ్రామంలో 54 వాలంటీర్లు ద్వారా సంక్షేమ పధకాలు అందరికీ సక్రమంగా అందిస్తున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి మోక్షాంజలి తెలిపారు.
కొండ్రెడ్డి శ్రీనివాస్
Apr 03 2023, 12:56