టెన్త్‌తో సెంట్రల్లో కొలువు.. ప్రిపరేషన్ గైడెన్స్
టెన్త్‌తో సెంట్రల్లో కొలువు.. ప్రిపరేషన్ గైడెన్స్
టెన్త్‌తో సెంట్రల్లో కొలువు సాధించేందుకు సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ మంచి అవకాశం. ఇటీవలే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 9,212 కానిస్టేబుల్(టెక్నికల్, ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి ప్రకటన రిలీజ్ చేసింది. చిన్న వయసులోనే కేంద్ర కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదే మంచి ఛాన్స్. ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ గైడెన్స్ తెలుసుకుందాం..
సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మొత్తం పోస్ట్‌లలో 105 ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్ట్‌ల సంఖ్యను ప్రకటించినప్పటికీ..అభ్యర్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న సీఆర్‌పీఎఫ్ కేంద్రాల్లో నియామకాలు ఖరారు చేస్తారు.
టెక్నికల్ విభాగాలు: పురుష అభ్యర్థులకు 15 విభాగాల్లో, మహిళా అభ్యర్థులకు ఏడు విభాగాల్లో అవకాశాలు కల్పించారు. ఇందులో డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయి కర్మచారి విభాగాలు పురుషులకు కేటాయించారు. బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ పోస్టులు మహిళలకు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు డ్రైవర్ పోస్ట్‌ల అభ్యర్థులు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మెకానిక్ మోటార్ వెహికల్ పోస్ట్‌లకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెకానిక్ మోటార్ వెహికల్ బ్రాంచ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్(డ్రైవర్) ఆగస్ట్1, 2023 నాటికి 21- నుంచి 27ఏళ్లు. మిగతా పోస్టులకు 18- నుంచి 23 ఏళ్లు ఉండాలి. ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎగ్జామ్ సక్సెస్ సీక్రెట్
నాలుగు దశల్లో మొదటి అంచెలో నిర్వహించే రాతపరీక్ష కీలకం. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ విభాగంలో మంచి స్కోర్ సాధించాలంటే వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. విజువల్ మెమరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరీస్, కోడింగ్ – డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, వెన్ డయాగ్రమ్స్ వంటి టాపిక్స్‌పై ఫోకస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్: ఈ విభాగంలో రాణించాలంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఎలిమెంటరీ మ్యాథ్స్: ప్యూర్ మ్యాథ్స్‌తోపాటు అర్థ గణిత అంశాలపై ఫోకస్ చేస్తే ఇందులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. డెసిమల్స్, ప్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీపై దృష్టి పెట్టాలి.
ఇంగ్లీష్: ఇంగ్లీష్/హిందీ సబ్జెక్ట్‌కు సంబంధించి అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషను ఎంచుకోవచ్చు. అధిక శాతం మంది ఇంగ్లీష్ ఎంచుకుంటారు. బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్‌స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్ సాధన చేయాలి.
కామన్ ప్రిపరేషన్
సెంట్రల్తో పాటు స్టేట్‌కు సంబంధించి వివిధ పోటీ పరీక్షలకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఈ సమయంలో ఉమ్మడి సిలబస్ చూసుకొని అన్నింటికి కామన్‌గా ప్రిపరేషన్ కొనసాగిస్తే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రిపరేషన్‌లో భాగంగా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా ఇతర పరీక్షల ప్రిపరేషన్‌తో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పరీక్ష ప్రిపరేషన్‌ను అనుసంధానం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ నియామక పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కానిస్టేబుల్ పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఆ పరీక్షల ప్రిపరేషన్‌నే సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్‌కు ఉపయోగకరంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఒకే సమయంలో వివిధ పోటీపరీక్షలకు ప్రిపేర్ కావచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్
రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్/హిందీ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం వంద మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్: రాత పరీక్షలో చూపిన ప్రతిభ, నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. పురుషులు 170 సెం.మీ ఎత్తు, మహిళలు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. పురుషుల ఛాతి విస్తీర్ణం 80 సెం.మీ.ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు అయిదు సెం.మీ పెరగాలి.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్: మూడో దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఆయా ట్రేడ్స్, విభాగాలకు రన్నింగ్ నిర్వహిస్తారు. డ్రైవర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, కోబ్లర్, టైలర్, మోటార్ మెకానిక్ వెహికల్, గార్డెనర్, బగ్లర్ పోస్టుల అభ్యర్థులు 5 కిలో మీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో (మహిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8 నిమిషాల 30 సెకండ్లలో) చేరుకోవాలి. కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, సఫాయి కర్మచారి, బార్బర్, హెయిర్ డ్రెస్సర్,వాషర్ మ్యాన్ పోస్టుల అభ్యర్థులు 1.6కిలో మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు 12 నిమిషాల్లో చేరుకోవాలి.
ట్రేడ్ టెస్ట్: నాలుగో దశలో 50మార్కులకు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో ప్రాక్టికల్‌గా తమ స్కిల్స్ చూపించాలి. ట్రేడ్ టెస్ట్‌లో తప్పనిసరిగా 20 మార్కులు సాధించాలి. చివరగా మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
నోటిఫికేషన్
సెలక్షన్ ప్రాసెస్: సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్(టెక్నికల్/ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వయసు పోస్టును బట్టి 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ జూన్ 20 నుంచి 25 వరకు జారీ చేస్తారు.
రాతపరీక్ష: జులై 1 నుంచి జులై 13 వరకు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలి.
Apr 01 2023, 16:12