Planes Almost Collide: గాల్లోనే రెండు విమానాలు ఢీకొనబోయి...తృటిలో...
న్యూఢిల్లీ: తృటిలో గగనతలంలో భారీ ప్రమాదం తప్పింది. రెండు విమానాలు గాలిలోనే ఢీకొనబోయి సకాలంలో రాడార్ హెచ్చరిక సంకేతాలతో తప్పించుకున్నాయి..
దీంతో గగనతలంలో భారీ ప్రమాదం తప్పినట్టయింది. సంఘటన వివరాల ప్రకారం, నేపాల్ ఎయిర్‌లైన్స్ (Nepal Airlines)కు చెందిన ఎయిర్‌బస్ A-320 కౌలాలంపూర్ నుంచి ఖాట్మండూ వస్తుండగా, ఎయిర్ ఇండియా (Air India) విమానం న్యూఢిల్లీ నుంచి ఖాట్మండూ వస్తోంది. రెండూ దాదాపు దగ్గరగా వచ్చాయి. ఆ సమయంలో ఎయిర్ ఇండియా విమానం 19 వేల అడుగుల ఎత్తునుంచి కిందకు దిగుతోంది. నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. దీనిపై రాడార్ సంకేతాలు ఇవ్వడంతో ఇరు విమానాల పైలట్లు అప్రమత్తమయ్యారు. నేపాల్ విమానం వెంటనే ఏడు వేల అడుగులకు దిగడంతో ప్రమాదం తప్పిందని నేపాల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కాగా, ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నేపాల్ పౌర విమానయాన సంస్థ ఏర్పాటు చేసింది. ఘటనా సమయంలో కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు అధికారులపై సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CANN) సస్పె్న్షన్ వేటు వేసింది. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ వారిపై చర్య తీసుకున్నట్టు సీఏఏఎన్ ప్రతినిధి ఒక ట్వీట్‌లో తెలిపారు.
Mar 26 2023, 20:03