పాలు లేకుండా చాయ్..

•ఈ చాయ్‌‌ని పాలు పోయకుండా తయారు

•కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

హైదరాబాద్​ సిటీ.. చాయ్​కి ఎంతో ఫేమస్. గల్లీగల్లీకో టీ స్టాల్ ఉంటుంది. ఇరానీ చాయ్ తో పాటు ఎన్నో రకాల టీలను సిటీలో రుచి చూడొచ్చు. మాములుగా అయితే రూ.10 నుంచి రూ. 20కి సింగిల్ టీ దొరుకుతుంది. కానీ అక్షరాలా రూ.1000కి ఒక కప్పు చాయ్ గురించి విన్నారా?

ఈ టీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందంటున్నారు తయారీదారులు. సిటీలో రెండు చోట్ల మాత్రమే ఈ అరుదైన కాస్ట్​లీ చాయ్​ అందుబాటులో ఉంది. కేఫ్ నిలోఫర్ బ్రాంచుల్లో మాత్రమే.. సిటీలోని బంజారాహిల్స్, హిమాయత్​నగర్‌‌‌‌ లోని కేఫ్ నిలోఫర్ ప్రీమియం లాంజ్‌‌లలో ఈ కాస్ట్​లీ చాయ్​ను టేస్ట్ చేయొచ్చు. ఈ ప్రత్యేకమైన చాయ్​ని రూ.వెయ్యికి ఒక కప్పు చొప్పున అమ్ముతున్నారు.

అంత రేటున్నా జనాలు కొని తాగుతున్నారంటే టేస్ట్‌‌ ఏ లెవెల్‌‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2021 నుంచి సిటీలోని ఈ రెండు బ్రాంచుల్లో ఈ చాయ్​ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో వాడే టీ పౌడర్‌‌‌‌లోనే ఉంది అసలు కథంతా. ఈ టీ పొడి ధరే కిలోకి లక్షన్నర. అది కూడా అంత ఈజీగా దొరకదు. వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏడాది ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

మాస్కులు, ముందు జాగ్రత్తలతో రక్ష

•వారం రోజుల్లో 18 మందికి కొవిడ్‌

•చాపకింద నీరులా మళ్లీ కరోనా విస్తరిస్తోంది

వారం రోజుల వ్యవధిలో ర్యాండమ్‌ పరీక్షల్లోనే 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కలగడం కలవరం కలిగిస్తున్నది. కొత్తరకం వైరస్‌తో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశవ్యాప్తంగా కూడా ఆక్టివ్‌ కేసులు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మార్చి నెలలో గడిచిన వారం రోజుల్లో 18 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జిల్లా ఆసుపత్రికి వచ్చినవారికి ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. రెండు యాక్టివ్‌ కేసులు కట్టరాంపూర్‌లో, మరో రెండు సప్తగిరికాలనీలో, తిమ్మాపూర్‌లో రెండు, మానకొండూర్‌లో రెండు, చామనపల్లిలో ఒక కరోనా కేసు నమోదైంది. కరోనా సోకినవారు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. వీరందరికి వారం రోజుల క్వారంటైన్‌ను అధికారులు సూచించారు.

జిల్లాలో 11,19,947 మంది 18 ఏళ్లు నిండిన వారు ఉండగా, ఎనిమిది లక్షల మందికిపైగా రెండు డోసుల వ్యాక్సినేషన్లు తీసుకున్నారు. పలువురు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్‌ చేశారు. బూస్టర్‌ డోసు కూడా కొందరు తీసుకోగా కరోనా ప్రభావం తగ్గిపోవడం, మూడో వేవ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందుకే బూస్టర్‌ డోస్‌కు చాలామంది ముందుకు రాలేదు. ప్రస్తుతం మళ్లీ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఒకవైపు కరోనా, మరోవైపు ఫ్లూ విస్తరిస్తుండడంతో మాస్కులు ధరించడమే మంచిదనే అభిప్రాయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ ప్రచారం చేస్తున్నది. మాస్కులు ధరించి, చేతులు శుభ్రం చేసుకోవడం, కనీస జాగ్రత్తలను పాటించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే కొందరు మాస్కులు ధరిస్తున్నారు.

విజృంభిస్తున్న ఫ్లూ..

జిల్లాలో రోజురోజుకు ఫ్లూ విస్తరిస్తోంది. వందలాది మంది జ్వరపీడితులుగా మారుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలపై ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్నది. పిల్లలు, పెద్దలు అందరికి 102, 103 డిగ్రీల జ్వరం, దగ్గు, జలుబు, ఒంటి నొప్పులు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భరించలేని బాధతో రోజురోజుకు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. జిల్లా కేంద్ర ఆసుపత్రికి ప్రతిరోజు 700 నుంచి సుమారు వెయ్యి మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తున్నారు. అందులో ఫ్లూ బాధితులే 50 శాతానికి మించి ఉంటున్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆసుపత్రులలో చేరి చికిత్స పొందుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో రోజుకు 100 నుంచి 150 మంది ఫ్లూ బాధితులు ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వెయ్యి నుంచి రెండు వేల మంది ఔట్‌ పేషెంట్లుగా, సుమారు వెయ్యి మంది ఇన్‌ పేషెంట్లుగా చేరుతున్నారని తెలుస్తున్నది. ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకొని మాస్కులు ధరించాలని, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలో తిరగక పోవడం, భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే తగు జాగ్రత్తలతో ఆహారం తీసుకుంటే ఫ్లూ, కరోనా రాకుండా ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. శానిటైజర్లను వినియోగించాలని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి...

- డాక్టర్‌ రఘురామన్‌, సీనియర్‌ ఫిజిషియన్‌

ఫ్లూతో బాధపడేవారు కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాలి. శానిటైజర్‌తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. గుంపులుగా ఉన్న చోటకు వెళ్లకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. వారిలో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారు లేదా, ఫ్లూతో బాధపడుతున్నవారు ఉంటే క్వారంటైన్‌లో ఉంచాలి. మందులు వాడాలి. సొంత వైద్యం చేసుకోవద్దు. డాక్టర్‌ను సంప్రదించాలి. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా ఉండడం మంచిది.

ISRO LVM3-M3 Operation Success: ఇస్రో LVM3-M3 రెండో ప్రయోగం కూడా సక్సెస్, 36 ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్‌ వెబ్‌ తో గతంలో ఒప్పందం చేసుకుంది. 2022 అక్టోబరు 23న 36 ఉపగ్రహాలు, ఈరోజు మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. LVM3-M3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు. విజిబిల్ ఏరియాలో ఆ శాటిలైట్స్ సెపరేషన్ జరగదని చెప్పారు. రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్.  ఈ ప్రయోగం ద్వారా UKకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ Ltd, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450Kms ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4° వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
నేడు తెలంగాణ సరిహద్దు గ్రామానికి అమిత్ షా

హైదరాబాద్‌: తెలంగాణ సరిహద్దుల్లోని కర్ణాటకలోని ఓ గ్రామంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌ స్టేట్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతంలోని గోర్ట గ్రామంలో జరిగిన విముక్త పోరాటంలో 200 మంది గ్రామస్తులు మరణించారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 75వ హైదరాబాద్‌ స్టేట్‌ విలీన ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొంటారు. ఈ సందర్భంగా గోర్ట గ్రామంలో అమరవీరుల స్మారక చిహ్నం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాలను అమిత్‌ షా ఆవిష్కరిస్తారు.

తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్ కు శనివారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సంజయ్‌ స్వాగతం పలికారు.

Minister Suresh Safe: మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం..

విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్ లో పారా మోటరింగ్ కు వెళ్ళేందుకు సిద్ధమవ్వగా ఇసుక తిన్నెల్లో ఒరిగిపోయింది..

ఈ ఘటనతో మంత్రి సురేష్ తో పాటు అక్కడే వున్న ఇతర మంత్రులు షాక్ అయ్యారు. G20 సదస్సుల్లో భాగంగా విశాఖలో మారథాన్, సాహసక్రీడలు జరుగుతున్నాయి.ఆదివారం కావడంతో ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా G20 మారథాన్ ప్రారంభం అయింది. మారథాన్ ప్రారంభించారు మంత్రులు ఆదిమూలపు సురేష్,విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్..

ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్….నిర్వాహకులు ఆహ్వానం మేరకు పారా మోటారింగ్ రైడ్ కు బయలు దేరారు. ఈ ఈవెంట్స్ ను మంత్రి విడదల రజనీ జెండా ఊపి ప్రారంభించారు. అయితే, పారా మోటరింగ్ ఫస్ట్ రైడ్ కు వెళ్ళేందుకు ఉత్సాహం చూపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అయితే, విండ్ డైరెక్షన్ సహకరించకపోవడంతో కుదుపులకు గురైంది. మంత్రి క్షేమంగా ఉండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది..

LB nagar flyover : ఇక సిగ్నల్‌ ఫ్రీగా ఎల్బీనగర్‌ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో ఈరోజు సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది.

వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు..

విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు..

Disqualified MPs - MLAs | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది..

అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (MP/MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(Mohammed Faizal)ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (MP) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (Azam Khan).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..

APPSC Group4: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది..

రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు.. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు..

దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు..

దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు (opposition parties) తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.

ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల (central probe agencies) వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం..ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ ED) వంటి దర్యాప్తు సంస్థలు.. కేవలం భాజపా (BJP) ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్‌లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ (CBI), ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు భాజపాలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. ''95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు (central probe agencies) పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటీ?'' అని విపక్ష పార్టీలు ఈ పిటిషన్‌లో కోరాయి.

కాంగ్రెస్‌ (Congress) సహా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), జనతా దళ్‌ యునైటెడ్‌ (JDU), భారత్‌ రాష్ట్ర సమితి (భారాస BRS), రాష్ట్రీయ జనతా దళ్‌ (RJD), సమాజ్‌వాదీ పార్టీ (SP), శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం), నేషనల్‌ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP), వామపక్షాలు, డీఎంకే (DMK) పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ దాఖలు చేశాయి. మరోవైపు విపక్షాల ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీ (Probe Agencies)లు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేసింది..

Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు..

•ప్రాతినిధ్యం కోల్పోయిన భాజపా

అమరావతి: తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది..

ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..

తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి.

తెదేపాకు చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు..

వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు..