APPSC Group4: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది..

రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిచేసిన అధికారులు.. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షకు మార్చి 27 నుంచి అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, ఈ ఉద్యోగాల కోసం గతంలో నిర్వహించిన స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వారిలో 11,574 మంది మాత్రమే మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు..

దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు..

దిల్లీ: రాజకీయ కుట్రలో భాగంగా సీబీఐ (CBI), ఈడీ (ED) వంటి సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలు (opposition parties) తాజాగా ఈ విషయంపై మూకుమ్మడిగా సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు.

ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల (central probe agencies) వివక్షపూరిత వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 రాజకీయ పార్టీలు శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం..ఏప్రిల్ 5న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ ED) వంటి దర్యాప్తు సంస్థలు.. కేవలం భాజపా (BJP) ప్రత్యర్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఈ పిటిషన్‌లో విపక్షాలు ఆరోపించాయి. ఒకవేళ సీబీఐ (CBI), ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నేతలు భాజపాలో చేరితే.. ఆ తర్వాత వారిపై ఉన్న కేసులు ముగిసిపోతున్నాయని దుయ్యబట్టాయి. ''95శాతం కేసులు ప్రతిపక్షాలపైనే. అరెస్టుకు ముందు, తర్వాత దర్యాప్తు సంస్థలు (central probe agencies) పాటిస్తున్న మార్గదర్శకాలు ఏమిటీ?'' అని విపక్ష పార్టీలు ఈ పిటిషన్‌లో కోరాయి.

కాంగ్రెస్‌ (Congress) సహా, తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC), ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP), జనతా దళ్‌ యునైటెడ్‌ (JDU), భారత్‌ రాష్ట్ర సమితి (భారాస BRS), రాష్ట్రీయ జనతా దళ్‌ (RJD), సమాజ్‌వాదీ పార్టీ (SP), శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం), నేషనల్‌ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP), వామపక్షాలు, డీఎంకే (DMK) పార్టీలు సంయుక్తంగా ఈ పిటిషన్‌ దాఖలు చేశాయి. మరోవైపు విపక్షాల ఆరోపణలను భాజపా తోసిపుచ్చింది. దర్యాప్తు ఏజెన్సీ (Probe Agencies)లు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టం చేసింది..

Andhra News: మండలిలో మారనున్న బలాబలాలు..

•ప్రాతినిధ్యం కోల్పోయిన భాజపా

అమరావతి: తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. వీరిలో అధికార వైకాపా సభ్యుల సంఖ్య ప్రస్తుతమున్న 33 నుంచి (గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి) 44కు చేరుకోనుంది..

ప్రతిపక్ష తెదేపా సభ్యుల సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది. భాజపాకు ఉన్న ఒక్క సభ్యుడూ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది..

తాజాగా ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2.. మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైకాపా, 4 స్థానాలు తెదేపా దక్కించుకున్నాయి.

తెదేపాకు చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు, మే నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు..

వైకాపాకు చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు..

టీడీపీలోకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

నెల్లూరు:వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి నేడు టీడీపీలో చేరబోతున్నారు..

మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరబోతున్నట్టు ఆయన చెప్పారు. అందరూ తరలివచ్చి తనకు మద్దతు తెలపాలని కోరారు. టీడీపీలో చేరుతున్న సందర్భంగా చంద్రబాబునాయుడు, లోకేశ్ ఫొటోలున్న ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు..

ఉదయం నెల్లూరులో భారీ ప్రదర్శన అనంతరం తాడేపల్లికి వెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారు. గిరిధర్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరుతారు.

వైసీపీ నేత అయిన గిరిధర్‌రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సోదరుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతూ రెబల్‌గా మారారు. ఆయన కూడా పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది..

పెండింగ్‌ బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలి

•తపస్ మంచిర్యాల

దీర్ఘకాలికంగా e-kubher వద్ద పెండింగ్ లో ఉన్న వివిధ రకాల బిల్లులను మార్చి 31 లోపల విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ, హైదరాబాద్ కు మంచిర్యాల జిల్లా ట్రెజరీ అధికారి ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి బండి రమేష్ తెలిపారు.

ఏప్రిల్ 2022 నుండి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లులైన 8నెలల పిఆర్సి ఎరియర్స్, సిపిఎస్ డిఎ ఎరియర్స్, పింఛన్ బకాయిలు, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు, జిపిఎఫ్ లోన్లు, టి ఎస్ జి ఎల్ ఐ లోన్లు, సప్లమెంటరీ వేతనాల బిల్లులు, సంపాదిత సెలవుల బిల్లులు, KGBV ఉపాధ్యాయుల వేతన బిల్లులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బిల్లులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ బకాయిల బిల్లులన్నీ ట్రెజరీల్లో మంజూరు అయినప్పటికీ

గత 6నెలల నుండి సంవత్సరం క్రిందటి వరకు సంబంధించిన బిల్లుల బకాయిలు నేటికీ వారి ఖాతాలలో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సంవత్సరం మరొక వారం రోజుల్లో ముగుస్తున్నందున వెంటనే నిధులను విడుదల చేయాలని, ఇప్పుడు నిధులు విడుదల కాకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు జరిగేదాకా నిధులు విడుదల కాక ఇంకా చాలా ఆలస్యం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేసి వారి ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సయింపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బగ్గని రవికుమార్, జిల్లా నాయకులు చీర సమ్మయ్య, భారతీ అశోక్, నీలేష్ కుమార్, ఎలగందుల రమాదేవి, అడిచర్ల రాజ్ కుమార్, తుల మధుకర్, ఎల్ సత్యనారాయణ, మండల నాయకులు అంకం రమేష్, ఆత్రం నారాయణ, చెట్ల శ్రీకాంత్, మ్యాకం రమేశ్, ఉప్పుల రూపాచారి, దుర్గం చందు, గాజుల రాజేశ్వర్, మహేష్, సందీప్, బింగి రాజ్ కుమార్, పివికె ప్రసాద్ లు పాల్గొన్నారు.

సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్ మేరకే నిర్మాణం: పోలవరం ఎత్తుపై ఏపీ అసెంబ్లీలో జగన్

అమరావతి: సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు డ్యామ్ ఎత్తు ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మొద్దని సీఎం జగన్ కోరారు..

ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చకు ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు.

45.7 మీటర్లు ఎత్తు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సిఫారసు మేరకు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు కడతామని సీఎం జగన్ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయమై తాను ఇటీవల ప్రధానిని కలిసినట్టుగా ఆయన వివరించారు.

తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు..

హైదరాబాద్‌: తెలంగాణ(Telangana) లో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Meteorological Centre) వెల్లడించింది..

ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మరోవైపు పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదై.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు..

Polavaram: 'పోలవరం' ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతానికి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పింది..

పార్లమెంటులో వైకాపా ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని స్పష్టం చేశారు. తొలిదశ సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికే పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు.

అయితే, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఖరారైందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. సహాయ, పునరావాసం మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నా... అందులో కూడా జాప్యం జరిగిందని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా వివరించారు..

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

దిల్లీ: ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది..

ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్‌ న్యాయస్థానంలోనే ఉన్నారు..

'మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు' అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ (Rahul Gandhi) వ్యాఖ్యానించారని గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

అలా అనలేదని న్యాయస్థానానికి రాహుల్‌ తన వాదనను వినిపించారు. కానీ, కోర్టు మాత్రం ఐపీసీ సెక్షన్‌ 499, 500 ప్రకారం ఆయనను దోషిగా తేల్చింది. వెంటనే రాహుల్‌ అభ్యర్థన మేరకు బెయిల్‌ కూడా మంజూరు చేసింది..

కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మహాత్మా గాంధీ చేసిన ఓ వ్యాఖ్యను కోర్టు తీర్పు తర్వాత ట్వీట్‌ చేశారు. ''సత్యం, అహింసపైనే నా ధర్మం ఆధారపడి ఉంది. సత్యం నా భగవంతుడు. ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన సాధనమే అహింస'' అని పేర్కొన్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. ''నా సోదరుడు (రాహుల్‌ గాంధీ) ఎప్పుడూ భయపడలేదు. భవిష్యత్‌లో భయపడడు కూడా..'' అని అన్నారు.

తీన్మార్‌ మల్లన్నకు రిమాండ్‌..

ఆచూకీ చెప్పాలని పోలీస్‌ స్టేషన్‌కు భార్య..

హైదరాబాద్‌: మేడిపల్లి పీఎస్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై దాడి చేశారన్న కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నతోపాటు మరో నలుగురిని పోలీసులు బుధవారం ఉదయం హయత్‌నగర్‌ మేజి్రస్టేట్‌ ముందు హాజరు పర్చారు. మేజిస్ట్రేట్‌ మల్లన్నతోపాటు నలుగురు వ్యక్తులకు 14 రోజులు రిమాండ్‌ విధించడంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. రాత్రి అరెస్టు చేసిన మల్లన్నను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకుచ్చారు. కాగా, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే వరకు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం సాయంత్రం 5 గంటలకు పీర్జాదిగూడలో చైన్‌ స్నాచింగ్‌ నేరాలను నిరోధించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కానిస్టేబుళ్ల వద్దకు వచ్చి ఎవరు మీరు! అని ప్రశ్నించారు. తాము పోలీసులమని చెబుతున్నా.. వినకుండా వారిని కొట్టి, లాఠీలను లాక్కొని బలవంతంగా సమీపంలో ఉన్న క్యూ న్యూస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆఫీసు ముందు తిరుగుతున్నారని, దీంతో అనుమానం వచ్చి తీసుకొచ్చామని కానిస్టేబుళ్ల గురించి మల్లన్నకు తెలిపారు. వారిని తన గదిలోకి తీసుకురావాలని మల్లన్న చెప్పడంతో లోపలికి తీసుకెళ్లి కానిస్టేబుళ్ల సెల్‌ఫోన్లు లాక్కొని, రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.. కర్రలతో దాడి చేశారు.

ఈ విషయం తెలుసుకున్న రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను పంపించారు. సీనియర్‌ పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్‌ ఆఫీసుకు చేరుకొని నిర్బంధంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షించారు. వారిని నిర్బంధించిన తీన్మార్‌ మల్లన్నతో పాటు క్యూ న్యూస్‌ ఎడిటర్‌ బండారు రవీందర్, డ్రైవర్‌ ఉప్పాల నిఖిల్, ఆఫీసు బాయ్‌ సిర్రా సుధాకర్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చింత సందీప్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవటంతో పాటు అక్రమంగా బంధించడం, కర్రలతో దాడి చేయడం వంటి నేరంపై ఆ ఐదుగురిపై ఐపీసీ సెక్షన్‌ 363, 342, 395, 332, 307 ఆర్‌/డబ్ల్యూ 34, సెక్షన్‌ 7(1) కింద కేసులు నమోదు చేశారు.

నా భర్త ఆచూకీ చెప్పండి..

ఇదిలా ఉండగా తన భర్త ఆచూకీ చెప్పాలని తీన్మార్‌ మల్లన్న భార్య మమత మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, లాయర్లతో కలసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ వెళ్లిన ఆమె, తన భర్తను ఎందుకు అరెస్ట్‌చేశారని, ఎక్కడికి తీసుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాలని కోరారు. కాగా, పోలీసులు మల్లన్నతో ఫోన్‌లో మాట్లాడిస్తామని ఆమెకు హామీ ఇచి్చనట్లు సమాచారం..