Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
దిల్లీ: ఓ పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది..
ఆ వెంటనే ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. అలాగే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. తీర్పు వెలువరించిన సమయంలో రాహుల్ న్యాయస్థానంలోనే ఉన్నారు..
'మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు' అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్ (Rahul Gandhi) వ్యాఖ్యానించారని గుజరాత్ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
అలా అనలేదని న్యాయస్థానానికి రాహుల్ తన వాదనను వినిపించారు. కానీ, కోర్టు మాత్రం ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారం ఆయనను దోషిగా తేల్చింది. వెంటనే రాహుల్ అభ్యర్థన మేరకు బెయిల్ కూడా మంజూరు చేసింది..
కోర్టు తీర్పు అనంతరం రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. మహాత్మా గాంధీ చేసిన ఓ వ్యాఖ్యను కోర్టు తీర్పు తర్వాత ట్వీట్ చేశారు. ''సత్యం, అహింసపైనే నా ధర్మం ఆధారపడి ఉంది. సత్యం నా భగవంతుడు. ఆయన్ని చేరుకోవడానికి కావాల్సిన సాధనమే అహింస'' అని పేర్కొన్నారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ.. ''నా సోదరుడు (రాహుల్ గాంధీ) ఎప్పుడూ భయపడలేదు. భవిష్యత్‌లో భయపడడు కూడా..'' అని అన్నారు.
Mar 23 2023, 18:52