Influenza: ఫ్లూ లక్షణాలివే.. ఈ పనులు చేయొద్దు..!
వేసవికాలంలో అడుగుపెడుతున్న సమయంలో జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు (Viral Fevers) ప్రజలను కంగారు పెడుతున్నాయి. కొవిడ్ (Covid) తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా (Influenza) కేసులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ’ ఉప రకమైన ‘హెచ్3ఎన్2 (H3N2)’ అనే వైరస్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ICMR), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. ఇంతకీ ఈ ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలేంటీ..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఫ్లూ లక్షణాలివే..
గత రెండు మూడు నెలలుగా ఈ ఫ్లూ (Influenza) కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇతర సబ్‌టైప్‌లతో పోల్చితే ఈ ‘హెచ్3ఎన్2 (H3N2)’ రకం ఎక్కువగా ఆసుపత్రిలో చేరికలకు కారణమవుతోంది. దీని ప్రధాన లక్షణాలు.. ఎడతెరపి లేని దగ్గు (Cough), జ్వరం (Fever). దీంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు, వికారం, వాంతులు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఫ్లూ (Influenza) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ఐసీఎంఆర్ (ICMR) కొన్ని జాగ్రత్తలు చెప్పింది. అవి..
తరచూ చేతులను సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.
పైన చెప్పిన లక్షణాల్లో ఏవైనా మీకు కన్పిస్తే..
మాస్క్ (Mask) ధరించాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దు.
నోరు, ముక్కును పదే పదే తాకకూడదు.
దగ్గుతున్నప్పుడు, ముక్కు కారుతున్నప్పుడు మీ ముక్కు, నోటిని కవర్ చేసుకోవాలి.
ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. అధిక మొత్తంలో ద్రవాలు తీసుకోవాలి.
జ్వరం (Fever), ఒళ్లునొప్పులు ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ మందులు వాడాలి.
ఇవి చేయొద్దు..
కరచాలనం చేయడం.. ఆలింగనం చేసుకోవడం వంటివి చేయొద్దు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదు.
ఇతరులు లేదా కుటుంబసభ్యులకు దగ్గరగా కూర్చుని ఆహార పదార్థాలను తినకూడదు.
సొంత చికిత్సలు వద్దు. యాంటీబయాటిక్స్ (Antibiotics), ఇతర ఔషధాలను వైద్యులను సంప్రదించిన తర్వాతే ఉపయోగించాలి.
‘‘ఈ కొత్త రకం ఇన్‌ఫ్లుయెంజా (Influenza) ప్రాణాంతకమైనదేం కాదు. కాకపోతే కొంతమంది బాధితులు శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో కొందరికి కొవిడ్ తరహా లక్షణాలు కన్పిస్తున్నాయి. అయితే పరీక్షల్లో వారికి నెగెటివ్ అనే వస్తోంది. అలా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వైరస్ పట్ల అప్రమత్తత అవసరం. జాగ్రత్తగా ఉంటే చాలు’’ అని వైద్యులు సూచిస్తున్నారు.
Mar 05 2023, 20:51