సన్నబియ్యం అని చెప్పి.. దొడ్డు బియ్యం పెడతారా?: రేవంత్
సిరిసిల్ల: సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామంటున్న ప్రభుత్వం దొడ్డుబియ్యం అందిస్తోందని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.సిరిసిల్లలో ప్రభుత్వ బీసీ బాలికల వసతిగృహాన్ని ఆయన పరిశీలించారు. హాస్టల్ భోజనం, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖర్చుల కోసం ప్రభుత్వం తక్కువ డబ్బులు ఇస్తోందని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హాస్టళ్లలో మెరుగైన మెనూ ఉండాలా చూస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. అనంతరం సిరిసిల్ల చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ అరాచకాలను తరిమికొట్టేందుకు ఇక్కడి వచ్చిన ప్రజలందరికీ అభినందనలు అంటూ ప్రసంగం ప్రారంభించారు.
‘‘ తెలంగాణ ఉద్యమం కోసం పదవీ త్యాగం చేసిన నేతన్న కొడుకు కొండా లక్ష్మణ్ బాపూజీ.. 2001లో కేసీఆర్‌కు పార్టీ ఆఫీసు ఇచ్చి ఆశీర్వదించారు. అలాంటి వ్యక్తి చివరి చూపులకి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఓట్లేసి గెలిపించిన సిరిసిల్ల ప్రజలను పోలీసుల బూట్ల కింద కేటీఆర్ నలిపేస్తున్నాడు. అమరుల కుటుంబాలను ప్రగతిభవన్‌కు పిలిపించి అన్నం కూడా పెట్టని కేసీఆర్.. తెలంగాణ నా కుటుంబం అని ఎలా అంటారు?. ఉద్యమకారులంతా ఆస్తులు పోగొట్టుకుంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రం ఆస్తులు సంపాదించుకుంది. అలాంటి వారిని తెలంగాణ పొలిమేరల దాకా తరమాలి’’ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Mar 05 2023, 10:01